జె. వి. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం శంకరాభరణం. కె విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి ఈ చిత్రం మేలిమలుపు అయ్యిందని చెప్పాలి. అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ విజయం సాధిచడంతో పాటుగా ఒక సంచలనం సృష్టించింది. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.
అయితే ఈ కథను రాసుకున్నప్పుడు దర్శకుడు కె విశ్వనాథ్ శంకరశాస్త్రి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావు, శివాజీగణేశన్ లను అనుకున్నారు. కానీ వారిని సంప్రదించలేదు. ఆ తరువాత కృష్ణంరాజుకు కథను వినిపించారు. అయితే, ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు రిజెక్ట్ చేశారు. దీంతో ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ కు నిర్మాత నాగేశ్వరరావు జె.వి.సోమయాజులు గురించి చెప్పారు. హీరోయిన్ గా మంజుభార్గవిని సెలక్ట్ చేశారు.
కొత్త నటుడితో, వ్యాంప్ పాత్రలు చేసే మంజుభార్గవి ప్రధాన పాత్రలుగా సినిమా ఎంటి అని మురళీమోహన్ లాంటి నటులు అనుకున్నారట. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుగా బయ్యర్లు దొరకలేదట. తీరా సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ లో సినిమా చూడడానికి ప్రేక్షకులు కూడా లేరు. మౌత్ టాక్ తో నెమ్మదిగా ప్రేక్షకులు రావడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఊరూరా విజయోత్సవాలు జరిగాయి. ఇక ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి ఈ చిత్రానికి పాటలు రాయగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. ఈ సినిమాతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు గాయకుడిగా మంచి పేరును తీసుకువచ్చింది.