తెలంగాణలో మరో 9 వేల జాబ్స్ కు నోటిఫికేషన్.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్.. అందుకే బండి అరెస్ట్: సీపీ.. బీజేపీ హైకమాండ్ సీరియస్.. ఎల్లుండి హైదరాబాద్ కు మోదీ: షెడ్యూల్ ఇదే.. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లో చేరికలు.. నేటి నుంచి జేయియి మెయిన్స్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్

టెన్త్‌ పరీక్ష పేపర్‌ లీక్ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. సంజయ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను గురువారం విచారణ జరుపుతామని మెజిస్ట్రేట్‌ చెప్పడంతో ఆయనను కరీంనగర్‌ జైలుకు తరలించారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం నుంచి హైడ్రామా నడుమ హనుమకొండకు తీసుకెళ్లారు. కోర్టుకు సెలవు కావడంతో కోర్టు ఆవరణలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్లి హాజరుపరిచారు. దీంతో సంజయ్‌కి 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ నాలుగో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇన్‌చార్జి జడ్జి, ప్రధాన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ రాపోలు అనిత ఆదేశాలు జారీ చేశారు.

బండి అరెస్ట్ ఇందుకే: సీపీ రంగనాథ్

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని అసమర్థంగా చూపడానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేయడానికి ప్రయత్నించారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. మంగళవారం నాటి పదోతరగతి హిందీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్త ప్రశాంత్‌ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సాప్ లో సుదీర్ఘంగా చాటింగ్‌ చేశారని, వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడుకున్నారన్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్‌ లీకేజీకి కుట్ర పన్నారని తెలిపారు. ఆ మేరకు ఆధారాలు లభించాయన్నారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నపత్రం లీకేజీ తీరు, బండి సంజయ్‌ అరెస్టుకు కారణాలను సీపీ రంగనాథ్‌ వివరించారు. మంగళవారం జరిగిన పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్‌ మండల కేంద్రంలోని స్కూల్‌ నుంచి బయటకు వచ్చిందన్నారు. ‘‘ఈ కేసులో బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచాం. రిమాండ్‌ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా, ప్రశాంత్‌ను ఏ2గా చేర్చాం. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేశాం.’’ అన్నారు.

బీజేపీ హైకమాండ్ సీరియస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. కేసీఆర్‌ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాక్షేత్రంలో, న్యాయపరంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నైజాన్ని ఎండగట్టాలని, ఎక్కడా రాజీపడొద్దని రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను ఆదేశించింది. కేంద్ర నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నేత ఎన్‌.రాంచందర్‌రావుకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

తెలంగాణలో మరో 9231 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​. తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 9231 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదలైంది. తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్స్​ సొసైటీ (TREIRB) ఈ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లో చేరికలు

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె, బుధవారం నాడు హైద్రాబాద్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు.దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్ గా గతంలో పనిచేశారు. ప్రస్థుతం శివసేన పార్టీ బీడ్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. వీరికి ఆ ప్రాంతంలో రాజకీయంగా గట్టి పట్టుంది. వీరితో పాటు.. మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాధికుడు శివరాజ్ జనార్థన్ రావు భంగర్., బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు పలువురు బిఆర్ఎస్ లో చేరారు. చేరికల సందర్బంగా.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బిఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ జాదవ్ తదితరులున్నారు.

ప్రధాని హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూలు ఖరారయింది. ఆయన ఈనెల 8న (శనివారం) ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 11.45 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తారు. 12 గంటలకు సికింద్రాబాద్‌-తిరుపతి రైలును ప్రారంభిస్తారు. 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. 1:30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తారు.

దొరికిన దొంగ బండి సంజయ్

పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్.. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి హరీష్ మండి పడ్డారు. బీజేపీ కుట్రల్ని దేశం మొత్తం గమనిస్తుందన్నారు. నిన్న మధ్యాహ్నం పేపర్ లీక్ అయ్యిందని బిజెపి వాళ్ళు ధర్నా చేశారు. సాయంత్రం పేపర్ లీక్‌లో అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని ధర్నా చేశారని ధ్వజమెత్తారు. పేపర్ లీక్ చేసింది బీజేపీ నాయకుడే అని ఆరోపించారు. తాండూరు, వరంగల్ పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ ఉన్నారన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 2 గంటల్లో బండి సంజయ్ కి ప్రశాంత్ 142 సార్లు ఫోన్ చేశారన్నారు. పేపర్ లీక్ తో సంబంధం లేకుంటే మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బండి సంజయ్ ను ప్రశ్నించారు.

బండి సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు

బండి సంజయ్ అరెస్టుపై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా బండి సంజయ్ పై సెటైరికల్ ట్వీట్ చేశారు. “పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు” అని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. #bjpleaks అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.

బానిసలుగా వ్యవహరించకండి: పోలీసులపై కిషన్ రెడ్డి ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడానికి గల కారణమేంటని డీజీపీ అంజనీకుమార్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సంజయ్‌ను అరెస్టు చేశారన్న వార్త తెలిసిన వెంటనే డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్‌ చేసి ప్రశ్నించారు. అయితే.. కేసు వివరాలను కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ చెప్పారని కిషన్ రెడ్డి చెప్పారు. ఏ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణ పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టు బానిసల్లా వ్యవహరించవద్దంటూ పోలీసులకు సూచించారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బండి సంజయ్‌ని బీఆర్‌ఎస్‌ సర్కారు టార్గెట్‌ చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

నేటి నుంచి జేఈఈ మెయిన్

దేశవ్యాప్తంగా గురువారం నుంచి జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 9.40 లక్షల మంది హాజరుకానున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తారు. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దేశంలో మొత్తం 330 నగరాలు / పట్టణాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరగనున్నాయి. గత జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా వారిలో 8.24 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలు పెరిగింది. తొలి, తుది విడతలో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. సామాజిక వర్గాల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు ఎంపిక చేస్తారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here