సీఎం కేసీఆర్ సమీక్ష
అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు తమ జిల్లాల్లో క్లస్టర్ల వారీగా స్థానిక ఏఈవోలతో సర్వే చేయించి, పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్లకు సూచించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం పథకం విధి విధానాలను రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల పంపిణీని ప్రారంభించే తేదీని త్వరలో ప్రకటిస్తామని సీఎం ప్రకటించారు. ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకు సీఎం ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు.
ఒకటో తేదీన జీతాలివ్వాలని ఉపాధ్యాయ సంఘాల ధర్నా
టీచర్లు, ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలివ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఈనెల 31లోపు పెండింగ్ బిల్లులన్నీ రిలీజ్ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద యూఎస్పీసీ ఆధ్వర్యంలో టీచర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో ఇస్తామన్న ప్రభుత్వం .. 11 నెలలు గడిచినా మూడు, నాలుగు వాయిదాలకు మించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టెన్త్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
ఈ ఏడాది టెన్ట్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పార్ట్–బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నపత్రం ఇచ్చే టైమ్ మార్చారు. ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీ (హిందీ), మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టులకు చివరి అర గంటకు ముందు.. అంటే మధ్యాహ్నం12 గంటలకు క్వశ్చన్ పేపర్ ఇవ్వనున్నారు. థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్) పేపర్లు మాత్రం పార్ట్-ఏ తో పాటే, పార్ట్-బీ పేపర్ కలిపి ఇస్తారు. సైన్స్‌లో మాత్రం ఫిజిక్స్, బయోలజీ సబ్జెక్టులకు వేర్వేరు క్వశ్చన్ పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు గంటన్నర టైమ్ ఇచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిజిక్స్ ఎగ్జామ్ జరుగుతుంది. చివరి 15 నిమిషాల ముందు అంటే 10.45 గంటలకు పార్ట్-బీ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 11 గంటలకు ఫిజిక్స్ ఆన్సర్ షీట్లు తీసుకున్నాక.. బయోలజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేందుకు 20 నిమిషాలు అడిషనల్‌గా కేటాయించారు. నిర్ణీత టైమ్ మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉండగా, చివరి 15 నిమిషాల ముందు 12.35 నిమిషాలకు పార్ట్-బీ అందిస్తారు.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
ఒక్క కాన్పులో ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టడం సాధారణమైన విషయమే. కొన్నిసార్లు ముగ్గురు, నలుగురు కూడా పుట్టడం అరుదు. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటన విడుదల చేశారు.
రేవంత్, సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ ఇచ్చారు. వారు చేసిన ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిందని దావా వేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంలో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వంద కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కొనాలని నోటీసులో పేర్కొన్నారు.
కవిత ఫోన్లు ఓపెన్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఫోన్ల నుంచి ఈడీ అధికారులు డేటా రికవరీ చేస్తున్నారు. ఫోన్లను ఓపెన్ చేసేందుకు ఈడీ ఆఫీసుకు రావాలని ఈడీ అధికారులు కవితకు ముందస్తు సమాచారం అందించారు. అందులో భాగంగా మంగళవారం ఎమ్మెల్సీ కవిత తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ ను ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు పంపించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆయన ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఆయన సమక్షంలోనే ఈడీ అధికారులు మొబైల్ ఫోన్లను టెక్నికల్ టీమ్ తో ఓపెన్ చేసి డేటా రికవరీ ప్రారంభించినట్లు తెలిసింది.
షర్మిలను అడ్డుకున్న పోలీసులు
ఉస్మానియా ఆసుపత్రి విజిట్‌కు బయలుదేరిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ గేటు దగ్గరే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. ఉస్మానియాలో రోగులను పట్టించుకోవటం లేదని, కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించటం లేదని షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు.
కేటీఆర్‌ను, ఆయన పీఏను విచారించాలి
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ప్రశ్నలు సంధించారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి పేపర్ లీకేజీకి సంబంధం ఉందన్న విషయం రోజురోజుకు బలపడుతోందని ఆరోపించారు. ఐటీశాఖకు పేపర్ లీకేజీ కుంభకోణానికి ప్రత్యక్ష సంబంధం ఉందన్న విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేదంటూనే కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ తరఫున వాకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ను, ఆయన పీఏ తిరుపతికి నోటిసులు ఇచ్చి విచారించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు డేటా ఎవరు ఇచ్చారని.. అదే డేటాను ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.