హైదరాబాద్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా? ఎక్కడెక్కడో ఏవో ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా. ఆ వొక్కటే ఆ ఊరు లేదా దేశపు అక్కడి స్పెషాలిటీ. అదొక్కటే అక్కడి ఐకన్. కానీ దాదాపు అన్నిదేశాలకు చెందిన ల్యాండ్ మార్క్స్ అన్నీ ఒక్క మన హైదరాబాద్‌లోనే ఉంటాయి.
ఉదాహరణలు కావాలా…?
న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అచ్చం అలాగే స్టాచ్యూ ఆఫ్ బుద్ధ మన ట్యాంక్‌బండ్‌లో.
థేమ్స్ ఒడ్డున లండన్… మన హైదరాబాద్ పక్కనే మూసీ.
మిషిగన్ సిటీ ఒడ్డునే మిషిగన్ లేక్… మన దగ్గరా హుసేన్‌సాగర్… హిమాయత్‌సాగర్ సరస్సులు.
కీన్యా పక్కనే మసాయి మారా అరణ్యం… హైదరాబాద్‌లో హరిణ వనస్థలి.
అందుకే ఏ అంతర్జాతీయ నగరానికీ తీసిపోని విధంగా హైదరాబాద్ ఉంటే… ప్రపంచంలోని అన్ని వింతలూ విశేషాలూ విడ్డూరాలూ హైదరాబాద్‌లో ఉన్నాయని నిశ్చయంగా చెప్పవచ్చు.
అచ్చం ఇలాగే… సౌదీ అరేబియాలో మక్కా మదీనా ఉన్నాయి కదా… ఇదే తరహాలో చార్మినార్‌కు ఆవల పక్కన మక్కా మసీదుంటే… ఈవల పక్కన మదీనా బిల్డింగ్.
రాజసం ఉట్టిపడేలా పొడవాటి బిల్డింగ్. నిజానికి అప్పట్లో మదీనా బిల్డింగే మన హైదరాబాద్‌లో మొట్టమొదటి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అట. ఇందులో మొత్తం 200లకు పైగానే దుకాణాలూ, కొట్లూ… మరో వందకు పైగా నివాస భవనాలూ (ఫ్లాట్స్ లాంటివి) ఉన్నాయట.
అప్పుడెప్పుడో నిజాముల కాలంలో సౌదీ అరేబియాలోని మదీనా, హెజాజ్, జెద్దా, తబూక్‌ల నుంచి వచ్చిన ఎందరో వాణిజ్యప్రముఖులకు ఆవాసాలూ, నివాసాలూ, వ్యాపార సముదాయాలను కల్పించేందుకు కట్టిన భవనమట ఇది. అందరికంటే ఎక్కువగా నవాబ్ అల్లాదీన్ అనే వణిక్‌ప్రముఖుడికి ఎక్కువ దుకాణాలూ, కొట్లూ కేటాయించారట. అలా వాణిజ్యాభివృద్ధి కోసం వ్యాపారస్తులకు కట్టించి ఇచ్చిన భవనం కారణంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ఎంతో వృద్ధి కలుగుతుందనే ఉద్దేశంతో ఏర్పాటైన భవనమిది.
అందుకే ఇక్కడ రకరకాల దుకాణాలు. కోట్లలో వ్యాపారాలు. ఎనెన్నో వస్తువుల వాణిజ్య వినిమయాలు. ఎగుమతులు–దిగుమతులు… ఇలా ఎన్నో. దీని ప్రభావం వల్ల అప్పట్లో చుట్టుపక్కల ఉండే ప్రాంతాలైన పత్థర్‌గట్టీ, చార్‌మినార్, లాడ్‌బజార్‌లలో కూడా పెద్దఎత్తున వాణిజ్యవ్యాపారాలు జరుగుతుండటంతో రేయింబగళ్లూ ఈ ప్రాంతమంతా ఇబ్బడిముబ్బడిగా జనాలతో సందడి సందడిగా ఉంటుంది.
ముందే అనుకున్నాం కదా… ఇక్కడంతా వాణిజ్యం.. ఎగుమతులూ అని. అందుకే పెళ్లిపేరంతాలకు సంబంధించిన అన్ని వస్తువుల వ్యాపారం ఇక్కడ జోరుగా జరుగుతుంటుంది. మన దేశాల వివాహాది శుభకార్యాలకే కాదు… యూఎస్, యూరప్, మధ్యప్రాచ్యంలోని అన్ని ముస్లిం దేశాలూ, పాకిస్థాన్, బంగ్లాదేశ్… ఇలా ఎన్నెన్నో దేశాల్లోని వేడుకలకూ ఇక్కడి దుస్తుల్లేకపోతే పెళ్లి జరగదూ… పబ్బం గడవదు.
మరి ఇంతమంది వచ్చీపోతూ ఉంటే తిండీ తిప్పలూ తినుబండారాలూ ఉండొద్దా? అందుకే వెలసింది మదీనా హోటల్. కొన్ని తరాల పాటు మరెన్నో కుటుంబాల కోసం బిర్యానీలూ, హరీసులూ, హలీములూ, పసందైన వంటకాలూ, రుచికరమైన వ్యంజనాలూ, చవులూరించే పదార్థాలు. అన్నీ అయ్యాక వేసుకోవాల్సిన జవ్వాదీ ఇత్యాది తాంబూలాదికాల కోసం… ఆకూవక్కలతో పాన్‌లూ… పసంద్‌లూ!
ఇక రంజాన్ లాంటి వేడుకేదైనా వచ్చిందా… అక్కడ రాత్రీ లేదూ… పగలూ లేదు. అంతా పట్టపగటి సందోహమే.
సౌదీలో ఒకవేళ మక్కా నుంచి మదీనాకు వెళ్లడమంటే… ఆ దేశంలో ఎంతో పెద్ద పుణ్యకార్యం కావచ్చు. కానీ మన హైదరాబాద్‌లోని మక్కా మసీదు నుంచి మదీనా బిల్డింగ్ వరకు నడటవం అంటే… ఇక్కడది ఓ పర్యాటక ప్రపంచం, ఓ వేడుక, ఓ వినోదం, వింతల ప్రపంచం, ఓ విజ్ఞాన విశేష విషయాలు తెలుసుకునే విహారమార్గం.