పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి విడగొట్టి, కొత్తగా జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేశారు. జగదేవుడి పేరిట జగిత్యాల అనే పేరు రావడం జరిగింది. దీని చుట్టూ నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ మరియు సిరిసిల్లా జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి జగిత్యాల కాగా రెండవది మెట్ పల్లి. ఈ మూడు రెవెన్యూ డివిజన్లలో కలిపి 18 మండలాలున్నాయి. జగిత్యాల పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. జగిత్యాల- పెద్దపల్లి వయా కరీంనగర్ రైలుమార్గం ఉన్నది. జగిత్యాల- నిజామాబాద్ రైల్వేలైను నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. జిల్లాగుండా 63వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది. జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురిల్లో ఆర్టీసీ డిపోలున్నాయి.
జిల్లా గుండా గోదావరి నది ప్రవహిస్తున్నది. ఎస్ఆర్ఎస్ పీ ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్ పీ వరదకాల్వ, జిల్లాలో పెద్దమొత్తంలో నెలకొన్న చెరువులు వ్యవసాయానికి ఆధారం. జిల్లాల్లో అత్యధికంగా వరి పండుతుంది. పసుపు, మొక్కజొన్న, చెరకు పంటలు వరుసగా తర్వాతి స్థానాలను ఆక్రమిస్తాయి.
చారిత్రక ప్రదేశాలు:
జగిత్యాలలోని చారిత్రక ఖిల్లా దేవాలయాలు: పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి. మండల కేంద్రం కూడా అయిన ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నది. వెల్గటూరు మండలంలోని
కోటిలింగాల గ్రామంలో శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. మాల్యాల మండలం ముత్యం పేట గ్రామంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి పొందినది.
కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల. వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఏరియా ఆసుపత్రి. జగిత్యాల మండలంలోని పోసాల గ్రామంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం. కోరుట్ల మండలంలో వెటర్నరీ కళాశాల. జగిత్యాలలో ఎస్ కేఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. జగిత్యాల మండలంలోని చెల్ గల్ గ్రామంలో విత్తన క్షేత్రం కలదు. పైడిమడుగులో పురాతన ఊడలమర్రి కలదు.
నీటిపారుదల: జిల్లాలోని అన్ని మండలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సాగునీటి పారుదల ప్రాంతం కిందికి వస్తాయి. ఫలితంగా జిల్లాలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి.
పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తుల కోసం కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు జగిత్యాల మరియు కోరుట్ల మండలాల్లో ఉన్నాయి. కోరుట్ల మండలంలో బీడీ ఆకు పరిశ్రమలున్నాయి. జగిత్యాల మండలంలో పెద్ద మొత్తంలో రైస్ మిల్లులున్నాయి.
కరీంనగర్ మీదుగా పెద్దపల్లికి జగిత్యాల నుంచి రైలు మార్గం ఉన్నది. జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి
అను సంధానించే రైలు మార్గం పనులు పురోగతిలో ఉన్నాయి.