డాక్టర్ రూప.. చిన్నారి పెళ్లి కూతురు

నగరాల్లో, పట్టణాల్లో ఉంటూ.. ఇప్పుడెక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని మాట్లాడుతుంటారు. కానీ అన్ని రాష్ట్రాల్లో బడికెళ్లాల్సిన చాలామంది అమ్మాయిలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందులో 90శాతం మంది అమ్మాయిల కలలు నీరుగారిపోతున్నాయి. కానీ.. రూప యాదవ్.. నిజంగా ఇన్​స్పిరేషన్ స్టోరీ. ఎనిమిదేళ్ల చిన్నారి పెళ్లి కూతురు.. సాదాసీదా డిగ్రీలు కాదు.. ఏకంగా డాక్టర్​ అయింది. రాజస్థాన్ లోని మారుమూల పల్లె అయిన కరీరి గ్రామానికి చెందిన రూపది బాల్య వివాహం. ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లి అయింది. అదేమీ ఆమెకు అడ్డు కాలేదు. ఇటు కన్నవాళ్లకు, అటు మెట్టింటి వాళ్లకు చెప్పి ఒప్పించి చదువును కొనసాగించింది. అందులోనూ ఏదో ఒక డిగ్రీ కాదు, ఎంతో కష్టపడి చదివి ఇప్పుడు డాక్టర్ రూపగా మారి తమ ఇరు కుటుంబాలకు గొప్ప పేరు తీసుకొచ్చింది.

ఎనిమిదేళ్లకే బాల్య వివాహం..

రూప యాదవ్ కు చదువుపై ఉన్న ఆసక్తి గురించి ఆమె తండ్రి మాలిరామ్ యాదవ్ కి బాగా తెలుసు. అందుకే తనకు పెళ్లి చేయాలన్న ఆలోచన చేయలేదు. కాకపోతే ఆయన తన పెద్దన్న మాట, నిర్ణయానికి ఎదురు చెప్పలేక సరేనన్నాడు. రూప, ఆమె అక్క రుక్మాలకు ఒకే కుటుంబంలోని అన్నదమ్ములను ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే రూపకు చదువుపై ఉన్న ఆసక్తి గురించి ఆమె తండ్రి తన వియ్యంకుడికి చెప్పాడు. ‘‘ఎలాగూ గౌనా వేడుక వరకూ మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది కదా. చదువుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేద’’ని చెప్పాడు. (ఈ గౌనా అనేది, ముఖ్యంగా బాల్యవివాహాల్లో పెళ్లైన కొన్నేళ్ల తర్వాత అమ్మాయిని అత్తగారింటికి కాపురానికి తీసుకెళ్లే ముందు చేసే వేడుక. అప్పటివరకు ఆ వధువు తన పుట్టింట్లోనే ఉంటుంది. ఈ ఆచారం ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది.)

పదో తరగతిలో టాపర్..

పెళ్లైంది అన్న ఆలోచన లేకుండా చాలా సంతోషంగా బడికి వెళ్తూ, బాగా చదువుతూ పదో తరగతిలో 86శాతం మార్కులు తెచ్చుకుంది. తల్లిదండ్రులతో పాటు మిగిలిన వాళ్లంతా కూడా చాలా ఆనందపడ్డారు. ‘‘నా మార్కులు చూసి ముందు ఊరివాళ్లంతా షాకయ్యారు. మాది చిన్న గ్రామం కావడంవల్ల నాకంటే ముందు ఎవ్వరూ ఇన్ని మార్కులు తెచ్చుకోలేదు. దాంతో నేను పలు అవార్డులు అందుకున్నాను. మా టీచర్లంతా నేను చదువును కొనసాగించాలని కోరుకున్నార’’ని రూప తెలిపింది.

పదో తరగతి ఫలితాలతో సంతోషంగా కేరింతలు కొట్టిన రూపకు ఇంట్లోవాళ్లు షాక్ ఇచ్చారు. వారం రోజుల్లో అత్తింటివాళ్లు వచ్చి గౌనా వేడుక జరుపనున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా రూప గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. చేసేదేమీ లేక తలొంచక తప్పలేదు. అయితే ఆ వేడుక పూర్తవ్వగానే, ఆమె మామ తన తండ్రి మాలిరామ్ కు ఇలా మాటిచ్చాడు. ‘‘మా కుటుంబం రూప చదువుకోవడానికి అన్నిరకాలా ప్రోత్సాహిస్తుంద’’ని భరోసా ఇచ్చాడాయన. దాంతో ఆనందభాష్పాలతో అత్తారింటికి బయలుదేరింది రూప యాదవ్. మామ, భర్త, బావలు ఆమె చదువు కోసం ఎక్కువ కష్టపడేవాళ్లు. ఆ డబ్బుతో ఫీజులు కట్టి చదివించడం మొదలుపెట్టారు. ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు సాధించింది.

