ఎవరో కవి అన్నట్టుగా… కాలం చెక్కిలి మీద ఘనీభవించిన గతకాలపు వైభవాల నీటిచుక్కలన్నీ… మంచుముక్కలై… ఆయన అవి ఇంద్రనీలాలై, ముత్యాలై, పడగాలై, రత్నమాణిక్యాలై, అద్భుత వస్తుసముదాయాలై, అనన్య ప్రాచీన మణిమయ విభవిత మంజూషాల్లోకి ఒదిగిపోయి… నిజాముకు సమర్పిత నూలుపోగులై…
సామాన్యులకు పోజుకొట్టేందుకు ఒకేచోట పోగై… ఓ ఠీవిౖయెన ప్రదర్శనశాలలో నిలుచున్న అద్భుత వస్తు సంచయ ప్రదర్శనశాలే ‘నిజాం మ్యూజియమ్’ అవుతుంది.
నిజాం మ్యూజియమ్ ఏర్పటైన విధంబు సైతం రాజసంతో కూడినదై పోజుకొట్టేదే. నిజాముల దర్పాన్ని దర్పణంలో చూసినట్టుగా కనిపించేదే.
ప్రస్తుత మన రాష్ట్రప్రభుత్వ… ఎగువసభగా ఎమ్మెల్సీల సమావేశాల ఏర్పాటు కోసం ఉపయోగపడుతున్న ‘జూబిలీ హాల్’ కథ తెలుసా? కాస్త తెలుసుకుందాం రండి.
ఆరో నిజామ్ నవాబైన తన తండ్రి మహబూబ్ అలీ ఖాన్ మరణించడంతో ‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్’ 1911 ఆగష్టు 29న ఏడో నిజాంగా పాలన బాధ్యతలను చేపట్టాడు. తను సింహాసనాన్ని అధిష్టించి 25 ఏళ్లు కావడంతో 1936లో రజతోత్సవ వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహించదలచాడు. అందుకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ వేదికగా ఖరారైంది. ఆ వేడుకల నిర్వహణకోసం ప్రత్యేకంగా నిర్మితమైన భవనమే… ఇవ్వాళ్టి మన ఎమ్మెల్సీల ఎగువ సభభవనం.. ‘జూబిలీ హాల్’!
అంగరంగవైభవంగా నిర్వహితమైన ఆనాటి వేడుకలకు ఎందెందరో దేశవిదేశ విఖ్యాతులూ, విదుషీమణులూ, ప్రముఖులూ, ప్రఖ్యాతులు హాజరయ్యారు. అసలే రాజదర్శనం… ఉత్తచేతుల్తో వస్తారా ఎవరైనా? అందుకే… వెలలేని, తులలేని, ఇతరులు ఇలనైనా వినలేని, కలనైనా కనలేని… విలువైన తమ సంపదాసంచయంతో హాజరై… నిజామ్‌కు నజరానాలుగా సమర్పించారు.
అప్పుడంతటి విలువైన వస్తువులు ఉంచడానికి ఓ భవనం అవసరమైంది. అప్పటి పురానీ హవేలీకి దగ్గరగా, దుర్రెషవార్ హాస్పిటల్ సమీపంలో నిజాం అధికారిక నివాసంగా ఉండేది. దేశవిదేశలకు చెందిన ప్రముఖులందించిన ఆ వస్తువులనూ, అద్భుత కళాఖండాలనూ, వాల్ల జ్ఞాపకాల్నీ, జ్ఞాపికల్ని ఆ భవనంలోనే అప్పటికి భద్రపరిచారు. ఆ తర్వాత నిజాం మనవడు ముఫఖం జాహ్… తన తాత అందుకున్న కాన్కలన్నింటినీ అపురూపంగా ఎంచి… ఆ భవనాన్నే నిజామ్ మ్యూజియమ్‌గా మలచాడూ… మార్చాడు. తానే స్వయంగా ఆ మ్యూజియానికి ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరించాడు.
ఇందులోని అద్భుత వస్తువుల తీరూ, వైభవాలూ వైనవైనాలు. ఉదాహరణకు హైదరాబాద్‌కు ఐకన్స్‌గా చెప్పే అద్భుత భవనాలైన ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, మోజంజాహీ మార్కెట్, హైకోర్ట్, నీలోఫర్ హాస్పిటల్‌ల వెండి నమూనాలు ఇందులో ఉన్నాయి.
అంతేనా… కొన్ని అద్భుత వస్తువుల వైభవం చెప్పనలవి కాదు. చివరి నిజాం అయిన ఉస్మాన్ అలీఖాన్ రజతోత్సవ వేడుకల్లో కూర్చున్న బంగారు సింహాసనం, వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్‌బాక్స్, ఆనాటి పాల్వంచరాజు బహూకరించిన మదర్ ఆఫ్ పెరల్ వజ్రం, షాహీ అత్తరు మంజూషాలూ, బాహాబాహీల కోసం బంగారు కత్తులు, వేడిపానీయాల కోసం వెండి సీసాలూ, కమ్మని కాఫీ సేవనం కోసం వెండి కప్పులు… ఒకటని ఏమిటి… రకరకాల విలువైన వస్తువులనిక్కడ అబ్బురంగా అవలోకించవచ్చు.
వింటేజీ వాహనాలైన రోల్సురాయిసులూ, ప్యాకర్డు ల్లాంటి అలనాటి రాజస బ్రాండెడ్ కార్లక్కడ ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్దదైన అలమర అక్కడ కొలువుదీరి ఉంది. బర్మాటేకుతో చేసిన 176 అడుగుల పొడవైన ఈ అల్మారాను ఆరో నిజామ్ ఉపయోగించేవాడు. ఆనాటి నవాబులు ఉపయోగించిన దుస్తులూ, వారు తినే ప్లేట్లూ, తాగే గ్లాసులూ అన్న ఇక్కడ అమరి ఉన్నాయి. అతడెంతో ఎంతో పిసినారి అన్నది నిజామ్ నవాబుకు ఉన్న ప్రఖ్యాతి కదా. అందుకేనేమో.. ఆ విలువైన వస్తుసంచయానికి తానే స్వయంగా కాపలాగా నిల్చున్నట్లుగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిలువెత్తు తైలవర్ణ చిత్రపటం అక్కడ ఏర్పాటై ఉంది. మరి కావలి కాస్తున్నప్పుడు ఉన్నప్పుడు కనులు అన్నివైపులకూ తిప్పాలి కదా… అందుకే చూసేవారు చేష్టలుడిగి చిత్తరువులైపోయేలా… ఎవరేమూల నుంచి చూసినా… వారినే తాను స్వయంగా తదేకంగా చూస్తున్నట్లుగా ఉంటుందా నిజామ్ తాలూకు చిత్తరువు! శుక్రవారం మినహా ప్రతిరోజూ ఈ వస్తువులను చూసేందుకు ప్రజలను మ్యూజియమ్‌లోకి అనుమతిస్తారు. ఇందండీ… ఇదిగో ఇల్లిదిగో మ్యూజియమ్! చూడదలచుకున్నవారంతా వచ్చేయండీ…!! ఆ వచ్చినవారంతా అచ్చెరవొందండీ!!!