బ్లైండ్ పింపుల్స్ అంటే ఏమిటి.. ఎలా నివారించాలి?

బ్లైండ్ పింపుల్స్.. చర్మం ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో ఒకటి. ఇవి పురుషులు, స్ర్తీలు అనే తేడా లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఈ పదం వినడానికి కాస్త కొత్తగా అనిపించినా.. దాదాపు అందరికీ ఈ సమస్య గురించి తెలిసే ఉంటుంది. ఇంతకీ బ్లైండ్ పింపుల్స్ అంటే ఏమిటి.. అవి ఎలా ఏర్పడుతాయి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం కింద వచ్చే మొటిమలనే బ్లైండ్ పింపుల్స్ అంటారు. ఇవి కూడా మొటిమల్లో ఒక రకం. సాధారణ భాషలో చెప్పాలంటే చర్మం కింద అభివృద్ధి చెందే మొటిమలను సిస్టిక్ లేదా బ్లైండ్‌ పింపుల్స్‌ అంటాం. ఇవి చర్మంలో లోతుగా ఏర్పడతాయి. మనకు సాధారణంగా వచ్చే నార్మల్‌ మొటిమల్లా పైకి ఉబికి రాకుండా.. ఇవి చర్మంలోపలే చొచ్చుకుని ఉంటాయి. వీటి వల్ల కొన్ని సార్లు తీవ్రమైన నొప్పి, వాపు, బాధను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్లైండ్‌ పింపుల్స్‌ కారణంగా మచ్చలు ఏర్పడతాయి. మరో ముఖ్య విషయమేమిటంటే ఇవి మనం అనుకున్నంత త్వరగా పోవు. అయితే వీటిని ఎలా నివారించాలి.. వీటిని తొలగించడానికి గల చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.

చేతులే మొదటి కారణం..

మొటిమలు రావడానికి ముఖ్య కారణం చేతులే. అవును… శుభ్రంగా లేని చేతులతో ముఖాన్ని పదే పదే తాకడం లాంటి పనులు చేయడం వల్ల పింపుల్స్ వస్తూ ఉంటాయి. మొటిమలు రావడానికి ఇదీ ఒక కారణమే.

వైద్యుల సలహాతో..

బ్లైండ్ మొటిమలను పలుమార్లు తాకడం, గిల్లడం, పిండడం వంటివి చేస్తే ఇవి మరింతి నొప్పిని కలిగిస్తాయి. బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. దాని వల్ల మచ్చలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తరహా పనులు మాని.. వైద్యుల సలహాలు, సూచనల సాయంతో వాటిని తగ్గించే ఉత్పత్తులు వాడడం మంచిది.

హీట్ ప్యాడ్ తో..

ఈ పింపుల్స్ ను తగ్గించడానికి మరో మార్గం వీటిపై హీట్ ప్యాడ్ ను పెట్టడం. ఇలా చేయడం వల్ల మొటిమల వాపు తగ్గుతుంది. ఫలితంగా త్వరగా నయమవుతాయి కూడా. హీట్‌ ప్యాడ్‌ లేకపోతే అందుబాటులో లేనట్లయితే.. శుభ్రమైన వస్త్రాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి, పిండి ఐదు నుంచి పది నిమిషాల పాటు మొటిమలపై ఉంచండి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే.. మొటిమలు త్వరగా తగ్గుతాయి.

ముల్తానీ మట్టితో..

బ్లైండ్ పింపుల్స్‌ను తొలగించడానికి ముల్తానీ మట్టి మాస్క్‌ మంచి కారకంగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని మలినాలు, వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. మంటను, వాపును తగ్గిస్తుంది. ముల్తానీ మట్టిలో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకుని, ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. బ్లైండ్‌ పింపుల్స్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.

హెల్తీ స్కిన్‌ కేర్‌ తో..

ఈ తరహా పింపుల్స్ ను నయం చేయాలంటే హెల్తీ స్కిన్ కేర్ ను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుంతుంది. సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకుని, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. ఇది చర్మం మీది రంధ్రాలు మూసుకుపోనికుండా చూస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌ స్క్రీన్‌ అప్లై చేయాలి.

అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా ముందుగా ఇంటివైద్యం చేస్తే చాలా సార్లు మంచి ఫలితాలుంటాయి. కానీ అవి తీవ్రమైతే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. లేదంటే అదే స్థాయిలో పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here