భారతదేశంలో చిత్రపరిశ్రమ ఎదైనా కానీ ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్‌లో క్రీడలకు సంబంధించిన బయోపిక్‌లు బంపర్ హిట్‌లుగా నిలిచాయి. దంగల్, మేరీ కోమ్, బాగ్ మిల్కా బాగ్, చక్ దే ఇండియా, ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్ ఇప్పటికే తెరకెక్కి వసూళ్ల సునామీ సృష్టించాయి. ఈకోవలో రాబోయే రోజుల్లో మరిన్ని స్పోర్ట్స్ బయోపిక్‌లు రూపొందించేందుకు బాలీవుడ్ దర్శకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న పలువురు క్రీడాకారులపై బయోపిక్‌లు రూపొందిస్తే వారి పాత్రలో ఎవరూ ఒదిగిపోగలరనేది.. ఒక స్టోరీగా చూద్దాం .
విరాట్ కోహ్లి (లీడ్-షాహిద్ కపూర్)
భారత కెప్టెన్లలో అత్యంత దూకుడైన సారథిగా పేరుపొందిన విరాట్ కోహ్లి తనదైన శైలిలో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంతోపాటు ఆఫ్ ఫీల్డ్‌లోనూ తన భావోద్వేగాల్ని ఏమాత్రం దాచుకోలేని కోహ్లిపై బయోపిక్ తీస్తే పసందుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కోహ్లి.. దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీతార అనుష్క శర్మతో సాగించిన ప్రేమాయణం పెళ్లిగా రూపాంతరం చెందిన సంగతి విదితమే. ఏదేమైనా మంచి మసాలా దినుసులున్న కోహ్లి స్టోరీ బాక్సాఫిస్ వద్ద దుమ్ము రేపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో నటిస్తోన్న షాహిద్ కపూర్‌ను కోహ్లి పాత్ర కోసం సూపర్‌గా సరిపోతాడని అంచనా.
సుశీల్ కుమార్ (లీడ్-సల్మాన్ ఖాన్)
వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సత్తాచాటిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్ అందరికి పరిచితమే. ఇప్పుడు తనపై ఓ బయోపిక్ రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. దీనికి బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ ‘సల్మాన్ ఖాన్’ అయితే బాగుంటుందని బాలీవుడ్ మేకర్లు భావిస్తున్నారు. ఇప్పటికే సుల్తాన్ రూపంలో రెజ్లింగ్ నేపథ్యంలోని సినిమా చేసిన సల్లూ భాయ్.. ఒకవేళ ఈ చిత్ర కార్యరూపం దాలిస్తే సుశీల్ రూపంలో కి ఎలా ఒదిగిపోతాడో చూడాలి. ఇక సుశీల్‌లాగే ఫ్యామిలీ, దేహదారుఢ్యంపై అమిత శ్రద్ధ కనబర్చే సల్మాన్ రెజ్లింగ్ నేపథ్యంలో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పీవీ సింధు (లీడ్-దీపికా పడుకోన్)
ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన తొలి భారత మహిళగా నిలిచిన తెలుగుతేజం, పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచింది. అలాగే ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలోనూ తొలి పతకాన్ని సాధించిన భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది. అలాగే దేశ విదేశాల్లో ఎన్నో టోర్నీలతోపాటు పలు పతకాలు సాధించి గర్వకారణంగా నిలిచింది. తాజాగా సింధుపై బయోపిక్ నిర్మించాలని బాలీవుడ్ మేకర్లు యోచిస్తున్నారు. అయితే సింధు పాత్రలో ఒదిగేందుకు స్టార్ హీరోయిన్ దీపికా పడుకొన్‌తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకప్పటి బ్యాడ్మింటన్ గ్రేట్ ప్రకాశ్ పడుకోన్ కూతురైన దీపికకు ఆటపై చక్కని అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ కలల రాణిగా నిలిచిన దీపిక.. ‘సింధు’ బయోపిక్‌తో బ్యాడ్మింటన్ కోర్టులో చెలరేగే విధంగా బాలీవుడ్ మేకర్లు స్క్రిప్టుపై కసరత్తులు చేస్తున్నారు.
యువరాజ్ సింగ్ (లీడ్-రణ్‌వీర్ సింగ్)
దూకుడైన ఆటతీరు, మెరుపులాంటి ఫీల్డింగ్‌తో అభిమానుల మనసు దోచిన క్రికెటర్లలో యువరాజ్ సింగ్ అగ్రగణ్యుడనడంలో సందేహం లేదు. క్రికెట్‌తోపాటు స్టార్లతో తను ప్రేమయాణాలు నడిపాడు. దీంతో సినీ తారలు కిమ్ శర్మ, నేహా దూపియా, దీపికా పడుకొన్, మినిషా లాండా, రియా సేన్ తదితరులతో యూవీ చట్టాపట్టాలు వేసినట్లు చాలాసార్లు బాలీవుడ్ కోడై కూసింది. ఈక్రమంలో తనపై బయోపిక్ రూపొందిస్తే బాగుంటుందని బాలీవుడ్ దర్శకులు స్క్రిప్టుకు తయారు చేస్తున్నారు. కేన్సర్‌తో పోరాడి భారత్ ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన యూవీ.. తన భార్యగా బాలీవుడ్ తార హాజల్ కీచ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెరపై యూవీ పాత్రలో రణ్‌వీర్ సింగ్‌ను నటింప జేయాలని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సునీల్ ఛెత్రి (లీడ్-ఆమిర్ ఖాన్)
సచిన్ టెండూల్కర్‌లాగా క్రికెటర్‌గా మారాలని భావించిన బ్యాట్, బంతి కొనుక్కొనే స్తొమత లేని కారణంగా ఫుట్‌బాలర్‌గా రూపాంతరం చెంది స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన సునీల్ చెత్రి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత అత్యుత్తమ ఫుట్‌బాలర్లలో అగ్రగణ్యుడిగా పేరుపొందిన సునీల్ చెత్రి ప్రస్తుతం సారథిగా టీమిండియాను ముందుండి నడిపిస్తున్నాడు. ఎత్తుపల్లాలతో కూడిన చెత్రి జీవితంపై బయోపిక్ రూపొందిస్తే బంపర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. ‘బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్టు’ అమిర్ ఖాన్ ఈ బయోపిక్‌లో నటిస్తే రికార్డులు బద్దలవుతాయని అభిమానులు భావిస్తున్నారు.
సానియా మీర్జా (లీడ్-పరిణీతి చోప్రా)
టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.1గా నిలిచిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా హైదరాబాదీ సానియా మీర్జా కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టెన్నిస్‌కు దేశంలో ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఆటగాళ్లలో సానియా పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా ఖ్యాతి వహించింది. బోల్డ్, బ్యూటిఫుల్‌కు చిరునామాగా నిలిచిన సానియాకు ధైర్య సాహసాలు ఎక్కువే. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడి సంచలనం సృష్టించిన సానియా డేర్ అండ్ డాషింగ్‌గా వ్యవహరించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. హైదరాబాద్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించి ప్రపంచ టెన్నిస్ తనదైన ముద్ర వేసిన సానియా బయోపిక్ తీస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో సందేహం లేదు. సానియా పాత్రకు బావోద్వేగాలను అద్భుతంగా పలికించే బాలీవుడ్ తార పరిణీతి చోప్రాను తీసుకుంటే బాగుంటుందని పలువురు విశ్లేషకులు నొక్కివక్కాణిస్తున్నారు.