రాతిని అల్లుకున్న అద్భుతమైన భవనం

కాస్త అలా నయాపూల్‌ బ్రిడ్జి మీదికి వెళ్లి సాయం సంధ్య సమయంలో అటువైపు చూస్తే అబ్బురపరుస్తుందది.

కొద్దిగా ఇలా మూసీ ఒడ్డున నిలబడి వేకువజామున దానివైపు చూస్తే కళ్లు మిరిమిట్లుగొలిపిస్తుందది.

కాస్తంత ఎటు పక్కన నిల్చుని అయినా… పట్టపగలైనా… వెన్నెల రేౖయెనా… దాని పైనున్న ముదురు ఎరుపురంగున్న గుంబజ్‌లను చూస్తుంటే గుండెనిండుగా ఆనందాల గగుర్పాటులు. గుంబజుల చుట్టూరా నిట్టనిలువుగా నిల్చున్న మినారెట్లను చూస్తుంటే మేను నిండుగా మైమరపులు. వెరసి ఎట్టకేలకు విచ్చినకన్నుల ఆనంద వీక్షణాలతో అచ్చెరవులూ… అద్భుతానుభూతులు.

తొలిపొద్దూ… మలిపొద్దూ… ఏ పొద్దయినా… న్యాయం నిలబడేలా, చట్టం అమలయ్యేలా చూసే అందమైన హైకోర్టు భవనం.. నిజాముల మరో అద్భుత కట్టడం. 

ఎర్రటితెల్లటి రాతికట్టడంగా… రాతినే అల్లినట్టుగా అనిపించేలాంటి ‘సెరాసెనిక్‌’ స్టైల్లో ఓ సీనరీలా అనిపిస్తుందీ భవనం. ఎన్నో భవనాల్లాగే దీనికీ ఏడో నిజామ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌యే పునాదిరాయి వేశాడు. అప్పట్లో ఈ భవన నిర్మాణం కోసంæ పునాది గుంతలు తవ్వుతుంటే… ఒకనాటి గతకాల ఖుతుబ్‌షాహీ అద్భుత భవనాల శిథిల వైభవాలు వెలుపలికి వెలికివచ్చాయి. అలనాటి హీనా మహల్, నదీమహల్‌ అనే భవనాలు బయటపడ్డాయి. వాటిని తవ్వడానికి  మనసు రాకా… తవ్వడం తప్ప మరో మార్గం లేకా ఎట్టకేలకు పని పూర్తి చేశారు భవన నిర్మాణ కళాకారులు.

అప్పట్లో జైపూరు సంస్థానానికి చెందిన ప్రఖ్యాతి ఆర్కిటెక్టు శంకర్‌లాల్‌ ఈ భవనానికి  ప్లాన్‌ గీశాడు. దాన్ని అమలు పరచాడూ… ఇక్కడి ప్రఖ్యాత ఛీఫ్‌ ఇంజనీరైన నవాబ్‌ఖాన్‌ బహద్దూర్‌ మీర్జా అక్బర్‌ బేగ్‌. అతడి నేతృత్వంలో కట్టడం పనులు కొనసాగించాడూ మరో ఇంజనీర్‌ మెహర్‌ అలీఫాజిల్‌.

ఈ నిర్మాణ పనులు 15 ఏప్రిల్‌ 1915న మొదలై… 31 మార్చి 1919 నాటికి పూర్తయ్యాయి. నాలుగేళ్ల వ్యవధిలో నాల్గింతల అందాలతో… నలువైపుల నుంచి ఏ వైపు చూసినా కళ్లను కట్టిపడేసేంత అందమైన అద్భుత భవనం… నానాలోక భవాలకు తీసికటై్టన నాకసామ్రాజ్య ప్రవేశద్వారమంత దర్పంగా… నాలుగొందల తరాలపాటైనా   అలరించేటంత అద్భుతంగా నిల్చుందీ కట్టడం. హైకోర్టు భవనం పూర్తయ్యాక… దాని జ్ఞాపికగా… అచ్చం దానిలాగే ఉండేలా ఓ వెండి నమూనాను రూపొందించి 300 కిలోల ఈ మినియేచర్‌ భవనాన్ని నిజామ్‌ మ్యూజియమ్‌లో ఉంచారు.

పునాదిరాయి వేసిన తానే…  పూర్తయ్యాక  ప్రారంభోత్సవమూ చేశాడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. ఆనాడే… న్యాయమూర్తులూ, న్యాయవేత్తలూ, న్యాయనిర్ణేత నిపుణులూ, ఇతరత్రా న్యాయాధికారులూ, సిబ్బందీ, పోటీ తగవులు తీర్చే మేటితగవరులూ, వాదనలు వినిపించే వకీళ్లూ, లీగల్‌ ల్యూమినరీలూ, లీగల్‌ ఆఫీసర్లూ, అట్టహాసంగా కనిపించే ఆఫీసు గదులూ, డాక్యుమెంట్లు భద్రపరిచే రికార్డు రూములూ… ఇలా దేనికీ లోటుకాకుండా నిర్మితమైన ఈ భవనం… ఆంధ్రరాష్ట్రం వచ్చి హైదరాబాద్‌లో కలిసి… ఆంధ్రప్రదేశ్‌గా రూపొందాక ఆ ఉమ్మడి రాష్ట్రానికీ హైకోర్టుగా నిలిచింది. అటు తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కూడా 2018 చివరి రోజువరకూ ఉమ్మడి రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుగా ఉండి… ఎట్టకేలకు 1 జనవరి 2019 నాటి నుంచి తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఓ అద్భుత న్యాయాలయంగా నిలిచిందిది. అలనాటి నుంచీ ఈనాటి వరకూ… ఈనాటి నుంచీ… రేపటి తరతరాల వరకూ ధర్మాధర్మ విచక్షణలతో న్యాయాన్ని నిలుపుతుండలన్నదే కాలమిస్తున్న తీర్పు…

అది అందరికీ అందేలా అమలవ్వాలన్నదే ప్రజలందరి అభిలాష.

అదే యూమీన్‌… ఐ మీన్‌.. వీ ఆల్‌ మీన్‌…!

అందుకే అలాగే అగుగాక… అదే జరుగుగాక…!! ఆమీన్‌… సుమ్మామీన్‌!!!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here