మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్.. సీఎం కేసీఆర్ ఏమని పిలుపిచ్చారంటే?.. నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ.. అన్ని జిల్లాలకు పేపర్ లీకేజీ లింకులు.. బాక్సింగ్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. కాంగ్రెస్ గూటికి కీలక నేత.. నేటి టాప్ న్యూస్ ఇవే

రైతు వాదాన్ని ఎత్తుకోండి: కేసీఆర్

జాతి మతవాదాలను పక్కకు పెట్టి రైతు వాదాన్ని ఎత్తుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంఛర్-లోహాలో నిన్న నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అన్నదాతలు ఏకమై పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. అలా పిలుపునిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. మహారాష్ట్రాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అన్ని జడ్పీలపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి అవకాశమిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలను కోరారు.

మీటింగ్ సక్సెస్.. బీఆర్ఎస్ నేతల ఖుషీ

భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహ లో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభా స్థలి జనసంద్రాన్ని తలపించింది. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. అక్కడి వారి మరాఠా భాషలో వీడియో డాక్యుమెంటరీల రూపంలో చూపించారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. సభా వేదికమీద ఏర్పాటు చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అన్నా బాహు సాతే, మహాత్మా ఫూలే, అహిల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు(సోమవారం) విచారించనుంది. ఈ కుంభకోణంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత ఈ నెల 23న దాఖలు చేసిన పిటిషన్‌లో సవాలు చేశారు. అంతేకాకుండా.. ఈడీ తనపై తదుపరి బలవంతపు చర్యలు తీసుకోకుండా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు.

అన్ని జిల్లాలకు లీకేజీ లింకులు

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఇవి చేరాయని తెలుస్తోంది. ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన అభ్యర్థులు.. అందుకు తామకు ఖర్చైన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలనే ఆలోచనతో ఆ పేపర్‌ను మరొకరికి విక్రయించారని తెలుస్తోంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఇంకొకరికి విక్రయిస్తూ వెళ్లడంతో ఇది మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌లా సాగిందని సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇలా చైన్‌ సిస్టమ్‌లో సాగిన ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. లీకేజీ గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌, ఢాక్యా నాయక్‌, రాజేశ్వర్‌లను సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు సిట్ అధికారులు.

సత్తా చాటిన తెలంగాణ బిడ్డ

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ సత్తా చాటింది. 50 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని సాధించి వరుసగా రెండో ఏడాది ప్రపంచ టైటిల్ దక్కించుకుంది. దీంతో జరీన్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. జరీన్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్.

నేటి నుంచి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు

తెలంగాణ ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొత్తం 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ఈ రోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది ఆర్టీసీ. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి; ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి; తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్‌ బస్సులను నడపున్నారు. ఈ ఏసీ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15తో మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉంది. మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద రీడింగ్‌ ల్యాంప్‌ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా సైతం అందుబాటులో ఉంచింది ఆర్టీసీ.

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ: రేవంత్

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని… బ్రిటీష్ జనతా పార్టీ అని టీసీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే డబుల్ ఇంజిన్ అంటే ఒకటి ప్రధాని మోదీ అని మరొక ఇంజిన్ అదానీ అని ఎద్దేవా చేశారు. అదానీ ఇంజిన్ కు రిపేర్ వచ్చిందని.. అందుకే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విభజించు-పాలించు అనే విధానాన్ని అవలంభిస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను వల్లభ భాయ్ పటేల్ నిషేధించారని గుర్తుచేశారు. దేశ సంపదను అదానీ సంస్థ కొల్లగొడుతోందని విమర్శించారు. అదానీ పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన సంకల్స సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీపై మండిపడ్డారు. అదానీపై మాట్లాడినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని అన్నారు.

విచరాణకు రాలేను: బండి సంజయ్

పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నందున సిట్ ముందు హాజరు కాలేకపోతున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని, దీనిపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ మేరకు సిట్‌కు సంజయ్ రాసిన లేఖను అధికారులకు బీజేపీ లీగల్ టీమ్ ఆదివారం అందజేసింది. సిట్ ఎదురుగా హాజరుకావడానికి తనకేం అభ్యంతరం లేదని, కానీ పార్లమెంట్ సెషన్ ఉన్నందున రాలేకపోతున్నానని లేఖలో సంజయ్ పేర్కొన్నారు. ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పేపర్ లీక్ లో ఇద్దరు మాత్రమే ఉన్నారని మంత్రి మీడియా సమావేశంలో చెప్పారు. పేపర్ లీక్ వ్యవహారాన్ని మొదటి రోజు నుంచీ చిన్న అంశంగా, కేవలం ఇద్దరు మాత్రమే చేసినట్లు బయటకు చూపించేందుకు కొంత మంది కలిసి ప్రయత్నిస్తున్నారు” అని ఆరోపించారు.

కాంగ్రెస్ లోకి డీ శ్రీనివాస్

సీనియర్ నాయకుడు డీ.శ్రీనివాస్ తిరిగి సొంతగూటికి చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో, పెద్ద కుమారుడు సంజయ్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ అన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ మనిషినేనన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here