టీవీని ఎక్కువగా చూడడం వల్ల అనేక రకాల ఊహించని అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. కాలక్రమేణా ధీర్ఘ కాలిక వ్యాధులకు కూడా ఇది కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశముందని చెబుతున్నారు
శారీరక అనారోగ్యం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, అదే పనిగా కూర్చుని టీవీ చూడడం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిరాశతో సహా వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యాక్టివ్ సిట్టింగ్ (డెస్క్ వద్ద కంప్యూటర్‌లో పని చేయడం), నాన్‌యాక్టివ్ సిట్టింగ్ (టెలివిజన్ చూడటం) మధ్య వ్యత్యాసం ఉందని.. నాన్‌యాక్టివ్ సిట్టింగ్ అనేది 25 శాతం అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI), యువకులలో బాడీ ఫ్యాట్ శాతాలతో పాటు మొత్తంగా మెటబాలిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉందని తెలిపింది.
అతిగా తినడం
అతిగా టీవీ చూడడం వల్ల వాళ్లు అక్కడ్నుంచి కదలరు. ఏ పనైనా టీవీ ముందు కూర్చునే చేస్తారు. అందులో ఒకటి తినడం. టీవీ చూస్తూ తినడం వల్ల మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా తెలియదు. దాని వల్ల తినాల్సిన దాని కన్నా ఎక్కువ తినేస్తాం. ఫలితంగా జీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి ధీర్ఘ కాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
సోషల్ రిలేషన్షిప్స్
జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అడిక్షన్స్‌లో డిసెంబర్ 2017లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, టెలివిజన్ సిరీస్ లేదా మినిసిరీస్ అయినా, పగలు రాత్రి అనే తేడా లేకుండా తరచుగా చూసే వారు సామాజిక ఒంటరితనం, పేలవమైన మానసిక ఆరోగ్య సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. టీవీకి అలవాటు పడిన వారు బయటి వాతావరణంలో తిరగడానికి, ఇతరులతో మాట్లాడడానికి విముఖత ప్రదర్శిస్తారు. ఇది క్రమంగా ఒత్తిడిని కారణం కావచ్చు. కుటుంబంలోని బంధాలపైనా ఇది తీవ్ర ప్రభావం చూపవచ్చు.
స్లీప్ డిస్టర్బెన్స్
అతిగా టీవీ చూడడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తాయని ముందే చెప్పుకున్నాం. మరో ముఖ్య విషయమేమింటే దాని వల్ల నిద్ర లోపిస్తుంది. నిద్రకు అంతరాయం కలుగుతుంది. సరిగ్గా నిద్ర పట్టక, ఏ పనీ చేయాలనిపించదు. దేనిపైనీ దృష్టి సారించాలని అనిపించదు, ఇది క్రమంగా భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది.
ప్రవర్తనా వ్యసనం
తరచూ టీవీ చూడడం వల్ల ప్రవర్తనలోనూ తీవ్ర మార్పులొస్తాయి. ఎవరూ ఏం చెప్పినా వినిపించుకోరు. వారి మెదడుకు ఎక్కదు కూడా. అదొక వ్యసనంగా మారిపోతుంది. క్రమంగా కళ్లు పాడయ్యే అవకాశం ఉంది. కొన్ని సార్లు కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మెడ ఇతర శరీర భాగాల్లోని అవయవాలు వాటి పని సక్రమంగా చేయక, ఒకే దగ్గర కూర్చుని ఉండడంతో రక్త ప్రసరణ సరిగా కాక కాళ్లు, చేతులు వాపులు వచ్చే అవకాశం ఉంది. అది ధీర్ఘకాలంలో ఊపిరితిత్తులపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.