1. తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్
మాండూస్ తుఫాను ఎఫెక్ట్ తో హైదరాబాదు సహా రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వరుసగా మూడు రోజుల పాటు ఈ నెల 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
2. కవితకు మళ్లీ సీబీఐ నోటీసులు
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులుఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆదివారం కవితను, ఆమె ఇంట్లోనే సీబీఐ ఆఫీసర్లు ప్రశ్నించారు. దాదాపు ఏడు గంటలపాటు జరిగిన విచారణ అనంతరం, 91సీఆర్‌పీసీ కింద కవితకు మరో నోటీస్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం తాము చెప్పిన చోట విచారణకు రావాలని కవితకు సూచించారు. త్వరలోనే విచారణకు సంబంధించిన తేదీలను తెలియజేస్తామని నోటీసులో పేర్కొన్నారు. విచారణ అనంతరం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు.
3. ఎల్లుండి ఢిల్లీలో కేసీఆర్ యాగం
ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్ లో ఈనెల 14న భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనం లో చేపట్టవలసిన రిపేర్లు, ఆఫీస్ ఫర్నీచర్ పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ తో కలిసి పరిశీలించారు. మరోవైపు దేశం కోసం కేసీఆర్ అనే నినాదంతో ఢిల్లీలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఫ్లెక్సీలను ఆ పార్టీ లీడర్లు ఏర్పాటు చేశారు.
4. కొండా సురేఖ రాజీనామా
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొండా సురేఖ భేటీ అయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేసేందుకు ఉద్దేశించిన లేఖను రేవంత్ కు అందజేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ కు సురేఖ వివరించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నుంచి ఒక్క లీడర్ పేరు కూడా కమిటీలో లేదన్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లి పార్టీలో మంచి గుర్తింపు వచ్చేలా చేస్తానని..తొందరపడొద్దు అంటూ సురేఖకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
5. ఆయుర్వేదానికి పెరుగుతున్న ఇంపార్టన్స్
ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా ఇప్పటికే 30 దేశాలకుపైగా ఆమోదించాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుర్వేద వైద్య విధానాన్ని మొత్తం ప్రపంచమే గుర్తిస్తోందని ఆయన చెప్పారు. గోవాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ మూడు జాతీయ ఆయుష్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించారు. రూ.970 కోట్లతో ఆయుష్ ఇన్ స్టిట్యూట్ లను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్, హెల్త్ ఎక్స్ పోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 50కి పైగా దేశాలు ఈ ఆయుర్వేద ఎక్స్ పోలో పాల్గొన్నాయి.
6. పెద్దపులి కలకలం
కొమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ సమీపంలో ఇవాళ రోడ్డుపై వెళ్తున్న వాహనాదారునికి పెద్దపులి కనిపించింది. పులిని చూసిన వాహనదారుడు భయపడి బైక్ పై నుంచి కింద పడ్డాడు. దీంతో సల్ప గాయాలయ్యాయి. పులిని చూసి భయపడి బైకు పై నుంచి కింద పడ్డ వ్యక్తిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. పెద్దపులి సంచారం గురించిన వార్త సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు క్షణాల్లో తెలిసిపోయింది. దీంతో పొలం పనులకు, అడవిలో పశువులను మేపుకునేందుకు వెళ్లే వారు భయాందోళనకు గురవుతున్నారు.
7. సెకండ్ ప్లేస్‌లో హైదరాబాద్
ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. ఉర్రూతలూగించిన ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 385 పాయింట్లతో బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గోవా (282 పాయింట్లు), నాలుగో స్థానంలో చెన్నై (279 పాయింట్లు), ఐదో స్థానంలో బెంగళూరు (147.5 పాయింట్లు), ఆరో స్థానంలో ఢిల్లీ (141 పాయింట్లు) జట్లు నిలిచాయి. ఈసారి రేసింగ్ లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలో 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోయాయి.
8. వెక్కి వెక్కి ఏడ్చిన రొనాల్డో
ఫిఫా వరల్డ్కప్లో మొరాకో కొత్త చరిత్ర సృష్టించింది. పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హార్ట్ బ్రేక్ చేసింది. శనివారం జరిగిన క్వార్టర్ల్ ఫైనల్లో 1–0తో బలమైన పోర్చుగల్ కు చెక్ పెట్టి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నీలో సెమీస్లో అడుగు పెట్టిన తొలి ఆఫ్రికన్ టీమ్గా రికార్డులకెక్కింది. స్టార్ ప్లేయర్ యూసెఫ్ ఎన్ నెస్రీ 42వ నిమిషంలో హెడ్డర్‌తో అద్భుత గోల్ చేసి మొరాకోకు హిస్టారిక్ విక్టరీ అందించాడు. దీంతో1966, 2006లో తర్వాత సెమీస్ చేరాలని ఆశించిన పోర్చుగల్‌కు, కెరీర్‌లో వెలితిగా ఉన్న కప్పు అందుకోవాలని ఆశించిన రొనాల్డోకు నిరాశ తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించాడు.
9. 500 విమానాలు కొంటున్న ఎయిర్ ఇండియా
టాటా గ్రూపు సారధ్యంలోని దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా చరిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమైంది. పునరుద్ధరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కంపెనీ ఏకంగా 500 విమానాల కొనుగోలు డీల్‌కు చేరువైంది. విమానతయారీ దిగ్గజాలైన ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీల నుంచి ఈ విమానాలను కొనుగోలు చేయబోతున్నట్టు రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఆర్డర్‌లో 400 చిన్న విమానాలు, 100 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పెద్ద విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేయనుంది. పెద్ద విమానాల్లో ఎయిర్‌బస్ ఏ350ఎస్, బోయింగ్ 787ఎస్, 777ఎస్ విమానాలు ఉండనున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఒప్పందం విలువ పదుల బిలియన్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా వేసింది.
10. టీమిండియా విమెన్ సూపర్ విక్టరీ:
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ-20లో ఇండియన్ వుమెన్స్ టీమ్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 187 పరుగుల భారీ స్కోర్ చేయగా, టీమిండియా ధీటుగా జవాబు ఇచ్చింది. 79 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించిన స్మృతి మంధాన చివర్లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లో 20 పరుగులు చేసిన టీమిండియా, ఆస్ట్రేలియాను16 పరుగులకే కట్టడి చేసి విక్టరీ కొట్టింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది.