తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కాశీనాథుని విశ్వనాథ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి ఎన్నో ఆణిముత్యాలను ఆయన తెరకెక్కించారు. విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు. ఇక ఎక్కువగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి వంటి రచయిలతో పాటలు రాయించుకునేవారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఏర్పడిన పరిచయం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు విశ్వనాథ్. రాజమండ్రికి దగ్గర్లో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ మహిళ తన కొడుకులిద్దర్నీ వెంటబెట్టుకుని తన దగ్గరకొచ్చిందని చెప్పారు.. మాకు ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఏదైనా మార్గం చూపండని తన బతిమాలిందని అన్నారు. అప్పుడు మీ పిల్లలు ఏం చెస్తారని తాను అనడిగితే స్కూల్లో గంగావతరణం అనే రూపకం ప్రదర్శించారు. చక్కగా పాడతారఅని చెప్పిందట.
వాళ్ల గానం అలా ఉంచితే ఆ రూపకం రాసిన తీరు ఇంకా బాగుంది. ఇది ఎవరు రాశారని అడిగితే అనకాపల్లిలో టెలీఫోన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఆయన అని చెప్పారట. ఆ పిల్లలకు తనకు తోచిన సాయం చేసి పంపానని కానీ. ఆ తర్వాత కొన్ని నెలలకు ‘సిరివెన్నెల’ సినిమా తీద్దామనుకున్నప్పుడు గంగావతరణం రచయిత గురించి ఆరా తీశానన్నారు. అతడే సీతారామశాస్త్రి అని తెలిసిందని, ఆయనకు కబురుపెడితే తన పాటల క్యాసెట్లనూ పంపాడని అవి కూడా చాలా బాగుండటంతో వెంటనే పిలిపించి సినిమాకు పాటలు రాయమని అడిగానన్నారు. అలా ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయిందని విశ్వనాథ్ తెలిపారు.