ముగిసిన జనార్ధన్ రెడ్డి విచారణ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాపు ముమ్మరం చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు సిట్ అధికారులు జనార్ధన్ రెడ్డిని విచారించారు. విచారణ సమయంలో సిట్ అధికారులు జనార్ధర్ రెడ్డి స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటారు.
వాట్సాప్ లో టెన్త్ ఎగ్జామ్ పేపర్
పదో తరగతి పరీక్షల ప్రారంభం రోజే కలకలం రేగింది. తొలిరోజు సోమవారం పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చేసింది. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడే ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి షేర్ చేశాడు. మరో సహచర ఉపాధ్యాయుడికి షేర్ చేసే క్రమంలో పొరపాటున మీడియా గ్రూప్‌నకు కూడా షేర్ అయింది. క్షణాల్లో ఆప్రశ్నపత్రం వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంటనే స్పందించిన అధికారులు.. బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులు సహా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను, డీవోనూ సస్పెండ్ చేశారు.
ఆన్సర్ షీట్లు మాయం
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాల్లో ఒక కట్ట మాయమైనట్లు ఎస్.ఐ. భరత్ సుమన్ తెలిపారు. ఈ జవాబు పత్రాల కట్ట ఏ పరీక్ష కేంద్రానికి సంబంధించిందో తెలియరాలేదు. ఉట్నూరులో పరీక్ష రాసేందుకు 1,011 మంది విద్యార్థులకు అయిదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జవాబుపత్రాలను ఆయా కేంద్రాల బాధ్యులు తపాలా కార్యాలయంలో అప్పజెప్పారు. అక్కడి సిబ్బంది పత్రాలన్నింటినీ 11 కట్టలుగా విభజించి మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు బస్టాండ్‌కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి కట్టలను లెక్కించారు. 11 బదులు పది కట్టలే ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. జవాబు పత్రాల కట్ట కోసం ప్రధాన రహదారితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. అది దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్ పోస్టుమాస్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. వెల్లడించారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మోదీ సభకు ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ సిద్ధమవుతోంది. ఈ నెల 8న నిర్వహించే సభకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరేడ్‌గ్రౌండ్‌ను చదును చేయించారు. ప్రధాని, ఎంపీలు, ఇతర నేతలు ఆసీనులయ్యేందుకు ప్రత్యేకంగా వేదికలు నిర్మిస్తున్నారు. కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం కోసం విడిగా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొన్ని రైల్వే ప్రాజెక్టులు, సబర్జన్ రైలు సర్వీసులను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం సభనుద్ధేశించి ప్రసంగిస్తారు. అంతకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు.
సిద్దిపేట అదనపు కలెక్టర్ పై వీధి కుక్కల దాడి
తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం ఆగడం లేదు. తాజాగా సిద్దిపేట అదనపు కలెక్టర్ కుక్కకాటుకు గురయ్యారు. వివరాల ప్రకారం.. సిద్దిపేట శివారులో కలెక్టరేట్‌తో పాటు అధికారుల నివాసాలు ఉన్నాయి. శనివారం రాత్రి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క కరిచింది. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచి పరిశీలనలో పెట్టారు. మరో వీధికుక్క అదేరోజు రాత్రి ఇంకో వ్యక్తిని, కలెక్టర్ పెంపుడు శునకాన్ని కరిచింది. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. దాంతో అధికారుల కుటుంబాల సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై సిద్దిపేట ఆసుపత్రి వర్గాలను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా అదనపు కలెక్టర్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
17 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఈ నెల 17 నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం జేఏసీ చైర్మన్, కన్వీనర్ సాయిబాబు,- రత్నాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ యాజమాన్యాలపై విశ్వాసంతో సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ఓర్పుతో వ్యవహరించామని తెలిపారు. వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినా మేనేజ్మెంట్నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనివార్యంగా ఈ నెల 17 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించి నోటీసు అందజేశామని తెలిపారు. సమ్మె ను ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే విద్యుత్ ఉద్యోగులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జరిపే సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు.
తీన్మార్ మల్లన్నకు ఊరట
పాత్రికేయుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఖైదీ అప్పగింత (పీటీ- ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) వారెంట్లు అమలు చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మల్లన్నపై నమోదైన వివిధ కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు అమలు చేస్తూ జైలు నుంచి బయటికి రాకుండా చేస్తున్నారని పేర్కొంటూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్ ేసన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఒకే రకమైన ఫిర్యాదులపై అనేక కేసులు నమోదు చేయడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. తీన్మార్ మల్లన్నపై మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్నింటిలో పీటీ వారెంట్ దాఖలు చేశారు? తదితర వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా పడింది.
13 నుంచి కొత్త సచివాలయం నుంచే పాలన
రాష్ట్ర పరిపాలన ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) నుంచి నూతన సచివాలయం నుంచే జరగబోతున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాల్సిందిగా శాఖలకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏప్రిల్ 30 నుంచి మంత్రుల కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే పనిచేయడానికి వీలుగా సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.