డాక్టర్ లక్ష్యంవైపు అడుగులు..

రూప పట్టుదల చూసి గురువులు, తోటి విద్యార్థులంతా నీట్ ఎగ్జామినేషన్ కోసం సన్నద్ధం అవ్వమన్నారు. అందులో మంచి మార్కులు రావాలంటే కోచింగ్ తీసుకోవాలని సూచించారు. అదే విషయాన్ని భర్త, మామకు చెప్పింది రూప. అప్పుడు కూడా వాళ్లు ఏమాత్రం ఆమెను నిరుత్సాహపర్చలేదు. డబ్బు సంగతి తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటు నీట్ కోచింగ్ తీసుకుంటూనే, డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీట్ కి అడ్మిషన్ తీసుకుంది. నీట్ మొదటి ప్రయత్నంలో 22,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఇటు ఇంటి పని, అత్తమామలను చూసుకోవడం వంటి పనులతో ఆమె 100శాతం సమయాన్ని చదువుపై పెట్టలేకపోతుందన్న విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించారు.

రూప యాదవ్ ను ట్యూషన్ కోసం కోటా ప్రాంతానికి పంపారు. ఆయా ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఆమె భర్త, బావ ఎక్కువ గంటలు పనిచేసేవారు. తర్వాత ఏడాది కూడా ఆమెకు రాజస్థాన్ లోని మంచి మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. ఇంకో ఏడాది ట్యూషన్ చెప్పించేందుకు కూడా కుటుంబం సిద్ధమైంది. అలా అందరి కష్టం వల్ల మూడో సంవత్సరం రూపకి బికనర్ లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కుటుంబం, మంచి స్నేహితుల ప్రోత్సాహంతో ఐదేళ్ల ఎంబీబీఎస్ చదువును కొనసాగించింది. అయితే మధ్యలో లాక్డౌన్ సమయంలో చాలా నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడే ఆమెకి ఒక అడ్డంకి ఎదురైంది. తల్లి కాబోతున్నానని తెలుసుకుని కంగారు పడింది. అయినా భర్త వెన్నుతట్టడంతో ముందడుగు వేసింది.

బాలింతరాలుగా ఎగ్జామ్ సెంటర్ కి…

బిడ్డ పుట్టిన తర్వాత కూడా అన్ని పనులను ఒంటి చేత్తో చేయడం అలవర్చుకుంది రూప. 25 రోజుల కూతుర్ని అత్త, అక్క దగ్గర వదిలి ప్రీ ఫైనల్ పరీక్షలు హాజరైంది రూప. ఇటు బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, రాత్రిళ్లు పరీక్షలకోసం చదివేదాన్నని రూప చెప్తున్నది. ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో ఒక పరీక్ష రోజునే తన కూతురి మొదటి పుట్టిన రోజు వచ్చింది. దాంతో మూడు గంటల పరీక్షా పేపర్ ని గంటన్నరలో పూర్తి చేసి, బస్సెక్కి ఊరెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. ఆరోజును తానెప్పటికీ మర్చిపోలేనని, బిడ్డ మొదటి పుట్టినరోజున తల్లిగా తన బాధ్యతను నెరవేర్చానని ఆమె గర్వపడుతోంది

‘ఈ ఏడాదే నేను సర్టిఫైడ్ డాక్టర్ అయ్యాను. ఇప్పుడు పీజీ కి ప్రిపేర్ అవుతున్నాను. తర్వాత మా ఊరిలోనే ఒక హాస్పిటల్ తెరవాలని ఆశ పడుతున్నాను. నేను కలలు కన్న కల నిజమయ్యేందుకు నాకంటే ఎక్కువగా శ్రమించిన నా భర్త, మామ, బావలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను చదివిస్తున్నందుకు మా అత్తమామలను చుట్టుపక్కల వాళ్లు ఎప్పుడూ తిట్టేవారు. సూటిపోటి మాటలతో నన్ను, నా భర్తను హేళన చేసేవాళ్లు. అయినా బ్యాంకుల్లో లోన్లు తీసి, సొంత భూమిని అమ్మి మరీ నా చదువుకు ఖర్చు చేసి నా మెట్టింటి కుటుంబం రుణం నేను తీర్చుకోలేను. ఎవరికైనా సరే, సాధించాలన్న పట్టుదలతో ఉంటే, మన కుటుంబం తప్పకుండా సాయపడుతుంది. అలా కుదరక పోయినా మీ లక్ష్యాన్ని వదిలేయొద్ద’ని రూప అంటోంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here