పన్నెండు.. ఒకటి.. రెండు.. మూడు.. అర్ధరాత్రి దాటి గడియారం ముల్లు పరుగెడుతుంటది. కోడి కూసే టైమ్ కూడా అయితది కానీ నిద్ర మాత్రం పట్టదు.
పని చేయడానికి కూర్చుంటరు కానీ, ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోతుంటాయి.
ఒంటరిగా ఉండాలనిపిస్తది. ఈ ప్రపంచం నుంచి ఎక్కడికో పారిపోవాలనిపిస్తది. పారిపోయి ఏం చేయాలో కూడా తెల్వదు. ఆకలి పట్టింపు ఉండదు. ప్రతిచిన్న విషయం కోపం తెప్పిస్తది. ఇదంతా ఇలా జరుగుతున్నట్టు ఎవ్వరికీ చెప్పాలనిపించదు కూడా!
మనదేశంలో 90 శాతం మంది దీన్నసలు ఒక సమస్యగా కూడా గుర్తించట్లేదు.
ఇది డిప్రెషన్. చాలా పెద్ద జబ్బు. ఊర్ల కంటే, సిటీలనే ఎక్కువ పట్టుకున్న జబ్బు.
750 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచం మొత్తంలో మనదేశం ఒక విషయంలో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. అది భయపడాల్సిన విషయం. ఎందుకంటే నెంబర్ వన్ ఉన్నది డిప్రెషన్‌లో. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలను బట్టి చూస్తే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతోంటే, అందులో మనవాళ్లే ఎనిమిది కోట్ల మంది ఉన్నారు. ఇందులో ఊళ్లలో కంటే, సిటీల్లో ఉంటున్న వాళ్లే ఎక్కువమంది. సిటీలకే ఎందుకొచ్చిందీ కష్టం? డిప్రెషన్‌ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం డిప్రెషన్ అంటే ఏంటి?
డిప్రెషన్ అన్నది కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ, నిజానికి ఇది చాలా పెద్ద మానసిక జబ్బు. ఈ జబ్బు ఒక్కోసారి ఆ మనిషిని చావు వరకూ తీసుకెళ్తుంది. నిరంతరం ఏదో బాధ వెంటాడుతున్నట్టు, ఒంటరిగా ఉన్నట్టు, ఏ పనీ చేయబుద్ధికాదు. ఇదంతా డిప్రెషనే! ముందు మానసికంగా వెంటాడే ఈ జబ్బు తర్వాత శారీరక సమస్యల వరకూ తీసుకెళ్తుంది. అది చివరకు చావుకు కూడా దారితీయవచ్చు.
ఈ నగరాలకే ఏమైంది?
డిప్రెషన్‌కు ఎన్నో కారణాలున్నా, ఆ కారణాలన్నీ ఎక్కువగా సిటీ జీవితాన్నే గబ్బిలాల్లా పట్టుకొని వేలాడుతున్నాయి. అందుకే రోజురోజుకీ సిటీల్లో డిప్రెషన్ బాధితులు పెరిగిపోతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్… ఈ నాలుగూ డిప్రెషన్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న నగరాలు. ఈ నగరాల్లో దాదాపు 13 శాతం మంది డిప్రెషన్ బాధితులు ఉన్నారు. ఇది 2050కి రెట్టింపు అవుతుందని అంచనా.
సిటీల్లోనే ఎందుకుంటున్నాయి ఈ డిప్రెషన్లు అనే అంశంపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక సమస్య డిప్రెషన్‌కు ఎక్కువ దారితీస్తోంది. ఈ రకమైన డిజార్డర్ ఉన్న వ్యక్తులు అవతలివాళ్లు మాట్లాడనివి మాట్లాడినట్టు ఊహించుకుంటారు. ఎక్కువ ఆలోచనలను మీద వేసుకుంటారు. వీటి మధ్యలో వాళ్లను వాళ్లే కోల్పోతుంటారు. ఇది డిప్రెషన్ వైపుకు సులువుగా లాక్కుపోయే మానసిక సమస్య.
