తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ మదిలో నిలిచే సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అందులో ఒకటి సీతారామయ్యగారి మనవరాలు. అక్కినేని నాగేశ్వరరావు, మీనా ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం 1991లో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది.
వి. ఎం. సి. పిక్చర్స్ పతాకంపై దొరస్వామి ఈ చిత్రాన్ని నిర్మించగా, క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి గానూ 3 ఫిలింఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు లభించాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే సినిమాగా నిలిచిపోయింది. . మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రచయిత గణేష్ పాత్రో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు.
ఈ సినిమా కథ వినగానే సీతారామయ్య పాత్ర పోషించడానికి అక్కినేని వెంటనే ఓకే చేయలేదు. దీంతో వేటూరితో చేద్దామనుకున్నారు. కానీ విగ్గు దగ్గరే గొడవ.. ఈ పాత్రను పోషించేప్పుడు మొదట విగ్గు పెట్టుకుంటానని నాగేశ్వరరావు, లేదు విగ్ లేకుండానే పాత్రవేయాలని దర్శకుడు క్రాంతికుమార్ అనుకునేవారు. విగ్గుతో షూటింగుకు వస్తే నాకు నా సీతారామయ్య కనిపించడంలేదండీ అంటూ క్రాంతికుమార్ అనేవారు.
చివరకు ఈ సినిమా కోసం మళ్ళీ కొత్తగా మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నానని నాగేశ్వరరావు వెల్లడించారు. ఆయన భార్య అన్నపూర్ణ కూడా విగ్గులేకుండానే నటించమని సూచించడం, దర్శకుడి వాదన కూడా సరిగ్గా కనిపించడంతో విగ్ లేకుండానే నటించారు అక్కినేని. అలా తొలిసారి విగ్గులేకుండా సినిమాలో నటించారాయన.
ఇక మనవరాలి పాత్ర కోసం మొదట గౌతమిని అనుకుని ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. తీరా షూటింగ్ మొదలు పెట్టే సమయానికి ఆమెకు తమిళ సినిమాలో ఓ పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఈ సినిమా వదులుకున్నారు. అప్పుడు ఆ పాత్ర మీనాను వరించింది. అక్కినేని మనవరాలిగా మీనా ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించింది.