కళా తపస్వి కన్నుమూత.. లిక్కర్​ స్కామ్​లో ఢిల్లీ సీఎం.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు షురూ.. జులై 1న గ్రూప్​ 4 ఎగ్జామ్​.. ఈ రోజు టాప్​ న్యూస్​

కళాతపస్వి ఇకలేరు

ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (93)​ కన్నూమూశారు. అనారోగ్యంతో గురువారం రాత్రి హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్​..  సిరిసిరిమువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతి కిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. విశ్వనాథ్ ది గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్​ 1957 సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సౌండ్ ఇంజనీర్ గా సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. కోడైరెక్టర్​గా పని చేశారు. హీరో అక్కినేనితో ఏర్పడిన పరిచయంతో ఏఎన్నార్​, కాంచన హీరోహీరోయిన్​గా  1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాను విశ్వనాథ్​ తెరకెక్కించారు. మొదట్లో కొన్ని కమర్షియల్ సినిమాలు తీసిన విశ్వనాథ్​.. ఆ తర్వాత సంస్కృతీ సంప్రదాయాలనే ఇతివృత్తంగానే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. తన సినిమాల ద్వారా భారతీయ సంగీత సాహిత్య కళల మాధుర్యాన్ని పంచారు. అందుకే ‘కళాతపస్వి’ గుర్తింపును అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా విశ్వనాథ్​ పలు చిత్రాల్లో నటుడిగా తెలుగు ప్రేక్షకులను ​ మెప్పించారు. శుభసంకల్పం, లాహిరి లాహిరి లాహిరిలో, సంతోషం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నీ స్నేహం, మిస్టర్ పర్‌‌‌‌ఫెక్ట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. విశ్వనాథ్​ తీసిన శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం దక్కింది. 1992లో  రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992లో  పద్మశ్రీ, 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు మొదలవుతుంది. గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాగానే ఉభయ సభలు వాయిదా పడతాయి. రెండేండ్ల తర్వాత గవర్నర్​ అసెంబ్లీ కి హాజరవనుండటంతో గవర్నర్​ స్పీచ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ఏడాది బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. 5వ తేదీన రాష్ట్ర కేబినేట్​ భేటీ జరుగనుంది. బడ్జెట్​కు ఆమోదం తెలపడంతో పాటు అసెంబ్లీలో చర్చించే అంశాలపై కేబినేట్​లో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు 14వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి.

జులై 1న గ్రూప్​ 4 ఎగ్జామ్​

గ్రూపు-4 నోటిఫికేషన్‌లో భాగంగా పరీక్ష తేదీని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. జూలై 1వ తేదీన రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 8,180 గ్రూపు-4 పోస్టుల భర్తీ కోసం టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురువారం వరకూ 9,08,061 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ల నమోదుకు శుక్రవారమే తుది గడువు. జులై 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌), అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2(సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) పరీక్ష జరగనుంది. రెండు పేపర్లలోనూ 150 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున రెండు పేపర్లూ కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలను ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.

డిస్కంలో 1601 ఉద్యోగాలు

దక్షిణ డిస్కమ్‌ (TSSPDCL) 1601 ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్‌ జారీ అయింది. అందులో 1553 జూనియర్‌ లైన్‌మన్‌(జేఎల్‌ఎం) పోస్టులు కాగా, 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టులు ఉన్నాయి. గతేడాది 1000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అక్రమాలు జరుగడంతో ఆ నోటిఫికేషన్‌ రద్దు చేశారు. ఇప్పుడు పోస్టులను పెంచి 1553 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా విధానంపై ఈనెల 15 తరువాత పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు డిస్కమ్‌ ప్రకటించింది. ఏఈ ఉద్యోగాలకు బీటెక్‌ డిగ్రీ అర్హత కాగా… ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌ చేసిన అభ్యర్థులూ అర్హులు.

లిక్కర్​ స్కామ్​లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​

ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా 17 మంది పేర్లను ప్రస్తావించింది. లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 సెల్ ఫోన్లు మార్చినట్లు ఈడీ ఛార్జ్ షీటులో ఆరోపించింది. సౌత్ గ్రూపు నుంచి రూ.100కోట్ల లావాదేవీలు జరిగినట్లు స్పష్టం చేసింది.  సమీర్ మహేంద్ర నుంచి విజయ్ నాయర్ భారీగా ముడుపులు అందుకోవడంతో పాటు కవిత సన్నిహితుడైన అరుణ్ పిళ్లై భారీగా ప్రయోజనం పొందిన విషయాన్ని ప్రస్తావించింది. ఈడీ ఛార్జీషీట్​ కల్పితమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ కొట్టిపారేశారు.

పొంగులేటి తమతోనే అన్న షర్మిల.. ఇంకా లేదన్న పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమతోనే టచ్​లో ఉన్నారని.. మిగతా విషయాలు ఆయననే అడగాలని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. రాష్ట్రంలో సమస్యలేమీ లేవని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్‌ ఒక్క రోజు పాదయాత్ర చేయాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్‌ విసిరారు. పాదయాత్ర చేయడానికి వీలుగా బూట్ల జతను కేసీఆర్‌కు బహుమతిగా పంపించినట్లు తెలిపారు రాష్ట్రంలో సమస్యలేమీ లేవని కేసీఆర్‌ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్​ చేశారు. షర్మిల చేసిన కామెంట్​పై పొంగులేటి స్పందించారు. అన్ని పార్టీలు తనను ఆహ్వానించాయని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొంగులేటి రిప్లై ఇచ్చారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here