ఆరుగురు విజేతలు.. అద్భుతమైన పుస్తకాలు

చేతిలో మొబైల్‌, ఇంట్లో టీవీ, ఆఫీసులో కంప్యూటర్.. ఎలక్ట్రానిక్‌ తెరలు మనకి నిత్యావసరాలుగా మారి ఉండోచ్చు.. కానీ కాగితంపై ఒదిగిపోయిన అక్షరాలను కళ్లతో ఏరుకోవడంలోని కమ్మదనమే వేరు! టెక్‌ యుగంలోనూ పుస్తకాలకు డిమాండ్ తగ్గకపోవడానికి ఇదే కారణమై ఉంటుందేమో. ‘ఫలానా పుస్తకం నా జీవితాన్ని మార్చేసింద’ని ఇప్పటికీ ఎంతో మంది నోట వింటూంటాం. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోన్న దిగ్గజ సంస్థల అధినేతలు కూడా అదే మాట చెబుతారు. సరదాగా ఓ ఆరుగురు విజేతలు, వారిని ప్రభావం చేసిన పుస్తకాల పుటల్లోకి వెళ్లొద్దామా…

జెఫ్‌ బెజోస్‌(సీఈవో, అమెజాన్‌ ) : ది రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే


అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడన్న సంగతి తెలిసిందే . ‘నేను వాస్తవికత కంటే నవలల ద్వారానే చాలా నేర్చుకున్నాను’ అని అంటారాయన. ‘‘ది రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే’’ అనే నవల తన జీవితాన్ని బాగా ప్రభావితం చేసిందని పలుమార్లు చెప్పారు. ఈ పుస్తకం ముగించిన తర్వాత జెఫ్‌ అలా ఓ 10 గంటలపాటు ఆలోచిస్తూ ఉండిపోయారట. స్టీవెన్స్‌ అనే బట్లర్‌ జీవితం చుట్టూ తిరిగే ‘ది రిమెయిన్స్‌ ఆఫ్‌ ది డే’ నవలను జపనీస్‌ అమెరికన్‌ రచయిత కజువో ఇషిగురో అద్భుతంగా మలిచారు. అదే పేరుతో హాలీవుడ్‌లో ఓ సినిమా కూడా రూపొందింది.


సత్య నాదెళ్ల(సీఈవో, మైక్రోసాఫ్ట్‌ ) : మైండ్‌సెట్‌


ప్రపంచంలో రెండు రకాలవాళ్లుంటారు. తెలిసిందే నిజమని బలంగా నమ్మే ‘ఫిక్స్డ్‌ మైండ్‌సెట్స్‌’ ఒక రకమైతే, అనునిత్యం కొత్త విషయాలను నేర్చుకునే ‘గ్రోత్‌ మైండ్‌సెట్స్‌’ రెండో రకం. ఈ రెండింటి మధ్య తేడాలను సుస్పష్టంగా వివరించేదే ‘‘మైండ్‌సెట్: ది న్యూ సైకాలజీ ఆఫ్‌ సక్సెస్‌’’ అనే పుస్తకం. కార్లో డ్వెక్‌ అనే మహిళా ప్రొఫెసర్‌ తన సుదీర్ఘ అధ్యయనాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు ఇది ఫేవరెట్‌ బుక్. ‘‘నా భార్య అనుపమ సజెషన్‌తో ‘మైండ్‌సెట్’ పుస్తకాన్ని చదివా. మెల్లమెల్లగా నా మైండ్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం మొదలైంది. కొత్త విషయాలను తెలుసుకోవడమే కాదు అభ్యసించడం కూడా అలవాటుగా మారింది. ‘మైండ్‌సెట్‌’ పుస్తకం నిజంగా జీవితం పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది’’ అని అంటారు సత్య నాదెళ్ల.


మార్క్‌ జుకర్‌బర్గ్‌ (సీఈవో, ఫేస్‌బుక్‌ ) : ది న్యూ జిమ్‌ క్రో


ఆధునిక యుగంలోనూ అమెరికాలో జాత్యహంకారం కొనసాగుతున్న తీరును ఎత్తిచూపింది ‘ది న్యూ జిమ్‌ క్రో: మాస్‌ ఇన్‌కార్సరేషన్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ కలర్‌ బ్లైండ్‌నెస్‌’ అనే పుస్తకం. ఆఫ్రికన్‌ అమెరికన్ల పౌరహక్కుల న్యాయవాది మిచెల్లీ అలెగ్జాండర్‌ 2010లో ఆ పుస్తకాన్ని రాశారు. ఆ రచన తను తీవ్రంగా ప్రభావితం చేసిందంటారు ప్రపంచ కుబేరుల్లో ఐదో వ్యక్తి, ఫేస్‌బుక్‌ సీఈవో అయిన మార్క్‌ జుకర్‌బర్గ్‌. ‘‘పుస్తకం చదివిన వెంటనే శాన్‌క్వింటిన్‌ స్టేట్‌ జైలును సందర్శించాను. ప్రస్తుతం అమలవుతోన్న న్యాయ, శిక్షాస్మృలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకున్నాను’’ అని ఎఫ్‌బీ పోస్ట్‌ రాశారాయన. అనంతర కాలంలో జుకర్‌బర్గ్‌ క్రిమినల్‌ జస్టీస్‌ రిఫార్మ్‌ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.


