లిక్కర్​ స్కామ్​ ఛార్జీషీట్​​లో కవిత.. సంజయ్​పై మండిపడ్డ కేటీఆర్​.. కాంగ్రెస్​ లొల్లిపై దిగ్విజయ్​.. మళ్లీ కరోనా భయం.. ఆన్​లైన్​ గేమ్​తో రూ.95 లక్షలు మాయం.. ఈరోజు టాప్​ వార్తలు

నా కిడ్నీ కూడా ఇస్తా: సంజయ్​పై మండిపడ్డ కేటీఆర్

బీజేపీ నేత బండి సంజయ్‌‌కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీగా ఉన్నాను. డ్రగ్స్‌ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా. నా రక్తమే కాదు.. కావాలంటే బొచ్చు కూడా పీకిస్తా. క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తా. నేను క్లీన్‌ చిట్‌తో బయటకు వచ్చాక కరీంనగర్‌ చౌరస్తాలో.. బండి సంజయ్‌ తన చెప్పుతో తాను కొట్టుకోవడానికి సిద్ధమా?” అని కేటీఆర్ చాలెంజ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు కేటీఆర్ సవాల్ ఉందని, రెండేళ్ల క్రితం సంజయ్ సవాల్ చేసినప్పుడుల్… గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదని డీకే అరుణ ప్రశ్నించారు. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే ఇవ్వలేదా అని అనుమానం వ్యక్తం చేశారు.

కవితకు బిగుస్తున్న ఉచ్చు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగం నమోదు చేసింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటుచేసిన మీటింగ్ లో కవిత పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్ లో ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, ఎం.గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు పేర్లను ఈడీ ఇందులో ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ పేరిట 192 కోట్ల లిక్కర్ దందా జరిగినట్లు పేర్కొంది. 2022 జనవరి నెలలో హైదరాబాద్ లోని కవితను తన నివాసంలో సమీర్ మహేంద్రు కలిసినట్లు ప్రస్తావించింది. అరుణ్ పిళ్ళై నా ప్రతినిధి అని కవిత సమీర్​కు చెప్పినట్టు పేర్కొన్నారు. కవిత, ఆప్ నేతల మధ్య రూ. 100 కోట్ల కిక్ బ్యాక్ లకు బదులు ఇండో స్పిరిట్ లోని ఎల్ ‌‌1 లో భాగస్వామ్యం కుదిరినట్లు పేర్కొంది. కవిత, సమీర్ మహేంద్రు మధ్య కాల్ వివరాలు వాటిని ధృవీకరించినట్లు తెలిపారు. తన వెనక ఉన్న అసలు ఇన్వెస్టర్ కవిత అని పిళ్లై సమీర్ వెల్లడించినట్లు పేర్కొంది.

కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ

పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్‌, ఆప్ పొత్తులపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

మోదీతో అర్వింద్ భేటీ

తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ప్రధానితో చర్చించామని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారని అర్వింద్ వెల్లడించారు. ప్రధాని మోడీతో 12 నిమిషాలు భేటీ అయ్యానని..రాష్ట్రంలోని పాలన గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం సిద్ధంగా ఉందని..వ్యూహాలకు తగ్గట్టుగా ముందుకు వెళ్తోందన్నారు.

రంగంలోకి దిగ్విజయ్ సింగ్

రాష్ట్రంలో కాంగ్రే సీనియర్ల అసమ్మతిపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ అడ్వైజర్ బాధ్యతలు ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఈయన గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులందరితోనూ దిగ్విజయ్ కు పరిచయాలు, మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరదించే బాధ్యతలను కూడా హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కే అప్పగించినట్లు తెలుస్తోంది.

నేడు టీటీడీపీ సభ

బుధవారం ఖమ్మంలో భారీ బహిరంగసభకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది . సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఖమ్మంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ టీడీపీ నేతలు ఖమ్మం నగరంలో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనాన్ని సమీకరించేందుకు ప్లాన్ చేస్తున్నరు.

మళ్లీ కరోనా అలజడి

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. జీనోమిక్ కన్సార్టియం ద్వారా వేరియంట్లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాలను మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‭ను పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. చైనా, జపాన్, యూఎస్, బ్రెజిల్ లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని కేంద్రం గుర్తు చేసింది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కర్ని పరీక్షించి..జీనోమ్ సీక్వెన్స్ ను అందించాలని ఆదేశించింది. గురువారం అన్ని రాష్ట్రాల హెల్త్ ఆఫీసర్స్‭తో మన్సుఖ్ మాండవీయ సమావేశం కానున్నారు.

