ఛాయ్​ జుర్రాలంటే.. నిమ్​రాహ్​ ఇరానీ కేఫ్‌

ఇరానీ కేఫ్‌లు అంతరించిపోతూ… అక్కడో… ఇక్కడో… ఏదో పాతవో, పురాతనమైనవో… తమ అస్థిత్వాన్ని ప్రకటించుకున్న ఈ రోజుల్లో…

మాంఛి కడక్‌ ఇరానీ చాయ్‌ దొరకడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో…

గరమ్‌ గరమ్‌ ఇరానీ దమ్‌ చాయ్‌ మొదలుకొని… హాట్‌ హాట్‌ మొగలాయీ పౌనా కోసం అర్రులుసాచేవారంతా… చాయ్‌ ఆస్వాదనాభిలాషులంతా, అతి కష్టమ్మీద,  ఇరుక్కునీ ఇరుక్కునీ, కప్పులోదాన్న జుర్రుకుని జుర్రుకుని…

చాయ్‌ తాగుతున్నప్పుడు గుటకలేస్తూ… పూర్తయ్యాక పెదవులు చప్పరిస్తూ...

మళ్లీ వచ్చేదెప్పుడో అంటూ అభిలషిస్తూ… అటు బయటి ముసాఫిరులూ, ఇటు హైదరాబాద్‌ బాటసారులూ చాయ్‌ కోసం వెతుకులాడే హాటు చోటు ఏదయా… అది ఉండేదెక్కడయా అంటే…

ఇంకెక్కడా… చార్మినార్‌కూ, మక్కామసీదుకూ మధ్యన ఉన్న

నిమ్‌రాహ్‌ ఇరానీ కెఫే బేకరీ దగ్గర!

ఇరానీ కెఫేలో దూరగానే మనం ఆర్డర్‌ చేసేదేమిటో అందరికీ తెలిసిందే…

గరమ్‌ గరమ్‌ చాయ్‌… ఉస్మానియా బిస్కెట్‌ కే సాథ్‌.

ఉస్మానియా బిస్కెట్‌ కాకపోతే… జీరా బిస్కెట్‌… జీరాబిస్కెట్‌ కాకపోతే టాయ్‌బిస్కెట్‌… టాయ్‌ బిస్కెట్‌ కాకపోతే ఖారాబిస్కెట్, ఖారాబిస్కెట్‌ కాకపోతే కోకోనట్‌ బిస్కెట్‌… ఇలా బిస్కెట్లూ, బిస్కెట్లూ… బాస్కెట్లకొద్దీ బిస్కెట్లు! 

కాస్తంత తీపి శ్నాక్స్‌ తినాలనుకుంటే దిల్‌భర్‌కే… బటర్‌ బన్, మరెన్నో బన్స్‌…

ఇంకా దిల్‌ఖుష్‌లూ, దిల్‌పసంద్‌లు!!

నిమ్‌రాహ్‌ కేఫ్‌కి ఓనర్‌ ఆజామ్‌భాయ్‌. అన్నట్టు ఆజమ్‌భాయ్‌ వాళ్ల నాన్నగారైన అబూద్‌ బిన్‌ అస్లమ్‌ అల్‌ ఖతేరీ గారు 1993లో దీన్ని ప్రారంభించార్ట. ఆయన 1967 నుంచీ బేకింగ్‌ విద్యలో ప్రావీణ్యుడట. పర్యాటక నగరమైన హైదరాబాద్‌లో టూరిస్టులకు అందుబాటులో ఉండేలా… అదీ ఓ పర్యాటక ప్రదేశమయ్యేలా…

మళ్లీ మళ్లీ వచ్చి చూడాలనిపించేలా… రుచి చూడాలనిపించేలా ఓ స్వచ్ఛమైన ఇరానీ కేఫ్‌ అండ్‌ బేకరీ నెలకొల్పడానికి… 1967లో ఆయన తీసుకున్న సంకల్పం 1993లో పూర్తయ్యిందట.

అన్ని చోట్లా దొరికినట్టే ఇరానీ చాయ్‌ ఇక్కడా దొరక్కతప్పదు.. దానికి తోడు అప్పుడెప్పుడో ఇరానీ కేఫ్‌ల స్వర్ణయుగాల్లో దొరికే పౌనా కూడా ఇక్కడ దొరుకుతుంది. పౌనాలో పాల పాళ్లు  ఎక్కువ. డికాక్షన్‌ తక్కువ.

నాలుగింట మూడొంతులు పాలే. ఒక్క వంతే డికాక్షన్‌. దాంతో మాంఛి మీగడ పాల రుచితో మిల్క్‌ రిచ్‌ చాయ్‌యే పౌనా! దానికి రాజరికపు దర్జాలూ, రాయల్‌ ఠీవీ సొబగులూ అద్దేలా చేయడానికి దాన్ని ‘మొగలాయీ పౌనా’ అని కూడా అంటారు. చాయ్‌లలో అందటి మొగలాయీ, మొనగాయీ చాయ్‌ ఇది.

నిమ్రాహ్‌లో గుమ్‌రాహ్‌ అయిపోతామేమో అనేంతగా… తొడతొక్కిడిగా ఉండే ఈ ప్రదేశంలో మునివేళ్లతో చాయ్‌ అందుకోవాలంటే… కాలి మునివేళ్ల మీద నిలబడి అందుకోవాల్సిందంతే. అంత రష్షు మరి…

అవును మరి…

ఎంత రుచికి.. అంత రష్షు!!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here