ఇంద్రనూయీ(చైర్‌పర్సన్‌, పెప్సీకో) : ది రోడ్‌ టు క్యారెక్టర్‌


ఇండియాలో పెట్టిపెరిగి, ప్రపంచ దిగ్గజ సంస్థను నిర్వహిస్తోన్న ఇంద్రనూయీకి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు చదివినవాటిలో ‘ది రోడ్‌ టు క్యారెక్టర్‌’ తన ఫేవరెట్‌ బుక్‌ అంటారామె. మనిషికి అణకువ, వినయశీలత అవసరతను తెలియజెప్పే ఆ పుస్తకాన్ని అమెరికన్‌ జర్నలిస్ట్‌ డేవిడ్‌ బ్రూక్స్‌ రాశారు. ‘‘మనం కెరీర్‌పై దృష్టిపెట్టినంతగా క్యారెక్టర్‌ బిల్డింగ్‌పై పెట్టం. అలాంటి చారిత్రక విపత్తుల నుంచి తప్పించుకోవాలంటే ‘ది రోడ్‌ టు క్యారెక్టర్‌’ లాంటి పుస్తకాలు చదవడం చాలా అవసరం. నా ఇద్దరు కూతుళ్లకి పదే పదే ఇదే విషయాన్ని చెబుతుంటా..’’ అని తనను ప్రభావితం చేసిన పుస్తకం గురించి ఇంద్రనూయీ చెబుతారు.


రిచర్డ్‌ పెప్లర్‌(సీఈవో, హెచ్‌బీవో ) : ది స్టోరీస్‌ ఆఫ్‌ జాన్‌ చీవర్‌


అమెరికాలో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లుకు సుదీర్ఘకాలంగా టెలివిజన్‌ సర్వీసులు అందిస్తున్నది హోమ్‌ బాక్స్‌ ఆఫీస్‌(హెచ్‌బీవో). ఈ సంస్థ సీఈవో రిచర్డ్‌ పెప్లర్‌ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం ‘ది స్టోరీస్‌ ఆఫ్‌ జాన్‌ చీవర్‌’. అమెరికన్‌ రచయిత జాన్‌ చీవర్‌ షార్ట్‌ స్టోరీస్‌ సంకలనమే ఈ పుస్తకం. ‘‘నా 20వ బర్త్‌డే రోజు మా నాన్న ఈ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. మానవత్వాన్ని రంగరించిన ఆ కథలన్నీ నన్ను కదిలించాయి. నా దృష్టిలో ‘ది స్టోరీస్‌ ఆఫ్‌ జాన్‌ చీవర్‌’ పుస్తకం వెలకట్టలేని ఓ ఆభరణం. తీరిక చిక్కిన ప్రతిసారీ చదువుతూనే ఉంటా..’’ అని తన ఫేవరెట్‌ పుస్తకం గురించి చెబుతారు రిచర్డ్‌.

షెరిల్‌ శాండ్‌బర్గ్‌ (సీఓఓ, ఫేస్‌బుక్‌ ) : ఎ వింకిల్‌ ఇన్‌ టైమ్‌

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సర్వీస్‌ ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) గానే కాదు సామాజిక కార్యకర్త, రచయిత్రిగానూ షెరిల్‌ శాండ్‌బర్గ్‌ చాలా ఫేమస్‌. ఆమెను బాగా ఆకట్టుకున్న పుస్తకం ‘ఎ వింకిల్‌ ఇన్‌ టైమ్‌’. 1962లో ప్రచురితమైన ఈ సైన్స్‌ ఫ్యాంటసీ నవలను అమెరికన్‌ రచయిత్రి మ్యాండలిన్‌ లింగెల్‌ రాశారు. దివ్యశక్తులున్న ఓ యువతి తప్పిపోయిన తన తండ్రి కోసం అణ్వేషిస్తూ, ఆ క్రమంలోనే దుష్టశక్తుల పనిపట్టడం ‘ఎ వింకిల్‌ ఇన్‌ టైమ్‌’ కథాంశం. ‘‘ఆ కథలోని మెగ్‌ మరీ పాత్రకు నేను ఫిదా అయిపోయా. నేను కూడా తనలా ఉండాలని తపించేదాన్ని’’ అని చెబుతారు షెరిల్‌. ‘ఎ వింకిల్‌ ఇన్‌ టైమ్‌’ నవల అదే పేరుతో సినిమాగానూ తెరకెక్కింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here