వెంకటేష్ హీరోగా అంజల ఝువేరి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ప్రేమించుకుందాం రా. జయంతి సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1997 మే 09న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయన్ని అందుకుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, జయప్రకాష్ విలనిజం, మణిశర్మ అందించిన సంగీతం సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళాయి.
ఇందులో వీరభద్రయ్య గా జయప్రకాశ్ రెడ్డి నటన సినిమాకే బిగ్గెస్ట్ హైలెట్ అని చెప్పాలి. ఆసాంతం గంభీరంగా ఉంటూ బయపెట్టేశారు జయప్రకాశ్ రెడ్డి. ఈ సినిమాలో సీమ భాషకోసం జయప్రకాష్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. పాత్రకు తగ్గట్టు రాయలసీమ యాస మాట్లాడిస్తే బాగుంటుందని, పరుచూరి సోదరులతో ఒప్పించి కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు వెళ్ళారట.
ఓ టేపురికార్డరు జేబులో పెట్టుకుని టీకొట్టు, ఎరువుల దుకాణం, బస్టాండ్ వంటి ఇలా వివిధ ప్రాంతాల్లో, సందర్భాల్లో వాళ్లంతా ఎలా మాట్లాడుతున్నారో రికార్డు చేసుకొని, నోట్స్ రాసుకునేవాడట. అలా రాసుకున్నదంతా పరుచూరి సోదరులకు చూపించి, ముందురోజు సాయంత్రం వాళ్ళు సంభాషణలు రాసివ్వగా రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి మార్చుకుని ప్రాక్టిస్ చేసేవారట.అందుకే ఆ పాత్రకు అంత పేరు వచ్చిందన్నారు.
ఓ రకంగా వెండితెరకు సీమ యాసను పరిచయం చేసింది జయప్రకాష్ రెడ్డినే అని చెప్పాలి.