టీనేజీ వరకూ ఊళ్లో ఉండి వచ్చిన వాళ్లు, సిటీకి వచ్చాక ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోలేక, కొత్త ప్రపంచంలో ఇమడలేక ఒంటరితనాన్ని ఇష్టపడుతుంటారు. అదే మెల్లగా డిప్రెషన్ వైపుకు వాళ్లను నడిపిస్తోంది. కార్పొరేట్ ప్రపంచంలో రేసులో పడిపోయి ఎప్పటికప్పుడు పని ఒత్తిడి పెంచుకోవడం కూడా డిప్రెషన్‌కు ఒక కారణంగా కనిపిస్తోంది. కాంక్రీట్ జంగిల్ అంటున్నారు ఇప్పుడు సిటీలను. ఎవరికి వారు వాళ్లు వాళ్ల చిన్న చిన్న ప్రపంచాలకే పరిమితమవ్వడం కూడా డిప్రెషన్‌కు ఒక కారణం. నిరుద్యోగం, పేదరికం లాంటి సామాజిక సమస్యల కన్నా లవ్ ఫెయిల్యూర్, ఆఫీసుల్లో పని ఒత్తిడి, ప్రపంచానికి దూరమవుతున్నట్టు ఉండే వృత్తులు.. ఇవన్నీ సిటీల్లో రోజురోజుకీ పెరిగిపోతోన్న డిప్రెషన్‌కు కొన్ని ముఖ్యమైన కారణాలు. ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి తీసుకునే అలవాటు పెరగడం కూడా డిప్రెషన్‌కు ఒక ప్రధాన కారణం.
ఊర్లు బానే ఉన్నయ్!
నిజానికి సిటీలకంటే ఊళ్లలోనే డిప్రెషన్‌తో బాధపడే మనుషులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సిటీలతో పోల్చుకున్నప్పుడు ఊళ్లలోనే విద్యా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండటం, ఊళ్లు దాటలేని చాలామంది అక్కడే ఉండిపోవడం, వ్యవసాయం, కులవృత్తులు లాంటివి రోజురోజుకీ క్షీణించిపోవడం డిప్రెషన్ వైపుకు వాళ్లను తీసుకెళ్తున్నాయి. అయినప్పటికీ చుట్టూ ఉండే పరిస్థితులు, వాతావరణం, మాట్లాడటానికి నలుగురు మనుషులు పక్కన ఉండటం చాలామందిని డిప్రెషన్‌కు వెళ్లనీయకుండా ఆపుతున్నాయి. దేశాన్ని ఇవ్వాళ భయపెడుతోన్న అతిపెద్ద సామాజిక సమస్య – రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం. ఇలాంటి ఆత్మహత్యల్లో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల కంటే కొద్దికాలం వెంటాడే డిప్రెషనే ప్రధానం. ఊళ్లలో ఉండే మహిళలు డిప్రెషన్ వైపుకు ఎక్కువ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం వంటివి చేయకపోవడం, ఇంటి బాధ్యతను మీద వేస్కోవడం వల్ల చిన్న చిన్న ఊళ్లలో ఉండే ఆడవాళ్లు డిప్రెషన్‌కు గురవుతున్నారు.
మన హైదరాబాద్‌లో..
హైదరాబాద్ నగరంలో ఎక్కువమంది యువత డిప్రెషన్ బాధితులు. ఈ ఏడాది ఇప్పటి వరకు 250 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ఇందుకు డిప్రెషన్, ఒత్తిడులే ప్రధాన కారణాలు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లలో కూడా మహిళలు ఎక్కువమంది ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన మగ, ఆడ ఇద్దరి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంది. అసలీ డిప్రెషన్‌కు ప్రధాన కారణం ఏంటని నిపుణుల్ని అడిగితే… పర్ఫెక్షనిజమ్, ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కావాలనుకోవడం వంటి వాటిని ప్రధాన కారణాలుగా చూడాలంటున్నారు. ప్రత్యేకించి మహిళల్లో అదికూడా 20 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. పర్ఫెక్షనిజమ్ పరుగు పందెంలో పడి మంచి నిద్ర, మంచి తిండి, మానసిక విశ్రాంతి, ప్రశాంత చిత్తం కోల్పోతున్నారు. దాంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి తీరికగా ఆలోచించకుండా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అది పలురకాల తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది.
ఇలా ఆలోచిస్తేనే అందం
ఇన్‌స్టంట్ నూడిల్స్ ఎలాగైతే క్షణాల్లో తయారవుతాయో… అచ్చం అలాగే పనిలో, ధనవంతులు కావడంలో, కుటుంబ సంబంధాల్లో, ఆరోగ్యం విషయంలో, మంచి పేరెంట్స్ అనిపించుకోవడంలో కూడా ఇన్‌స్టంట్‌గా పర్ఫెక్షనిజమ్ కోరుకుంటున్నారు. అందుకే అసలు తిప్పలు వచ్చి పడుతున్నాయి. ఆరోగ్యంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యల్లో చాలావరకు పొద్దున్నే లేచి నాలుగు అడుగులు నడిస్తేనో లేదా యోగా చేస్తేనో మీ దరిదాపులకు రాకుండా పారిపోతాయి. అలాంటి వాటికి కూడా ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోసం మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నారు. దాంతో వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను చేతులారా ఆహ్వానించిన వారవుతున్నారు.
