చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. జులై 24, 2002న విడుదలైన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా అశ్వనీదత్ ఎక్కడా రాజీపడకుండా సినిమాను భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చిన్నికృష్ణ పవర్ ఫుల్ కథను అందించగా, పరుచూరి బ్రదర్స్ అంతే పవర్ ఫుల్ గా డైలాగ్స్ రాశారు.
అయితే ఈ సినిమాకు డైలాగ్స్ రాసేముందు చిరంజీవి.. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడని భారీ డైలాగ్‌లు రాయొద్దని పరుచూరి బ్రదర్స్‌కు సూచించారట. ఆ తరువాత అభిమానుల కోసం మనసు మార్చుకుని పవర్‌ఫుల్ డైలాగ్స్ రాయాల్సిందిగా వారిని కోరారట. షూటింగ్ 80 శాతం అయిపోయాక ‘మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా’ వంటి డైలాగ్‌లను పరిచూరి బ్రదర్స్ రాశారట. చిరంజీవి రాయలసీమకు తిరిగి వచ్చిన తర్వాత కూడా పవర్‌ఫుల్ డైలాగ్స్ కావాలని అడిగారట. దీంతో అప్పటికప్పుడే సెట్స్‌లో ‘రాననుకున్నారా రాలేననుకున్నారా’ డైలాగ్ రాస్తే, చిరు ముచ్చటపడిపోయారట.
ఇక పతాక సన్నివేశాల్లో విలన్ ముఖేష్ రుషిని కొట్టిన తర్వాత చిరంజీవి మూడు పేజీల డైలాగ్‌లు చెప్పాల్సి ఉందట. విలన్ ను కొట్టిన తరువాత డైలాగ్స్ చెబితే బాగుండదని చిరు అనుమానం వ్యక్తం చేశారట. దీంతో ‘నరుక్కుంటూ వెళ్తే, అడవి అన్నది మిగలదు. చంపుకొంటూ వెళ్తే మనిషి అన్నవాడు మిగలడు’ అన్న ఒక్కడైలాగ్‌తో మూడు పేజీల డైలాగ్‌ను పరుచూరి బ్రదర్స్ ముగించారట. ఈ సినిమాలో డైలాగ్స్ రాసినందుకు గానూ పరుచూరి బ్రదర్స్ కు చిరంజీవి సోనీ ఎరికసన్ ఫోన్ కానుకగా ఇచ్చారట.