ఉద్యోగాలపై యువతకు కేటీఆర్ భరోసా.. నేడు ఆ రాష్ట్రంలో కేసీఆర్ బహిరంగ సభ.. పేపర్ లీకేజీలో మరో కొత్త లింక్.. ఆ 71 వేల మందికి అందని రైతుబంధు.. అభ్యర్థులకు రూ.లక్ష పరిహారం: బండి సంజయ్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే

యువతకు కేటీఆర్ భరోసా

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ నుంచి ప్రశ్నాపత్రం లీకైందని గుర్తించిన వెంటనే ఆయా పరీక్షలను రద్దు చేశామన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పొరపాట్లను సవరించుకుని ముందుకు వెళ్తామన్నారు. జరిగిన నష్టానికి చింతిస్తున్నామన్నారు. గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణలో జరిగిన నియామకాలు మరే రాష్ట్రంలో జరగలేదన్నారు. పెద్ద అంబర్ పేటలో శనివారం జరిగిన ప్రగతినివేదన సభలో కేటీఆర్ ప్రసంగించారు.

నేడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్

మహారాష్ట్రపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ నేడు ఆ రాష్ట్రంలో రెండో బహిరంగ సభను నిర్వహించేందుక ఏర్పాట్లు చేసింది. సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. నాందేడ్ జిల్లాలో నిర్వహించనున్న ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు ఈ సభను నిర్వహించనున్నారు. సభలో సీఎం కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడుతారు? అన్న ఉత్కంఠ నేతల్లో వ్యక్తం అవుతోంది.

పేపర్ లీకేజీ కేసులో పెద్ద లింక్

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షల పేపర్‌ లీకేజీ వ్యవహారంలో చాలా పెద్ద చైన్‌ లింక్‌ ఉందని సిట్ గుర్తించింది. ఈ మేరకు నిందితులందరినీ మరోసారి విచారించాలని కోరుతూ సిట్‌ అధికారులు శనివారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితురాలు రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్‌ ఏఈ పేపర్‌ను ఆశావహులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి నవాబ్‌పేట్‌ మండలం ఉపాధి హామీ పథకంలో ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వికారాబాద్‌ జిల్లా డీఆర్డీఏలో పని చేస్తున్న ఢాక్యానాయక్‌ ప్రశాంత్‌రెడ్డికి పరిచయమయ్యాడు.

అభ్యర్థులకు రూ.లక్ష పరిహారం: బండి సంజయ్ డిమాండ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. శనివారం ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోమంలో పాల్గొన్న కళాకారులు, మేధావులు, విద్యావంతులందరూ నిరుద్యోగుల కోసం మరోసారి ముందుకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మరో మిలియన్ మార్చ్ నిర్వహించాలన్నారు.

71 వేల మందికి రైతు బంధు అందలే

తెలంగాణలో 71వేల మంది రైతులకు యాసంగి సీజన్ కు సంబంధించి రైతు బంధు సాయం అందలేదని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించింది. ఇందులో పది ఎకరాల కంటే మించిన రైతులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. కొత్తగా నమోదైన వారికి సైతం సాయం అందాల్సి ఉందని వెల్లడిచింది. వీరికి నిధుల మంజూరుకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ ఐటీశాఖకు అవార్డు

మర్జింగ్‌ టెక్నాలజీ వినియోగంలో వినూత్న ఆలోచనలు అమలుచేస్తున్నందుకు గానూ తెలంగాణ ఐటీ శాఖకు కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(సీఎస్ఐ) పురస్కారం దక్కింది. ఈ-గవర్నెన్స్‌ విభాగంలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో ఐటీ శాఖ రిజిస్ట్రేషన్‌ శాఖలో అమలుచేస్తున్న టీ-చిట్స్‌కు ఈ అవార్డు రాగా… ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ సేవలకు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌, ఉపాధి టెక్నో సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.కళ్యాణ్‌ చక్రవర్తిరెడ్డి ఈ పురస్కారాలను అందుకున్నారు. ఐటీ శాఖకు సీఎ్‌సఐ పురస్కారం రావడంపై ఆ శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ హర్షం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ కు సిట్ నోటీసులు

టీఎస్పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్‌ అధికారులు శనివారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వెనక ఎవరెవరు ఉన్నారనే ఆధారాలు తనవద్ద ఉన్నాయని గతంలో బండి సంజయ్‌ వాఖ్యానించారు. ఈ ఆధారాలను తమకు అందజేసేందుకు ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని సిట్‌ మొదట నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నందున రాలేనని సంజయ్‌ ఆ సమయంలో ప్రకటించారు. సిట్‌ అధికారులు సంజయ్‌ను తాజాగా మరోసారి కలిసి నోటీసులు అందించారు.

ప్రశ్నించినందుకే దాడులు: రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిని ఎవరు ప్రశ్నించినా వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసి లొంగదీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేసి కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం బీజేపీ నాయకులకు కంటగింపయిందన్నారు. కర్నాటక నుంచి ఢిల్లీ వెళుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శనివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పార్టీ ముఖ్యనాయకులు కలిశారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు నేపథ్యంలో బీజేపీ నియంత పాలన, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న తీరుపై క్షేత్రస్థాయి పోరాటాలు ఉధృతం చేయాలని నేతలకు ఖర్గే సూచించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here