బీఆర్ఎస్ వస్తే దేశమంతా రైతుబంధు.. ఉచిత కరెంట్
బీఆర్ఎస్ భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో వెలుగుజిలుగులు
వచ్చేలా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరెంటు సమస్య ఎందుకుందని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత కరెంటు ఇస్తామని స్పష్టం చేశారు. రైతు బంధును దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్నించడానికి,
చైతన్యం తీసుకురావడానికే బీఆర్ఎస్ వచ్చిందని, దేశ ప్రజల దాహం తీర్చి.. సాగు భూములు
తడుపుతామని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు, ఉచిత కరెంట్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. అగ్నిపథ్ ను రద్దు చేస్తామని కేసీఆర్ తెలిపారు. కేంద్రం అమ్మని ఎల్ఐసీని
వెనక్కి తీసుకుంటామన్నారు. బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరయ్యారు. యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖమ్మం కలెక్టరేట్ భవనానికి పునాదిరాయి వేశారు.
ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్ ఫిబ్రవరి చివర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే డిసెంబరులో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చట్టప్రకారం అసెంబ్లీ సమావేశాలను ఆరు నెలల్లోపు జరపకుంటే శాసనసభ రద్దు అవుతుందన్నారు. గతేడాది సెప్టెంబరు 13న ముగిశాయని, శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడంతో మార్చి 15 కల్లా ఆరు నెలల గడువు ముగియనుందన్నారు. కర్ణాటకలో కాంగ్రె్‌సను ఓడించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన పార్టీ కీలక నేత ఒకరికి సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ఆఫర్ చేశారంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కర్ణాటకలో 120 నుంచి 130 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలుసుకున్న కేసీఆర్.. 20 నుంచి 30 సీట్లలో పార్టీ కీలక నేతతో కేసీఆర్ బేరసారాలు చేశారన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమై ఆ కుట్రను ఛేదించిందన్నారు. ఖమ్మం సభకు జేడీయూ కుమారస్వామి ఎందుకు రాలేదో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు.
మూడు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలు
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి వీటితో పాటు 5 రాష్ట్రాల్లో ఖాళీలు ఏర్పడ్డ 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మహారాష్ట్రలో కస్బా పేట్, చించ్వాడ్ సీట్లకు, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు లక్షద్వీప్ లోక్‌సభ స్థానానికి ఫిబ్రవరి 27నే బై పోల్ జరగనుంది.
చైనాను దాటేసిన ఇండియా జనాభా
భారత్ జనాభా ఇండియాను దాటేసింది. తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నిర్వహించిన సర్వేలో చైనా జనాభాకంటే భారత దేశం జనాభా ఎక్కువని అంచనా వేసింది. డిసెంబర్ అంచనాల ప్రకారం.. చైనా కంటే భారత్ లో 50లక్షల మంది అధికంగా జనాభా ఉందని అంచనా వేసింది. మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. పదేళ్లకోసారి ఆనవాయితీ ప్రకారం.. మన దేశంలో జనాభా గణన జరగాలి. కానీ, 2020లో కరోనా కారణంగా జనాభా గణన వాయిదా పడింది.
మక్కామసీదులో ఎనిమిదో నిజాం అంత్యక్రియలు
హైదరాబాద్ లో ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజలు ముకర్రం ఝా పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు అనుమతించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చౌమహల్లా మహల్ నుంచి మక్కామసీదు వరకు ఆయన అంతిమయాత్ర నిర్వహించారు.
ఉప్పల్ ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం
ఉప్పల్ స్టేడియంలో ఇండియా న్యూజిలాండ్ వన్డే ఉత్కంఠభరితంగా సాగింది. పరుగుల వరద పారింది. 12 పరుగుల తేడాతో భారత్ కివీస్ ను ఓడించింది. టీమిండియా సాధించిన 350 పరుగుల భారీ టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. కివీస్ బ్యాట్స్‌మేన్ మైఖల్ బ్రేస్ వాల్ సెంచరీ సాధించి క్రీజులో ఉన్నంత సేపు దడదడలాడించాడు.