ప్రస్తుత జనరేషన్ లో ఒత్తిడి, ఆందోళనకు గురై వ్యాధుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంలో యువ తరంలో ఈ సమస్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ధ్యానం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించే పద్ధతులు వంటి అభ్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని ఆహార మార్పులు కూడా ప్రయోజనాలను కలిగిస్తాయి.
కొన్ని ఆహారాలు ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు విశ్రాంతి తీసుకోవడానికి సహజమైన మార్గాలను వెతుకుతున్నట్లయితే, మీ ఆహారంలో ఈ క్రింది ఆందోళన-తగ్గించే ఆహారాలను చేర్చుకోండి.
డార్క్ చాక్లెట్
మిమ్మల్ని శాంతంగా ఉంచేందుకు కొద్దిగా చాక్లెట్ తీసుకున్నా ఎలాంటి హానీ ఉండదు. చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ సమయాల్లో మీరు చాక్లెట్ తినవచ్చు. ఇది మీ మెదడు వేవ్ ఫ్రీక్వెన్సీని మారుస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది.
బ్లూబెర్రీస్
ఈ శక్తివంతమైన చిన్న బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. పోషక విలువలున్న ఈ పండ్లు ఒత్తిడి స్థాయిలను నిర్వహించడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సూపర్‌ఫుడ్‌ని మీ బ్రేక్‌ఫాస్ట్ రొటీన్‌లో చేర్చుకోవడం ద్వారా ఒత్తిడి లేకుండా మీ రోజును ప్రారంభించవచ్చు. వాటిని పెరుగుతోనూ ఆస్వాదించవచ్చు. లేదా మీ వోట్‌మీల్‌పైనా చల్లుకోవచ్చు. రోజంతా సంతోషకరమైన, ప్రశాంతమైన రోజును గడపవచ్చు.
ఆరెంజ్‌లు
మీ ఆహారంలో నారింజను చేర్చుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాదు ఇది ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీరు నారింజను చిరుతిండిగానూ తీసుకోవచ్చు లేదా దాని ముక్కలను సలాడ్‌లోనూ చేర్చవచ్చు లేదా స్మూతీగా కూడా ఆస్వాదించవచ్చు.
అరటిపండ్లు
అరటిపండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఒక్క అరటిపండులో సుమారు 37 మి.గ్రా ఖనిజాలు ఉంటాయి. దీని వల్ల హృదయ స్పందన రేటును నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మూడ్ స్వింగ్‌లను కూడా నియంత్రిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరిచే ప్రభావం కోసం అరటిపండ్లను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మీ భావోద్వేగాలను స్థిరంగా ఉంచుకోవచ్చు.
చిలగడదుంపలు
క్రమం తప్పకుండా తియ్యటి బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ B6 పెరుగుతుంది. ఇందులోని సెరోటోనిన్.. డోపమైన్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. డోపమైన్ మీ మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.