ఈ సారి బీఆర్ఎస్ కు 100 సీట్లు: కేటీఆర్.. ఆ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా?.. ప్రవీణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం.. కాంగ్రెస్ కు షాకిచ్చిన డీ.శ్రీనివాస్.. గ్రామ పంచాయతీలకు మంత్రి హరీశ్ గుడ్ న్యూస్.. నేటి టాప్ న్యూస్ ఇవే..

ఈ సారి 100 సీట్లు ఖాయం

ఏప్రిల్ 27న జగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. దీని ప్రకారం ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఎలా రావో చూద్దాం అన్నారు. సిరిసిల్లలో నిన్న పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉత్తమ గ్రామపంచయతీలకు అవార్డులు అందించే కార్యక్రమంలోనూ మంత్రి పాల్గొన్నారు.

ఆ పరీక్ష వాయిదా?

వచ్చే వారంలో జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్​ (HORTICUTURE OFFICER) పోస్టుల పరీక్షను వాయిదా వేయాలని టీఎస్​పీఎస్​సీ భావిస్తోంది. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 4న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలకు సంబంధించిన రెండు పేపర్లను నిర్వహించాల్సి ఉంది. వారం రోజుల ముందే అంటే ఈ రోజు నుంచి (మార్చి 28వ తేదీన) ఆన్​లైన్​లో హాల్​ టికెట్లను అందుబాటులో ఉంచాలి. కానీ టీఎస్​పీఎస్​సీ అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆన్​లైన్లో నిర్వహించే ఈ పరీక్షలను కూడా కొద్ది రోజులు వాయిదా వేయాలని టీఎస్​పీఎస్​సీ భావిస్తోంది. ఈరోజు సాయంత్రానికి పరీక్షల తేదీలపై టీఎస్​పీఎస్​సీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి.

ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్​ ఇంట్లో సిట్ అధికారులు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా..శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్‌వర్డ్ చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీంతో కంప్యూటర్​లో ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు తేల్చారు. రాజశేఖర్‌ ద్వారా గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్‌ పొందారు. దాంతో గ్రూప్‌-1 పరీక్ష రాయడానికి గతేడాది న్యూజిలాండ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. దాంతో రాజశేఖర్‌ బావ ప్రశాంత్‌కు LOC నోటీసులు జారీ చేశారు సిట్‌ అధికారులు.

కాంగ్రెస్ కు డీ శ్రీనివాస్ రాజీనామా

మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్ నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపారు. ఆయన భార్య విజయలక్ష్మి కూడా ఇందుకు సంబంధించి మరో లేఖను విడుదల చేశారు. తన కుమారుడు సంజయ్‌కు ఆశీస్సులు అందించేందుకే తాను గాంధీభవన్‌కు వచ్చానని అన్నారు. తాను కాంగ్రెస్ వాదినని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు భావిస్తే.. ఇది తన రాజీనామా లేఖగా భావించాలని కోరారు. వయస్సు, ఆరోగ్యం కారణంగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని డీఎస్ అన్నారు .తనను అనవసరంగా వివాదాల్లోకి లేఖలో లాగొద్దని పేర్కొన్నారు.

నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు

గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే నెల 1 నుంచి ఎలాంటి నిధులనైనా నేరుగా పంచాయితీ అకౌంట్లలో జమ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక నుంచి గ్రామ పంచాయితీల్లో నిధులు, బిల్లుల చెల్లింపుల సమస్య ఉండదన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని కులబ్ గుర్, కంగ్టీ, నారాయణఖేడ్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. దీన్ దయాళ్ జాతీయ పంచాయితీ 2021––22 అవార్డుల ప్రదానోత్సవం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్రామాలను చూసి దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు.

లహరీ ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం


ప్ర‌యాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో కొత్త‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్‌ కుమార్‌ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, ఎండీ అండ్‌ వీసీ శ్రీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారితో కలిసి ఆయన ల‌హ‌రి బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

పొంగులేటి ఆ పార్టీలోకేనా?

చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చిందన్న వార్త ఖమ్మం జిల్లాలో గుప్పుమంటోంది. దీంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు జరుగుతున్నాయి. బీజేపీ కంటే కూడా జిల్లాలో బలంగా ఉన్న కంగ్రెస్ పార్టీలో చేరడమే బెటర్ అన్న నిర్ణయానికి పొంగులేటి వచ్చారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here