2400 స్టాళ్లతో నుమాయిష్
నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 82 వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ను మంత్రులు మంత్రి హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 2400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులు ఈ స్టాళ్లను విక్రయిస్తారు. ఎగ్జిబిషన్లో దాదాపు 1,500 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు.
లైంగిక వేధింపులు.. మంత్రి రాజీనామా
హర్యానా క్రీడాశాఖ మంత్రి, బీజేపీ నేత సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను మంత్రి వేధించారంటూ.. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా పనిచేస్తున్న ఒక మహిళ రాష్ట్ర హోంమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో క్రీడాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. దర్యాప్తు నివేదిక వచ్చేదాకా.. తన శాఖను సీఎంకు అప్పగిస్తున్నానని తెలిపారు.
బీఆర్‌ఎస్‌లోకి ఏపీ లీడర్లు
ఏపీలోని ముగ్గురు నేతలు సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. జనసేన నేత తోట చంద్రశేఖర్ సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. అలాగే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
కొత్తగూడ్ ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
న్యూ ఇయర్ కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ జాతికి అంకితం చేశారు. కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లను కలుపుతూ ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.
చంద్రబాబు మీటింగ్‌లో మళ్లీ తొక్కిసలాట
టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. సభా ప్రాంగణంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా… మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మహిళలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు ముందుకు తోసుకురావటంతో తొక్కిసలాట జరిగింది. నాలుగు రోజుల క్రితమే నెల్లూరు జిల్లా కందూకూరులో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా తొక్కిసలాట జరగడంతో 8 మంది చనిపోయారు.
గవర్నర్‌ను విష్ చేయని సర్కార్
రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌కు అధికారుల డుమ్మా కొట్టారు. న్యూఇయర్ వేళ రాజ్‌భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించ లేదు. న్యూఇయర్ రోజు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున గవర్నర్‌కు విషెస్ తెలిపే సంప్రదాయానికి బ్రేక్ వేశారు.
చైనా వల్ల కాదు: దలైలామా
టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌద్ధ మతాన్ని నాశనం చేయాలని చైనా ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాల్లో ఆ దేశం విజయం సాధించబోదని చెప్పారు. బౌద్ధ మతం విషపూరితమైనదని చైనా భావిస్తోందని, ఆ మతాన్ని నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తోందని దలైలామా ఆరోపించారు. చైనా నుంచి ఆ మతాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు.
మార్చిలో ఎస్‌ఐ, కానిస్టెబుల్ మెయిన్స్
పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తుది అంకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12 నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న సివిల్ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. కాగా, ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ నెల 5న దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను నియామక మండలి ఖరారు చేసింది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.
పాక్ జైళ్లలో 705 మంది ఇండియన్స్
భారత్, పాకిస్థాన్‌లు తమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఆదివారంనాడు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. కాన్సులర్ యాక్సిస్‌పై 2008లో కుదిరిన ఒప్పందం నిబంధనల ప్రకారం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని దౌత్య కార్యాలయాల్లో అధికారులు ఈ జాజితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఈ జాబితాను మార్చుకుంటారు. జాబితాలోని వివరాల ప్రకారం, 339 సాధారణ పౌరులు, 95 మంది పాకిస్థానీ మత్స్యకారులు ప్రస్తుతం భారతదేశ కస్టడీలో ఉన్నారు. పాకిస్తాన్ జాబితాలో 51 మంది భారత పౌరులు, 654 మంది మత్స్యకారులు వారి కస్టడీలో ఉన్నారు.