Homelatestప్రీతి కన్నుమూత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి.. ఢిల్లీ డిప్యూటీ...

ప్రీతి కన్నుమూత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి.. ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్.. మహిళలకు మంత్రి హరీశ్ గుడ్ న్యూస్.. తెలంగాణ ఎంసెట్ పై కీలక అప్టేట్.. కేసీఆర్ సర్కార్ పై షర్మిల కొత్త స్కెచ్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

ప్రీతి కన్నుమూత:

సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఐదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఆమె ప్రాణాలను కాపాడడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించలేదని నిమ్స్ ఆస్పత్రి ప్రకటనలో పేర్కొంది. ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది. తమ కుమార్తె ఇకలేదన్న వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం.

రూ.30 లక్షల పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం

ప్రీతి మరణించి తర్వాత కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె తండ్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలేజీ హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ ఆస్ప్రతి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరో రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, అంతేకాకుండా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపిస్తానని మంత్రి చెప్పినట్లు ప్రీతి తండ్రి  పేర్కొన్నారు.  హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సైతం హామీ ఇచ్చారని చెప్పారు. 

మరో విద్యార్థిని బలి

ప్రీతి ఘటన వరంగల్ జిల్లాలో ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలైంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతురు రక్షిత (20) వరంగల్ జిల్లా నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. రక్షిత ఫొటోలను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి.. వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరోవైపు ప్రీతి లాగే తమ కూతురు కూడా సీనియర్ల వేధింపులకు బలయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తెలంగాణలో మరో రూ.500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కోర్నింగ్ (Corning Inc)‌, ఎస్‌జీడీ ఫార్మా (SGD Pharma) సంస్థలు ప్రకటించాయి. రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ సామగ్రి ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టనున్నాయి. బయో ఏషియా (Bio Asia 2023)లో సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు (Minister KTR) తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించాయి.

ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని.. నిబంధలకు విరుద్దంగా టెండర్ల అప్పగించారని ఆయనపై ముందు నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ నిన్న మరోసారి ప్రశ్నించింది. దాదాపు 8 గంటల విచారణ అనంతరం.. ఆయనను అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని.. అందులో మనీశ్ సిసోడియా హస్తముందని సీబీఐ వెల్లడించింది. బ్యూరోక్రాట్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేసింది.

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన కేటీఆర్

మనీష్ సిసోడియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు ఆప్రజాస్వామికమన్నారు. బీజేపీ పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అని అన్నారు.

ఎంసెట్ పై కీలక నిర్ణయం

ఎంసెట్ ప్రవేశ్ పరీక్షకు సంబంధించి ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కుల వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు జీఓ విడుదల కానున్నట్లు సమాచారం.

మహిళలకు మంత్రి హరీశ్ రావు శుభవార్త

మహిళా సంఘాల సభ్యులకు మార్చి నుంచి పావలా వడ్డీ రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పావలా వడ్డీ రుణాలివ్వలేదదన్నారు. మార్చి, జూన్‌, జూలై నెలల్లో ఇస్తామని చెప్పారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం సమీపంలో రూ.24 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌తోపాటు కోటి రూపాయలతో నిర్మించే ఎర్లీ డిటెక్షన్‌ సెంటర్‌ పనులకు ఆదివారం హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.

రాష్ట్రపతి పాలన కోసం షర్మిల విజ్ఞప్తి

రాష్ట్రంలో విపక్షాల నేతలు, కార్యకర్తలపై బీఆర్‌ఎస్‌ దాడుల నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ విజ్ఞప్తి చేద్దామని విపక్షాలను కోరేందుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్‌, బీఎస్పీ తదితర పార్టీల ముందు ప్రతిపాదన పెట్టి ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం వారికి షర్మిల స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మేరకు షర్మిల గవర్నర్ కు సైతం వినతి పత్రం అందించారు.

నేడు ధరణిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

ధరణిలో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ సోమవారం సమావేశం కానుంది. భూ సమస్యలు పరిష్కరించేందుకు ధరణిలో కొత్త మాడ్యూళ్లు తెస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని సమస్యల పరిష్కారానికి ధరణిలో ఆప్షన్లు లేవు. వాటి కోసం కొత్త మాడ్యూళ్లు తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ. సాదాబైనామా, జీవో 58కి సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc