‘ఎరుపే’ అందం. ఈ మాటెప్పుడో రంగు వెలిసిపోయింది. ‘అన్ని రంగులూ అందమైనవే’ అన్న నిజం అందరికీ తెలిసిపోయింది. అయినా సరే ప్రచార హంగులతో ఆ రంగు ముచ్చట మన చెవులకు రింగుమని వినిపడుతనే ఉంది. అందాల భ్రమల్లోకి దించుతనే ఉంది. ఫెయిర్‌నెస్ క్రీములు ఫియర్‌లెస్ లైఫిని ఇస్తాయనే మాట నూటికి నూరుపాళ్లు అబద్దం! అందానికి ప్రమాణాలు లేవు. మీ ఐడెంటిటీనే మీ ‘అందం’. ఒకరితో పోలికే అందవిహీనమైన ఆలోచన.
అందాలమోజులో పైసలు పోగొట్టకునే వాళ్లెందరో. ఆ అందంలేదని ఆత్మాభిమానం కోల్పోయేవాళ్లు కొందరు. తన రంగును తప్పుపట్టే వాళ్లకు భయపడిపోకుండా ‘నా రంగే నా ఐడెంటిటీ’ అంటున్న ‘ఇషా రెబ్బ’ ఈ తరం అమ్మాయిలకు ఆదర్శం కావాలి. ఓ నెటిజన్ ‘మీరు ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుండేది’ అంటూ కామెంట్ చేసిండు. అందుకు ఇషా ‘తక్కువేమి నాకు’ అంటూ అందంగా ఎదురు ప్రశ్నించింది. ‘నా అందమే నాకు గుర్తింపు. అదే నా ప్రత్యేకత. ఎవరికీ భయపడని ధైర్యమే అందం’ అంటూ తన అందాన్ని పదర్శించింది. ఇది ఓ సినిమా తారకు ఎదురైన అనుభవమే కాదు. మన ఇంటా బయటా వినిపించే మాటే. స్నేహితులు, బంధువులు, కొలీగ్స్.. ఏదో ఒక సందర్భంలో ఓ రంగును ప్రశంసిస్తూ, ఓ రంగుని చులకన చేస్తూ మాట్లాడతారు. ఈ మాటకు మనసు అలవాటైపోయింది. ఓ రంగును అవమానించడం తప్పని, అందానికి ఓ రంగు ప్రమాణం కాదని చెప్పడం వదిలేస్తున్నాం. కానీ ఆమె సింపుల్‌గా తీసుకోలేదు. ఇంకో సారి తనరంగుని ఉద్దేశించిన మాట్లాడకుండా ఇషా బదులిచ్చింది. ఆమె తన ఐడెంటిటీని అలా కాపాడుకుంది. మనం ఆ ప్రయత్నం చేస్తున్నామా? లేదు. ఆ మాటాలకు పొంగిపోయేవాళ్లు పొంగి పోతున్నారు. కుంగి పోయేవాళ్లు కుంగి పోతున్నారు.
ఓరుగల్లు నల్ల కలువ
చర్మం ఎర్రబడాలని కోరుకోవడం చాలా మంది కోరిక. నల్లగా పుట్టి ఉండకపోతే ఎంత బాగుండో అనుకునే అమాయకులెందరో. వాళ్లని ఆత్మన్యూనత ఆవహించడాని కారణాలు అనేకం. సినిమాల్లో మిల్కీ బూట్యీలకు ఉండే ప్రాధాన్యత అలాంటిది. మీడియాలో, సమాజంలో ఎరుపు రంగుకి ఇచ్చే ప్రాధాన్యతే వేరు. ఇవన్నీ చూసి తాము అందంగా లేమని చాలా మంది బాధపడతారు. నలుపుకు తక్కువేమిటి? ఎరుపుకు ఎక్కువేమిటి? అని సొసైటీని ఛాలెంజ్ చేసి జీవితంలో గెలిచినవ వాళ్లూ ఉన్నారు. కానీ వాళ్లంతా కాస్మొటిక్స్‌తో సక్సెస్ కాలేదు. గెలపుకు కావాల్సింది ప్రతిభ. పట్టుదల. ఈ రెండే విజయానికి సోపానాలంటుంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శశి వంగపల్లి. వరంగల్లు జిల్లాకు చెందిన శశి నల్లగా ఉంటుంది. ఆమె ఇంజనీరింగ్ చదివింది. మల్టీ నేషషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొలువులో చేరింది. అన్నీ ఉన్న ఆమెకు పెండ్లి చేయడం వాళ్ల అమ్మానాన్నలకు తలకు మించిన భారమైంది. పెండ్లి చూపులకు వస్తున్నారు. చూస్తున్నారు. తర్వాత చెబుతామంటూ పోయినవాళ్లు తిరిగి రాలేదు. ఇట్లా నెలకో పెండ్లి చూపులు నడుస్తనే ఉన్నయ్. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నయ్. ఈ పిల్లకు పెండ్లవుతుందా? అని బంధువులనుకుంటున్నరు. పెండ్లి చూపులతో సంవత్సరాలు గడిచినయ్. ఇలా 42 సంబంధాలొచ్చి పోయినయ్. తాళిని ఆశించిన ఆమెను అందం పేరుతో ఎందరో ఎగతాళి చేశారు. ‘ప్రతి నెలా ఆఫీసుకు సెలవు పెట్టడం, పెండ్లి చూపుల కోసం చీరె కట్టడం ఓ తంతుగా నడిచింది. మన దేశంలో రంగుకు అట్రాక్ట్ అయ్యేవాళ్లు ఎక్కువ. ఆ ఆట్రాక్షన్ లేదని ఎన్నో చేదు అనుభవాలు చవిచూశాను. చివరికి పెండ్లి చూపులపై నాకే చిరాకొచ్చింది. పెండ్లి చూపులొద్దు. పెండ్లీ వద్దని అమ్మానాన్నలకు తెగేసి చెప్పిన. ఉన్న ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకాలనుకున్న. ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నది నా కోరిక. కానీ నేను ఆ కోర్సులు చదవలేదు. యూ ట్యూబ్‌లో చూసి నేర్చుకున్న. కెరీర్‌కి కాన్ఫిడెన్సే కావాలి. నలుపా, తెలుపా అన్నది విషయమే కాదు. ఎవరికైనా సెల్ఫ్ ఐడెంటిటీ ఇంపార్టెంట్. నాలాగ నేనున్నానా? లేదా? అని మాత్రమే అలోచించిన. ఎప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అందుకే నేను ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్ అయ్యాను. లాక్మే ఫ్యాషన్ వీక్ దాకా ఎదిగాను. సినిమాలు, సెలబ్రిటీల కోసం డిజైన్ చేసిన. ఈ సక్సెస్ చూసి క్యాన్సిల్ అయిన సంబంధాలు తిరిగొచ్చినయి. గెట్ ఔట్ అన్నాను. నిన్నటి రంగు, అందం డబ్బుతో మాఫీ అవుతాయా? నేను నల్లగా వున్నానని వద్దనుకున్నవాళ్లలో 15 మంది మళ్లీ తిరిగి వచ్చారు. ఈ అమ్మాయిని ఆ రోజు వదులుకోకుంటే బాగుండేది అనుకున్నారు. కానీ నేను తిరస్కరించాను. వాళ్ల పెండ్లికి ఖరీదైన డ్రెస్ డిజైన్ చేయించుకునేందుకు నన్ను కాంటాక్ట్ చేశారు. నన్ను కాదన్నవాళ్లే నా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూశారు. కానీ నేను ఒక్క మెట్టు దిగలేదు. అందంగా లేమని ఎవరన్నా? తిరస్కరించండి. ఇది మనపై మన పెద్దలు రుద్దిన ఆలోచన. పిల్లలకు అందం అంటే మనసు అని నేర్పిద్దాం. మరుతున్న ప్రపంచంతోపాటే రేపటి తరాన్ని నడిపిద్దాం.’ అని సంగెం ముద్దుబిడ్డ శశి అంటోంది.
వియ్ లవ్ యూ.. డయానా!
‘1997లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ యువతి డయానా హెడెన్ చామన ఛాయ ఉంటుందని, ఆమె ఎలా ప్రపంచ సుందరి అయిందో? మిస్ వరల్డ్ ఎంపికలో న్యాయ నిర్ణేతలు పొరబడ్డారు? ’ అని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ అన్నాడు. ఈ మాట ఒక్క డయానానే కాదు చామన ఛాయ రంగులో ఉండే కోట్లాది భారతీయుల్ని బాధపెట్టింది. ఆ మటలకు డయానా సరైన సమాధానం చెప్పింది. నా చర్మం రంగు చూసే అందంగత్తె కిరీటం నెత్తిన పెట్టలేదు. నాలోని దృఢమైన సంకల్పం, నా ఆలోచనలు వాళ్లకు నచ్చాయి. నా రంగుని ఉద్దేశించి చేసిన విమర్శను కోట్ల మంది ఖండిస్తున్నారంటే నా రంగు నన్ను గర్వపడేలా చేసిందని, దేశం గర్వించేలా బదులిచ్చింది హైదరబాద్ ఆడబిడ్డ! ఈ బ్రౌన్ స్కిన్‌ని చూసుకుని ఎప్పడూ గర్వపడతానన్న డయానా పాతికేళ్ల తర్వాత కూడా అదే మాట చెప్పింది. ఇలాంటి విమర్శలు, వివక్షను ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన మహిళలు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటినీ అధిగమిస్తూనే వ్యక్తిత్వమే నిజమైన అందంగా నిరూపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనె, జీవితా, నందితాదాస్, రోజా అందానికీ ప్రాధాన్యతనిచ్చే సినిమా రంగంలో రాణించారు. రాణిస్తున్నారు.
అందమైన ప్రకటన
అందం విషయంలో అందరి అభిప్రాయాలూ ఒకేలా లేవు. అలాగే అన్ని కాలాల్లోనూ ఒకేలా లేదు. ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకుంటే సిగ్గుపడేవాళ్లు. ఇప్పుడు చిరిగినవే కావాలంటున్నరు. మంచి దుస్తుల కంటే చిరిగిన దుస్తులే రేటెక్కువ. కారణం మనం చూసే దృష్టి మారడమే. సమాజంలో దానికి యాక్సెసబిలిటీ ఉంది కూడా. అలాగే రంగు విషయంలోనూ మార్పు రావాలి. టీవీ స్కీన్‌పై ఏది ప్లే చేసినా జనం చూస్తారులే అనుకునే కంపెనీలు ఫెయిర్‌నెస్ మాటలతో ‘డర్టీ యాడ్స్’నే చూపిస్తుంటయ్. నమ్మేస్తారులే అనుకుంటారో? నమ్మించగలమని అనుకుంటారో కానీ మనలో కొందరు ఆ మయాలో పడతారు. కాస్మొటిక్ యావలో కొట్టకుపోతారు. చివరకు మిగిలేది?.. డబ్బు గుల్ల. రంగు మారదు. ఎర్రతోలే అందం అనడం పొరపాటే కాదు. తప్పు కూడా. మన దేశంలో అనేక జాతులవాళ్లుంటున్నారు. ఒక్కో జాతిది ఓ రంగు. ఒకరి రంగుతో మరొకరిని పోల్చి అందంగా లేరని అనడం జాతి వివక్ష కూడా. ఈ వివక్షను పోగొట్టాలన్న డిమాండ్లు పెరుగుతన్నట్టే ఈ జాడ్యాన్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్న సంస్థలూ ఉన్నాయి. ఫెయిర్‌నెస్ క్రీముల వాణిజ్య ప్రకటనలను ఎన్‌డీటీవీ ప్రసారం చేయనని గతంలో ప్రకటించి మీడియాకు మార్గదర్శిగా నిలిచింది. ఈ ప్రకటన వాణిజ్య ప్రకటనల రంగంలో మంచి మార్పు తెస్తే అందం అందరిదీ అనే ఆలోచన పెరుగుతుంది.
ఫెయిర్ నెస్ డ్రీములొద్దు
చర్మం తెల్లగా ఉంటే ఉద్యోగమెట్లొస్తది? ఈ ప్రపంచాన్ని గెలిచేంత కాన్ఫిడెన్స్ కేవలం చర్మం రంగు మారితేనే వస్తుందా? ఎలా సాధ్యం? అదంతా ఉత్తదే. అందం విషయంలో మనలో చాలా అపోహలున్నాయి. దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులకు రంగులో తేడా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎండలో తేడా ఉంటుంది. వాళ్లలా కనిపించాలని ఫెయిర్‌నెస్ క్రీమ్‌ని వాడాల్సిన అవసరం లేదు. కొంచెం దూరం నుంచి చూస్తే ఎర్రగా ఉండేవాళ్ల ముఖంలో ఫీచర్స్ కనిపిస్తాయి. నల్లగా ఉండేవాళ్ల ఫేస్ ఫీచర్స్ (ముఖ్యు, కళ్లు, నుదురు, చెవుల ఆకృతి) దగ్గరగా ఉంటేనే కనిపిస్తాయి. తేడా అంతే. ఇప్పటికీ మన ఊళ్లలో ‘ఎర్రగా వున్నా ముఖంలో కళలేదు.’ అంటారు. కలర్ కన్నా కళకు ప్రాధాన్యత ఉంది. ఆ కళ చూపుల నుంచి, వ్యవహార దక్షణ నుంచి వస్తుంది. కళ్లలో చురుకుదనం, పెదవులపై నవ్వు, చెక్కిలిపై చురుకుదనం కనిపించాలి. అదే కళ. అసలైన అందం అందే. ఆ అందం ఒక్క కాన్ఫిడెన్స్ నుంచే వస్తుంది. అది వ్యక్తిత్వం వున్నవాళ్లలోనే ఉంటుంది.
రంగు రహస్యం
మన చర్మంలో మొలనోసైట్స్ అనే కణాలుంటాయి. ఆ కణాల్లో జరిగే జీవక్రియల వల్ల ‘మెలనిన్’ విడుదలవుతుంది. ఆ మెలనిన్ చర్మానికి ఒక నిర్ధిష్టమైన రంగు నిస్తుంది. ఆ మెలనిన్‌ను విడుదలలో అప్పుడప్పుడూ కొన్ని మార్పులొస్తాయి. దీనివల్లే స్కిన్ పిగ్మెంటేషన్ వస్తాయి. ఈ మార్పు శాశ్వతం కాదు. ఆ సమస్యకు కారణాలు పోతే ఈ మంగు మచ్చలు కూడా పోతాయి. కానీ ఎన్ని క్రీములు వాడినా పుట్టకుతో వచ్చిన చర్మం రంగు మారదు.
సౌందర్య దేవత
ఫొటో:
మెలనిన్ అధికంగా ఉన్న ఈ సౌందర్య దేవతను ఫ్యాషన్ ప్రపంచం ‘మెలనిన్ గాడెస్’ అనే పేరుతో పిలుస్తోంది. సూపర్ మోడల్‌గా రాణిస్తూ అందాల ప్రపచంలో దృవతారగా వెలిగిపోతున్న ఆమె నిజమైన అందానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఇది ఆమెప్రతిభతోనే సాధ్యం కాలేదు. ఆదరించే ఆ సమాజం కూడా కారణమే. వాళ్లు మనకంటే ముందున్నరు.
కళ.. నిజమైన కల!
కళ్లు, ముక్కు, చెవులు ఎర్రగా ఉన్న వాళ్ల ఫేస్ ఫీచర్స్ కనిపిస్తాయి. నల్లగా ఉంటే దగ్గరగా ఉన్నపుడు కనిపిస్తాయి. కలర్ ద్వారా ఆ ఫీచర్స్ కొటొట్టచ్చినట్టు కనిపిస్తాయి. ఊరి జనం తెల్లగా ఉన్నా ముఖంలో కళ లేదంటారు. బ్యూటీ కళ్లలో, కదలికల్లోనూ ఉంటుంది. అది వ్యక్తిత్వం నుంచి వస్తుంది. ఫెయిర్ స్కిన్ ఉన్నవాళ్లు ఉద్యోగాల్లో రాణిస్తారని అనుకునే వాళ్లు ఉద్యోగాలిస్తారు. కానీ ఆ రంగుకు ఉండే ఆకర్షణ కొద్ది క్షణాలే ఉంటుంది. ప్రతిభ లేని వాళ్లలో వ్యవహార దక్షత లోపిస్తుంది. ఎదుటి వారితో కనెక్ట్ అయితేనే వాళ్లు మనతో మాట్లాడాలనుకుంటారు. అంతేకానీ ఎర్రగా ఉన్నారని గంటలు మాట్లాడరు. రిసెప్షనిస్ట్ నుంచి పబ్లిక్‌తో రిలేషన్ ఉండే చాలా కొలువుల్లో ఈ లాజిక్ పనిచేయదట. ప్రతిభలేనివాల్లు త్వరగా కనెక్ట్ కాలేదు. అప్పీయరెన్స్ చూసి ఎక్కువ సేపు చూడరు. మాట్లాడరు. అది ఇతరుల్ని మెప్పించలేదు. అంతిమంగా ప్రతిభే రాణిస్తుంది. అందం కంటే ప్రతిభే కొలువులో కాపాడుతుంది.