ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ పై కేసీఆర్ ఫైర్.. ప్రీతి ఘటనపై కేటీఆర్ రియాక్షన్.. తెలంగాణలో ఆ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. మరో డాక్టర్ ఆత్మహత్య.. డీ శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్తత.. కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే!

మనీష్ సిసోడియా అరెస్ట్ పై కేసీఆర్ ఫైర్

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇది అదానికి, ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదన్నారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.

ప్రతీ ఘటనపై స్పందించిన కేటీఆర్

వేధింపుల కారణంగా వైద్య విద్యార్థి ప్రీతి మృతి చెందిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో కొందరు కావాలే రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. నిందితుడు సైఫ్ అయినా, సంజయ్ అయినా వదలబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసానిచ్చారు. సోమవారం హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 6 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం 16న విత్ డ్రా, మార్చి 23న పోలింగ్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని సీఈసీ షెడ్యూల్ లో పేర్కొంది.

మరో డాక్టర్ ఆత్మహత్య


హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు డాక్టర్ మజూర్ ఆత్మహత్య చేసుకున్నారు. చాలా కాలాంగా ఆయనకు భార్యతో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆస్తి పంపకాలు కొలిక్కిరాకపోవడం తదితర కారణాలతోనే మజూర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భైరి నరేష్ పై దాడి

హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగేందుకు యత్నించి దేహశుద్ధి చేశారు. వాహనంలోకి వెళ్లి కొట్టారు. గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద భైరి నరేష్ వివాదాస్పద వాఖ్యలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లాడు. ఇటీవల బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోకుండా వాఖ్యలు చేస్తున్నాడని అయప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీ.శ్రీనివాస్ కు అస్వస్తత

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ తీవ్ర అస్వస్తతకు గురయ్యారని ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీ.శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన పీసీసీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. కేసీఆర్ రాజ్యసభ అవకాశం ఇచ్చారు. కానీ చాలా రోజులగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇందిరమ్మ రాజ్యానికి ఓటేయ్యాలన్న రేవంత్

రాబోయే ఎన్నికల్లో రాక్షస పాలనకు బుద్ధి చెప్పి ఇందిరమ్మ రాజ్యానికి ఓటెయ్యాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశమిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి.. పేదోడు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని, గ్యాస్‌ ధర తగ్గిస్తామని హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల నుంచి సోమవారం హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర మొదలైంది. అక్కడి నుండి రాయపర్తి, నర్సక్కపల్లి, మల్లక్కపేట మీదుగా యాత్ర పరకాలకు చేరుకుంది.

నేడు రాష్ట్రానికి మాణిక్ రావు ఠాక్రే

కాంగ్రెస్ ​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం రాష్ట్రానికి వస్తున్న ఆయన.. ముఖ్య నేతలతో వరుస సమావేశం కానున్నారు. ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాడ.. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతోపాటు నల్లగొండ లోక్​సభ సెగ్మెంట్ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతారు. అదే రోజు హాత్​సే హాత్​ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారంలోనూ పాల్గొంటారు.

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు

కింగ్‌ ఫిషర్‌ బీర్లు జగిత్యాలకు చెందిన ఓ యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. పట్టణానికి చెందిన బీరం రాజేశ్‌ జగిత్యాలలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతకు తన ఫిర్యాదును అందజేశాడు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా వ్యవహరించి అన్ని బ్రాండ్‌లకు చెందిన బీరు, విస్కీలను విక్రయించకుండా నాణ్యతలేని కంపెనీలకు చెందిన మద్యం మాత్రమే విక్రయిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. మద్యం వ్యాపారుల అక్రమాలపై విచారణ జరిపి కింగ్‌ ఫిషర్‌ బీర్లు జగిత్యాలలో అందుబాటులోకి తీసుకురావాలని రాజేశ్‌ కోరారు.

లాసెట్, ఈసెట్ దరఖాస్తులు మార్చి 2 నుంచి..

తెలంగాణలో లాసెట్, ఈసెట్ షెడ్యూళ్లను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను మార్చి 2 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి నోటిఫికేషన్ 1వ తేదీన విడుదల అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే నేడు ఐసెట్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here