డిప్రెషన్‌ను గుర్తించండిలా…
డిప్రెషన్‌లోనే చాలా రకాలు ఉన్నాయి. మనకు ఇష్టమైన వ్యక్తులు చనిపోయినప్పుడు, ఎంతో ఆశించిన విజయాలు దక్కనప్పుడు బాధ చుట్టుముడుతుంది. సాధారణంగా అయితే ఇది కొన్ని రోజుల్లో సర్దుకోవాలి. అలా సర్దుకోకుండా ఆ బాధ తర్వాత కూడా వెంటాడితే మాత్రం అది డిప్రెషనే. డిప్రెషన్‌ను కొన్ని లక్షణాలు చూసి గుర్తించవచ్చు.
ఎప్పుడూ బాధగా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం.
ఏ పని చేయడానికీ ఉత్సాహం చూపకపోవడం.
తిండి, నిద్ర లాంటివి పట్టవంటూ ఆసక్తి చూపకపోవడం.
ఏదో తప్పు చేసినట్టు అందరికీ దూరంగా వెళ్లిపోవడానికి ప్రయత్నించడం.
ఆత్మహత్య గురించి ఆలోచించడం, లేదా దాని గురించి మాట్లాడటం.
ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలే! దానికి కారణాలు ఏమై ఉన్నా, ఈ డిప్రెషన్ ఆత్మహత్య వరకూ తీసుకెళ్లవచ్చు. దీనికి తక్షణమే చికిత్స అవసరం. డిప్రెషన్ మొదట్లోనే ఉంటే చుట్టూ నలుగురు సపోర్ట్ ఇవ్వడం, మాట్లాడటం, జీవితం పట్ల నమ్మకాన్ని ఇవ్వడం లాంటివి చేస్తే సరిపోతుంది. అది చాలారోజులుగా ఉంటే మాత్రం డాక్టర్‌ను కలిసి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
సిగ్గుపడొద్దు.. బయటపడాలి!
డిప్రెషన్ బారిన పడిన వాళ్లలో ఫేమస్ వ్యక్తులు కూడా చాలామందే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 2014లో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. అప్పుడు ఆమె కెరీర్ కూడా పీక్స్‌లో ఉంది. చేతినిండా అవకాశాలు. పని ఒత్తిడి అనుకుందే కానీ డిప్రెషన్ అనుకోలేదట. ఆ తర్వాత దానికి ట్రీట్‌మెంట్ తీసుకొని నలుగురిలో కలిశాకే ఆమె డిప్రెషన్‌ను దాటొచ్చింది. ‘‘మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు అనిపిస్తే, వెళ్లి మీ చుట్టూ ఉన్నవాళ్లకు చెప్పండి. సిగ్గుపడటానికి ఏం లేదు. డిప్రెషన్‌ను జయించాలి. అందులోంచి బయటికి వస్తేనే గొప్ప జీవితం ఉంది.’’ అంటుంది దీపిక. డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు సపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ అనే ఫౌండేషన్‌ను కూడా నడిపిస్తోంది.
పొద్దున్నే లేచి శరీరానికి ఎండ తగలనివ్వండి. పౌష్టికాహారం తినండి. కంటి నిండా నిద్రపోండి. లైఫ్ ఎంత బాగుంటుందో చూడండి. సమస్యలు ఎంతటివైనా ఎలా పరిష్కరించుకోవాలో మీకే తెలుస్తుందప్పుడు. అది కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా. దీనికి మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక గిన్నెను కళ్లకు చాలా దగ్గరగా పెట్టుకుంటే పెద్దగా కనిపిస్తుంది. అదే కాస్త దూరం జరిపితే దాని సైజ్ తగ్గిపోతుంది కదా. అలా జరుపుకుంటూ పోతే గిన్నె చిన్నదైపోతుంది. అచ్చం సమస్యకూడా అలానే దాని గురించే ఆలోచిస్తే పరిష్కారం వైపు చూడనీయకుండా భయపెడుతుంది. ఆ పరిస్థితుల్లో సింపుల్ సొల్యూషన్‌ను కూడా గుర్తించలేరు. అందుకని విషయం ఏదైనా సరే భూతద్దంలో చూడడం మానేయండి. బిందాస్‌గా బతికేయండి. జిందగీ నా మిలేగీ దొబారా!