గులాబీ సినిమాతో హిట్ కొట్టి దర్శకుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాను చూసిన చాలా మంది హీరోలు కృష్ణవంశీతో సినిమా చేయాలని అనుకున్నారు. అందులో నాగార్జున ఒకరు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా కృష్ణవంశీని కలిసిన నాగార్జున తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. మొదట్లో కృష్ణవంశీ నాగార్జునతో ఒక యాక్షన్ చిత్రాన్ని తీయాలనుకుని కథ ఒకటి వినిపించాడు. నాగార్జునకు ఆ కథ నచ్చి సినిమాకు ఓకే చెప్పాడు.
కానీ గులాబీ సినిమా విడుదలైన తర్వాత అది తన గురువు రాం గోపాల్ వర్మ స్టైల్లో ఉందనే కామెంట్స్ ఆయన్ను ఆలోచింపజేశాయి. దీంతో ఆ కథను క్యాన్సిల్ చేసి నిన్నే పెళ్ళాడతా లాంటి కుటుంబ కథను ఎంచుకుని మళ్ళీ నాగార్జునకు ఆకథను వినిపించారు . నాగార్జున మొదట్లో ఈ సినిమాను చేయడానికి సందేహించినా కృష్ణవంశీపై ఉన్న నమ్మకంతో అంగీకరించారు. పది రోజుల్లో స్క్రిప్టు పని పూర్తి చేశాడు కృష్ణవంశీ . నాగార్జున ఈ చిత్రంగా అన్నపూర్ణ పతాకంపై స్వయంగా నిర్మించాడనికి ముందుకు వచ్చారు.
ఇక హీరోయిన్ కోసం ముంబయి, చెన్నైలో ఆడిషన్ నిర్వహించారు కృష్ణవంశీ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 65మందిని ఆ పాత్ర కోసం పరిశీలించారు. అలా ఒకరోజు హీరోయిన్ కోసం వెతుకుతుండగా, టబు కృష్ణవంశీకి గుర్తొచ్చారు. ఎలాగో ఆమె అడ్రస్ కనుక్కొని ముంబయి వెళ్లారు.
అయితే ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా రోడ్డుపైనే టబుకు కథ చెప్పాల్సి వచ్చింది. సినిమా కథ, అందులో ఆమె పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పింది. అలా ‘నిన్నే పెళ్లాడతా’ పట్టాలెక్కింది. సంగీత దర్శకుడిగా సందీప్ చౌతాను ఎంచుకున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.