సగం మంది లంచగొండులే

ప్రభుత్వ కార్యాలయాలలో 50% అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని, ప్రజా సమస్యలను తెలిపేందుకు ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో అధికారుల అవినీతి, నాయకుల పని తీరుపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ చేసిన సర్వే రిపోర్టును ఆయన విడుదల చేశారు. గవర్నమెంట్ అధికారులకు లంచం ఇవ్వకపోతే ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని సర్వేలో తేలిందన్నారు. 26 వేల 211 మంది సర్వేలో పాల్గొన్నారని చెప్పారు. అవినీతి, అలసత్వంపై ఫిర్యాదు చేయడానికి ఒక నెంబర్ కేటాయించడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందన్నారు.

93 లక్షలు కల్లాస్

‘కింగ్​ 527’ అనే ఆన్లైన్ గేమ్ ను తన ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని సరదాగా ఆడితే.. తన ఖాతాలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయ్యాయి. చూస్తుండగానే బ్యాంక్ అకౌంట్ లోని దాదాపు రూ.95 లక్షలన్నీ అయిపోయాయి. విస్తుపోయే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అయిన విషయాన్ని యువకుడు వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేమ్ లో పోగొట్టిన ఆ డబ్బులన్నీ సీతారాంపూర్ గ్రామంలో భూనిర్వాసితుల పరిహారం కింద తమకు ప్రభుత్వం నుంచి వచ్చినవేనని యువకుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

ఒడిశా నుంచి కల్తీ లిక్కర్

తెలంగాణ బ్రాండ్ పేరుతో ఒడిశాలో కల్తీ మద్యం తయారీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఇక్కడ తీగ లాగితే.. ఒడిశాలో డొంక కదిలిందని అన్నారు. ఒడిశాలోని అభయ్ పూర్ అటవీ ప్రాంతంలో మద్యం తయారీ జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10మంది నిందితులను అరెస్టు చేశారని, మరికొంతమందిని త్వరలోనే పట్టుకుంటారని తెలిపారు. ఇప్పటికే అనుమానం వచ్చిన నారాయణగూడలోని ఓ మద్యం దుకాణం లైసెన్స్ కూడా రద్దు చేయించామని వివరించారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. ఎక్కడా అనుమానం రాకుండా, ఎంతో తెలివితో బార్ కోడ్ లోనూ ఎలాంటి డౌట్ రాకుండా ఈ పన్నాగం పన్నారని చెప్పారు. దాదాపు 2.5 కోట్ల మద్యాన్ని అధికారులు సీజ్ చేశారన్నారు.

చైనా సన్యాసుల వార్నింగ్

చైనాకు అరుణాల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఉన్న మఠ సన్యాసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇది 1962 కాదని, 2022 అని, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ జమనా అని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోడీ ఎవ్వరినీ విడిచిపెట్టరు. మేము మోడీ ప్రభుత్వానికి, ఇండియన్‌ ఆర్మీకి మద్దతు ఇస్తున్నాం. చైనా ప్రభుత్వం ఎప్పుడూ ఇతర దేశాల భూ భాగాలను ఆక్రమించుకోవాలని చూస్తుంటుంది. అందులో భాగంగానే ఇండియా భూ భాగంపై కన్నేసింది. ఇది తప్పు. ప్రపంచంలో శాంతి కావాలంటే ఇలాంటి పనులను చైనా మానుకోవాలి”అని తవాంగ్‌లో ఉన్న మఠం సన్యాసి లామా యేషి ఖావో హితవు పలికారు.

ప్రాణాలు తీసిన‌ పరుగు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరుగుతున్న కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల్లో పాల్గొని, గుండెపోటుకు గురైన రాజేందర్ మంగళవారం ప్రాణాలొదిలాడు. ఈ నెల 17వ తేదీన 1600 మీటర్ల పరుగు విభాగంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం రాజేందర్​ మృతి చెందాడు. రాజేందర్ స్వస్థలం ములుగు జిల్లా శివా తండా. ఈ ఘటనతో పోలీసు రిక్రూట్ మెంట్ విధానాన్ని మార్పు చేయాలనే డిమాండ్లు పెరిగాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here