సరస్సుపై సుందరలోకం.. ఈశాన్య భారత దేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు లోక్‌తక్.
లోక్ అంటే సరస్సు, తక్ అంటే వరకు అని అర్థం… అందుకేనేమో… ఆ సరస్సు ఉన్నంత వరకే తాము బాగుంటామని నమ్ముతారు అక్కడి ప్రజలు. ఆ సరస్సును దాటిపోమంటారు. అదే తమ ప్రపంచమంటారు.
వారి అందమైన ప్రపంచాన్ని మనమూ ఓసారి చూసొద్దామా!
హైదరాబాద్ నుంచి ఇంఫాల్‌కు డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌కి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్నాయి. బస్‌లో వెళ్లాలి అనుకుంటే గౌహతి కానీ, పుణె కానీ వెళ్లి అక్కడ్నుంచి ఇంఫాల్ వెళ్లాలి. ఇంఫాల్‌లో ట్యాక్సీ తీసుకుని లోక్‌తక్ వెళ్లిపోవచ్చు. ఖర్చు తగ్గాలి అనుకుంటే బస్సులో కూడా వెళ్లొచ్చు. అక్కడికి చేరుకున్నాక నదీతీరంలో ఉన్న టూరిస్టు బంగ్లాలో బస చేయవచ్చు. లేదంటే దగ్గర్లోనే ఉన్న ఫుబాలాలో ఫారెస్ట్ రెస్ట్ హౌస్‌లో కూడా ఉండొచ్చు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కి నలభై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది మైరాంగ్. అక్కడే ఉంది లోక్‌తక్ సరస్సు. మూడు వందలస్క్వేర్ కిలోమీటర్ల పైనే విస్తరించిన ఉన్న ఈ సరస్సులో అక్కడక్కడా గుండ్రని ఆకారంలో నేల కనిపిస్తూ ఉంటుంది. వాటిపైన కొందరు మత్య్సకారులు నివాసాలు ఏర్పరచుకున్నారు. వీటిని ఫుమ్డీలు అంటారు. ఒడ్డు నుంచి చూస్తుంటే ఈ ఫుమ్డీలు చిన్న చిన్న గుడిసెల మాదిరిగా కనిపిస్తాయి కానీ.. వాటి చుట్టూ ఓ పెద్ద ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది.
దీనిమీదే ఆధారపడి జీవించడం వల్ల అక్కడి నివాసితులంతా ఈ సరస్సును లోక్‌తక్ మా అంటారు. సరస్సు మధ్యలో చాలా దీవులు ఉన్నాయి. వాటికి ఒక్కోదానికీ ఒక్కో పేరుంది. ప్రతి దీవీ పెద్దగా ఏమీ ఉండదు. పెద్దగా ఉన్నవాటిలో రెండు మూడు ఇళ్లుంటాయి. చిన్నవాటిలో ఒక్క ఫుమ్డీయే ఉంటుంది.
ఫుమ్డీలు చూడటానికి చిన్నగా అనిపిస్తాయి కానీ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నలుగురైదుగురు సభ్యులు ఉన్న కుటుంబాలు కూడా జీవింతచేంత అనుకూలంగా ఉంటాయి. వీటిని ఆకులు, కర్రలు, చెక్కలతో నిర్మిస్తారు. నీటిలో పెరిగే కలుపుమొక్కల్ని పైన కప్పుతూ ఉంటారు.
మత్స్యకారులే ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు కాబట్టి దాదాపు అందరూ చేపలు పడతారు. వారి ఆహారానికి సరిపడా ఉంచుకుని మిగతావాటిని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మార్కెట్లలో అమ్మేస్తారు. కాస్త విశాలంగా ఉన్న దీవుల్లో వ్యవసాయం కూడా చేస్తారు. కూరగాయలు, ఆకుకూలరు పండిస్తారు. వీటిని కూడా అవసరమైనంత వరకూ ఉంచుకుని మిగతావి పక్క గ్రామాలకు తీసుకుపోయి అమ్ముతుంటారు.
లోక్‌తక్ మహిళలు చాలా చురుకుగా ఉంటారు. పడవలు నడుపుతారు. చేపలు పడతారు. వ్యవసాయం చేస్తారు. వాటిని అమ్మడంలో కూడా మగవారితో సమానంగా కష్టపడతారు. వీరి రవాణా సౌకర్యం పడవ ఒక్కటే. ఒక దీవి నుంచి మరో దీవికి పడవల మీదే ప్రయాణిస్తారు. ఎవరికి వారికి సొంత పడవలు ఉంటాయి. టూరిస్టులెవరైనా వెళ్లాలన్నా పడవ ఒక్కటే మార్గం. తీరం నుంచి ప్రైవేటు పడవలు ఉంటాయి. మనిషికి 150 రూపాయలు తీసుకుంటారు.
లోక్‌తక్‌లో అత్యంత పెద్ద విశేషం… కీబుల్ లామ్జో నేషనల్ పార్క్. ఒక పెద్ద దీవి మీద నలభై స్క్వేర్ కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది మొదట్టమొదటి తేలియాడే నేషనల్ పార్క్. మణిపూర్ రాష్ట్ర జంతువైన సంగై జింకలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం వీటి పేరుతో పది రోజుల పాటు సంగై ఫెస్టివల్ జరుగుతుంది. లోక్‌తక్‌కి అతి దగ్గర్లోనే బోలెడన్ని గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. కాబట్టి టూర్ ప్లాన్ చేసుకునేవాళ్లు ఒకే రోజులో చాలా ప్రదేశాలు చూసి రావొచ్చు.