అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్.. రెండో రోజు బయటకు వచ్చిన టెన్త్ పేపర్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు గెస్ట్ ఆయన మనవడే.. ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన రికార్డు.. బీఆర్ఎస్ తో పొత్తుపై రేవంత్ కీలక ప్రకటన.. నేటి టాప్ న్యూస్ ఇవే..

అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలపై ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు బండి సంజయ్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే.. పోలీసులు మాత్రం అరెస్టుకు గల కారణాలను వెల్లడించలేదు.

వాట్సాప్ లో టెన్త్ హిందీ పేపర్

టెన్త్ ఎగ్జామ్ పేపర్ మళ్లీ వాట్సాప్‌కు చిక్కింది. తొలిరోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా లీక్ అయిన విషయం మరవక ముందే.. రెండో రోజు కూడా అదే తరహా ఘటన చోటుచేసుకుంది. మంగళవారం హిందీ పరీక్ష జరుగుతుండగానే ప్రశ్నపత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో కనిపించింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం నుంచి ఈ పేపర్‌ బయటికి వచ్చింది. క్షణాల్లోనే పలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయి.. విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ జరిపి ప్రశ్నపత్రం ఎలా లీకైందన్నది గుర్తించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు.

పేపర్ బయటకు ఎలా వచ్చిందంటే?

సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌ గ్రామానికి చెందిన ఒక బాలుడు.. అంబాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న తన స్నేహితునికి సహాయం చేయాలని భావించాడు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు హిందీ పరీక్ష ప్రారంభం కాగానే కమలాపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లాడు. పాఠశాలను ఆనుకొని ఓ చెట్టు ఉండడంతో దానిపైకి ఎక్కి.. మొదటి అంతస్తులో పరీక్ష రాస్తున్న హరీశ్‌ అనే విద్యార్థిని పిలిచాడు. కిటికీ ద్వారా అతని వద్ద నుంచి హిందీ ప్రశ్నపత్రం అడిగి తీసుకున్నాడు. అక్కడే ఉన్న పిట్టగోడ మీద ప్రశ్నపత్రాన్ని ఉంచి తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం దానిని తన స్నేహితుడు మెట్టు శివగణేశ్‌కు పోస్టు చేశాడు. శివగణేశ్‌ ఆ ప్రశ్నపత్రాన్ని కమలాపూర్‌ 2019-2020 ఎస్‌ఎస్సీ గ్రూపులో పోస్టు చేశాడు. ఆ గ్రూపులో 31 మంది సభ్యులు ఉన్నారు. గతంలో ఓ పత్రికలో విలేకరిగా పనిచేసిన గుండెబోయిన మహేశ్‌ అనే వ్యక్తి ఆ గ్రూపులో ఉన్న ప్రశ్నపత్రాన్ని 9.45 గంటలకు మరో మాజీ జర్నలిస్టు బూరం ప్రశాంత్‌కు పంపించాడు. దీంతో ప్రశాంత్‌ వెంటనే ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ సోషల్‌ మీడియాలో దీనిని వైరల్‌ చేశాడు. అంతే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు చాలా మందికి ఫార్వర్డ్‌ చేశాడు. ఆపై 142 మందితో ఫోన్‌లో మాట్లాడాడని సీపీ రంగనాథ్‌ తెలిపారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆయన మనవడు

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఒక్కరే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయన ఒక్కరినే ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, విగ్రహాన్ని భారీ గజమాలతో అలంకరించాలని, గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో దానిని రూపొందించాలని, ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా పైనుంచి పూల జల్లు కురిపించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి, వారి సంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అంబేడ్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని అన్నారు. ఈనెల 14న జరిగే విగ్రహావిష్కరణ, అనంతరం జరిగే సభ, జన సమీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

28, 29న ఫుడ్‌ కాంక్లేవ్‌

వ్యవసాయం, ఆహార రంగంలో అవకాశాలను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఫుడ్‌ కాంక్లేవ్‌-2023’ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఫుడ్‌ కాంక్లేవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ దశాబ్దంలో భారతీయ వ్యవసాయ-ఆహార రంగం వృద్ధికి అవకాశాలను గుర్తించడంపై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నామని, ఇందులో వందమంది పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని కేటీఆర్‌ తెలిపారు.

ఎంపీ సంతోష్ కుమార్ కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

“ఒకే గంటలో అత్యధిక మొక్కలు నాటడం” అనే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ కుమార్ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రగతిభవన్ లో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ శ్రీ వత్సల కౌల్ బెనర్జీ లిమ్కాబుక్ ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందించారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న, బిఆర్ఎస్ నాయకులు శ్రీ రాఘవ, సీఎం ఓఎస్డీ శ్రీమతి ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి..

‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. తన నియామక ఉత్తర్వును సీఎం చేతులమీదుగా మంగళవారం ప్రగతి భవన్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ అందుకున్నారు.

కాంగ్రెస్ దే అధికారం..

తెలంగాణలో ఈ సారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈ సారి ప్రజలు 80 సీట్లు కట్టబెడతారన్నారు. ఈ సారి కేసీఆర్ కు 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. అటు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ నడుస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై పీసీస చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వెల్లడించారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదని స్పష్టం చేశారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here