మంచు మోహన్ బాబుకు ఆయన కెరియర్లో ది బెస్ట్ ఫిలిమ్స్ లలో పెదరాయుడు చిత్రం ఒకటి. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది. ఈ సినిమాకు ముందు చాలా ప్లాపులలో ఉన్న మోహన్ బాబుకు ఈ చిత్రం పెద్ద బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ సినిమాతోనే కలెక్షన్ కింగ్ అనే బిరుదు మోహన్ బాబుకు వచ్చింది.
తమిళంలో సూపర్ హిట్ అయిన నట్టమై సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం తమిళనాట బాగా ఆడుతుందని ఈ సినిమాను చూడమని హీరో రజనీకాంత్ .. మోహన్ బాబుకు చెప్పారట. ఇది చూసిన మోహన్ బాబు వెంటనే తన ఆస్తులను కూడబెట్టి రీమేక్ హక్కులను కొనుగోలు చేశారట. అయితే ముందుగా ఈ చిత్రానికి బి. గోపాల్ అయితే న్యాయం చేయగలడని మోహన్ బాబు అనుకున్నారట. కానీ అప్పటికే వెంకటేష్, త్రివిక్రమ రావు కాంబినేషన్లో ఓ చిత్రానికి బి. గోపాల్ కమిట్ అవడంతో ఈ సినిమాను ఆయన వదులుకున్నారట. దీంతో రవి రాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇక ముందుగా భానుప్రియ పాత్రకి సీనియర్ హీరోయిన్ జయసుధను అనుకున్నారట. కానీ సినిమాలో డ్యూయెట్ చేయనని జయసుధ చెప్పడంతో ఆమె ప్లేసులో భానుప్రియను తీసుకున్నారట. భార్య భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం గురించి సినిమాలో వచ్చే సీన్స్, పాపారాయుడి పాత్రలో రజినీ కాంత్, సినిమాలో వచ్చే డైలాగ్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాకి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పాపారాయుడు అనే పవర్ఫుల్ పాత్రను రజనీకాంత్ పోషించారు. 1995లో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా 25 వారాలు ఆడింది.