ఐటీ ఊరటనిచ్చిన బడ్జెట్​.. ఏం పెరిగినయ్.. ఏం తగ్గినయ్​.. అమృత్​ కాల్​ అన్న నిర్మల్​.. మిత్ర కాల్​ అన్న రాహుల్​.. డబ్బులు వెనక్కి ఇస్తున్న అదానీ..

బడ్జెట్​తో తగ్గేవి పెరిగేవి

కొత్త బడ్జెట్ లో ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కొన్ని వస్తువుల ధరలు మారనున్నాయ.
ధరలు పెరిగేవి : – బంగారం, ప్లాటినంతో తయారైన ఆభరణాలు, ఇమిటేషన్‌ జ్యూయలరీ ( గిల్టు నగలు), సిగరెట్లు, వెండి ఉత్పత్తులు, వంటగదిలో వినియోగించే ఎలక్ట్రిక్‌ చిమ్నీలు, దిగుమతైన సైకిళ్లు, ఆటవస్తువులు, విదేశాల నుండి దిగుమతయ్యే రబ్బరు
ధరలు తగ్గేవి : హీట్‌ కాయిల్స్‌, మొబైల్‌ భాగాలు, ల్యాప్‌టాప్‌, డిఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్స్​లు, టివి ప్యానెల్‌ భాగాలు, లిథియం అయాన్‌ బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

ఆదాయ పన్ను పరిమితి పెంపు

దేశంలోని మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ని రూ.5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఇది వర్తిస్తుంది. పన్నుదారులు పాత పన్ను విధానంలోనే కొనసాగుతామంటే.. అదే ఆప్షన్​ ఎంచుకునే వెసులుబాటు ఉంది.

అమృత్​కాల్​ బడ్జెట్​

2023–24 కేంద్ర బడ్జెట్‌ ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ‘ఇది అమృత్‌కాల్‌లో తొలి బడ్జెట్‌. వందేళ్ల స్వతంత్ర భారతదేశ ప్రగతికి ఇది బ్లూప్రింట్‌. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి… అమృత్‌కాలంలోని ఈ తొలి బడ్జెట్‌ పునాదులు వేస్తుంది’ అని తెలిపారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. 87 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటైననాటి నుంచీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని నిర్మల చెప్పారు. ‘‘టెక్నాలజీ, విజ్ఞానం ఆధారంగా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడమే అమృత్‌కాల్‌ లక్ష్యం. ఇందులో ప్రజల భాగస్వామ్యమూ అవసరం’’ అని తెలిపారు. ‘కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థలు మందగించినా.. భారత్‌ 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోంది. భారత్‌ను ప్రపంచం ఒక ధ్రువతారగా గుర్తించింది’ అన్నారు.

మిత్రకాల్​ బడ్జెట్; రాహుల్​

కేంద్ర బడ్జెట్ ను ‘‘మిత్ర కాల్ బడ్జెట్” అంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ తన కార్పొరేట్ మిత్రుల కోసమే ఈ బడ్జెట్ ను రూపొందించారంటూ పరోక్షంగా కామెంట్ చేశారు. బడ్జెట్‌‌‌‌లో దిశానిర్దేశం లోపించిందన్నారు. ‘‘ఉద్యోగాల కల్పనపై విజన్ లేదు. ధరల పెరుగుదలను కంట్రోల్ చేసే ప్లాన్ లేదు. అసమానతలను తగ్గించాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఒక శాతం ధనవంతుల వద్దే 40 శాతం సంపద ఉంది. 50 శాతం పేద ప్రజలు 64 శాతం జీఎస్‌‌‌‌టీ చెల్లిస్తున్నారు. ఇప్పటికీ 42 శాతం యువత నిరుద్యోగంతో మగ్గుతోంది. వీటిపై ప్రధానికి ఎలాంటి పట్టింపులు లేవు. దేశ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు బీజేపీ ప్రభుత్వానికి లేవనే విషయాన్ని ఈ బడ్జెట్ రుజువు చేసింది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్​; హరీష్​

కేంద్ర బడ్జెట్‌ రైతులు, పేదలకు వ్యతిరేకంగా ఉందని, తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. దేశ రైతులను, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఈ బడ్జెట్‌ నిరుత్సాహపరిచిందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రం అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. గిరిజన వర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమేనని, విభజన హామీల్లో ఏ ఒక్కదానినీ నెరవేర్చలేదని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, నేతన్నలకు జీఎస్టీ రాయితీలు. ప్రత్యేత ప్రోత్సాహకాలు గాని ప్రకటించలేదన్నారు. దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ఆరోపించారు.

కొన్ని రాష్ట్రాలకే పరిమితం; కవిత

కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం కొన్ని రాష్ట్రాలకు పరిమితమైందని.. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు మొండిచేయి చూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సబ్‌ కా సాత్‌ అని చెబుతున్న కేంద్రం నిధులను సమానంగా ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్‌ కాలేజీల్లో.. ఒక్కటి కూడా రాష్ట్రానికి మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపు పొడిగించారని, ఇక్కడి నిమ్జ్‌, ఇతర సెజ్‌ల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు కేటాయించడం సంతోషమే కానీ, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు.

బడ్జెట్​పై బీజీపీ ఫోర్​మెన్​ కమిటీ

బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర స్థాయిలో నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కన్వీనర్ గా,  సభ్యులుగా పార్టీ రాష్ట్ర నేతలు ప్రకాశ్ రెడ్డి, రజనీ, సంగప్ప ఉన్నారు. వీరు అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్ర బడ్జెట్ తో ఏ వర్గానికి ఎంత మేలు జరగనుంది, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుందనే వివరాలను సెమినార్ లు, ప్రెస్ మీట్ల ద్వారా వివరించనున్నారు. త్వరలో జిల్లా స్థాయిలోనూ ముగ్గురు సభ్యులతో బడ్జెట్ యాక్టివిటీ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీలు మండల స్థాయిలో పర్యటించి ప్రజలకు బడ్జెట్ గురించి వివరించనున్నాయి. 

ఎఫ్​పీవో డబ్బులు వెనక్కి ఇస్తున్న అదానీ

అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ షేరు ధర దారుణంగా పడిపోతుండటంతో ఫాలో ఆన్​ పబ్లిక్​ఆఫరింగ్​ (ఎఫ్​పీఓ) డబ్బులు ఇన్వెస్టర్లకు  వెనక్కి ఇచ్చేయనున్నట్లు  అదానీ గ్రూప్ చైర్మన్​ గౌతమ్​ అదానీ ప్రకటించారు. ​ బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యమైన పరిణామాలు, మార్కెట్లో ఒడిదుడుకుల  నేపథ్యంలో, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఎఫ్​పీఓ డబ్బు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించామని, ఈ ట్రాన్సాక్షన్​ మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నామని అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది.

టీమిండియా గ్రాండ్​ విక్టరీ

మూడో టీ20లో భారత్ 168 పరుగుల తేడాతో విజయం సాధించింది.  234 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 66 పరుగులకే ఆలౌట్ అయింది. పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా…అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ శతకం బాదాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. 2022లో ఆసియా కప్లో విరాట్ ఆఫ్ఘనిస్తాన్ పై 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే ఓ టీమిండియా బ్యాట్స్మన్  టీ20ల్లో చేసిన అత్యధిక పరుగుల రికార్డు. ప్రస్తుతం గిల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here