ముత్యాల సిటీ మన భాగ్యనగరం

అప్పడెప్పుడో రత్నాలు రాశులుగా పోసి అంగట్లో అమ్మారట అక్కడెక్కడో విజయనగర సామ్రాజ్యంలో. మనం చదివాం. కానీ చూసే అవకాశం లేదు.

కానీ ముంగిట ముత్యాలు పోసి, అంగట్లో దండలుగా పేర్చి… ఆ దండలను అనేకానేక  ఆకృతుల్లో… పెట్టెల్లో అమర్చి… ముంగిట ముత్యాల ముగ్గులనిపించేలా అమ్మే వైనవైనవైభవవైభోగాన్ని ఇప్పుడూ చూడొచ్చు… అది ఇంకెక్కడో కాదు… మన హైదరాబాద్‌లోనే.

అలనాటి కుతుబ్‌షాహీలూ, ఆ తర్వాత అసఫ్‌జాహీల… అటు పిమ్మట నవాబులూ…  ఎంతోకొంతైనా కొద్దిమొత్తాల్లో చేతి ఉంగరాల్లోనైనా ఒకింత గరీబులూ అంతా ఎంతో కొంత అందరూ ముత్యాల మార్కెట్‌ను పెంచిపోషించారు. అందుకే దీన్ని ముత్యాల నగరం అంటారు. ఏదో మన గొప్పకోసం కాదు… దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ‘ద సిటీ ఆఫ్‌ పెరల్స్‌’ అంటే మన హైదరాబాదే.

మేలు ముత్యాలూ, మంచి ముత్యాలూ, ఆణిముత్యాలూ, నల్లముత్యాలూ… ఇలా ఒకటేమిటి… ఎన్నోన్నో రకాల నాణ్యాల తీరునొక్క ముత్యాలకు నెలవు మన హైదరాబాద్‌. చరిత్రపూర్వకాలంలో అప్పట్లో పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చారిత్రక నగరం బస్రాలో ఇలా అమ్మేవారని అబేరియన్‌ నైట్స్‌…అలీఫ్‌ లైనా ల్లాంటి కథల్లో చదివే మార్కెట్లు… మన పాతనగరంలో అడుగడుగునా పలకరిస్తుంటాయి.

ఎక్కడో కడలి అడుగుల్లో ముత్యపుచిప్పల్లో పుట్టిపెరిగే చిట్టిముత్యాలు…  సీషోరూ, సముద్రపుహోరూ లేని హైదరాబాద్‌లో విస్తరిల్లడం విచిత్రమే అనిపిస్తుంది. అయితే  దీనికో చారిత్రక కారణముంది. భౌగోళిక అవసరాల దృష్ట్యా పాశ్చాత్యదేశాల్లో అపటి ప్రధానాహారం మాంసాహరమే. అది రుచికరం కావాలంటే వారికి భారత–దక్షిణాసియా దేశాల సుగంధద్రవ్యాలు తప్పనిసరి. అవి తెప్పించుకునేందుకు వారందరికీ అవసరమైన వాణిజ్యపు దారుల్లో ఒకటి అటు సిల్క్‌రూటయితే… మరొకటి భారతీయ బాట. ఆ వ్యాపారవేత్తలందరూ వచ్చేది ఇస్లాం విలసిల్లిన అరబ్బుల భూభాగం మీదుగానే. అందుకే అక్కడ్నుంచి వచ్చే యాత్రికులూ, వ్యాపారస్థులు తమతో పాటు ముత్యాలు తీసుకొచ్చి… ఇక్కడ విక్రయించేవారు. ఇక్కడి సుగంధద్రవ్యాలను కొని తమతో తీసుకెళ్లేవారు. దాంతో చరిత్రపూర్వకాలం నుంచి అక్కడ బస్రాలో ముత్యాల మార్కెట్‌ పరిఢవిల్లినట్టుగానే ఇక్కడ హైదరాబాద్‌లోనే అదే మార్కెట్‌ విస్తృతమైంది.

అందుకే అక్కడ బస్రాలాంటి సాంస్కృతిక పురాతన నగరమే ఇక్కడ హైదరాబాద్‌.

ఇక్కడో కావ్య దాఖలా చెప్పుకుందాం. చేమకూరి వెంకటకవి తన విజయవిలాసం  ప్రథమాశ్వాసంలో ఇంద్రప్రస్థపురం వైభవం గురించి  ఓ పద్యంలో చెబుతాడు.  ‘‘ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ…’’ అనే ఆ మూడో పద్యపాదం ద్వారా ఓ సందేశమిస్తాడు. దాన్ని వ్యాఖ్యానించదలచుకుంటే ‘అంతా నా ఇష్టం… అంతా నా ఇష్టం’ పాటేసుకోవడమే బెటర్‌.

అక్కడ ముత్యాలు చాలా ఎక్కువనీ… ఎంత ఎక్కువంటే… అతిశయోక్తిగా చెప్పాలనుకుంటే సౌధాల నిర్మాణానికి సున్నం కోసం కూడా ముత్యాలే వాడారనీ చెప్పవచ్చు. లేదా సౌధాలను సున్నం వేయించడానికి ముత్యాలు వాడారని కూడా చెప్పవచ్చు. అలా కాకుండా ముత్యాల వ్యాపారం వల్ల వచ్చిన సంపదల్తో మల్టీస్టోరీడ్‌ బిల్డింగ్స్‌ కట్టారనుకోవచ్చు. అలా చూస్తే… అతిశయోక్తులు మినహాయిస్తే  హైదరాబాదూ ఏమీ తక్కువ కాదు. అందుకే… దాని పేరే ‘పెరల్‌ సిటీ’!

అంతెందుకు అప్పుడెప్పుడో ఇంద్రప్రస్థపురి గురించి చేమకూర వారు చెప్పిన ప్రతి వర్ణనా హైదరాబాద్‌కూ వర్ణిస్తుంది. అక్కడ ఇంద్రప్రస్థపురిలో ‘పోకమాకుల’ గురించి చెప్పాడు. ఇక్కడ హైదరాబాద్‌లో పోక చెట్లు,  తమలపాకులతోటలంతగా లేనప్పటికీ.. అడుగడుగునా తమలపాకుల… పోకల పాన్‌షాప్‌లు. అక్కడి ‘కర్పూరపు  అరటిపండ్లే’ ఇక్కడి తోపుడు బండ్ల మీద చీటా మౌజ్‌లు. ఇక మూడో పాదం మొదటే  చెప్పుకున్నాం. అక్కడి అంశాలన్నింటినీ, అంశాలెన్నింటిటో వేనోళ్ల పొగిడేలా ఉన్నాయన్నది చివరి పాదం … దీని గురించి తెలియనిదేముంది…. హైదరాబాద్‌ ప్రశస్తి రెండు రాష్ట్రాల్లో వేనోళ్ల కాదు… కోట్ల నోళ్లతో చెప్పకుంటారు. ఇంద్రప్రస్థపురానికీ… హైదరాబాద్‌కూ అంతటి పోలిక ఉన్న ఆ పద్యమేమిటీ ఇంతకీ అని అడుగుతున్నారా… వినండి…

‘‘పోకమ్రాకుల మహిమ కప్పురపుటనటి,

ఆకుతోటల సౌభాగ్యమందె కలదు;

ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ వీటి రహి మెచ్చవలయు బో వేయినోళ్ల’’!!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here