ఒక మనిషి నాగరికుడని ఎలా చెప్పగలం? వేషభాషలు చూశా? ఆహారపు అలవాట్లను చూశా? వాటిని చూసి అంచనా వేస్తే కోన్యాక్ తెగవారు వెనుకబడిన వారిలాగే కనిపిస్తారు. ఒక్కసారి వారి తెలివితేటల్ని చూస్తే మనమెంత వెనుకబడ్డామో అర్థమవుతుంది. నాగాలాండ్ రాష్ట్రంలో ఎవరికీ కనిపించనంత మూలన ఉంటుంది లాంగ్వా గ్రామం. ఎత్తయిన కొండమీద, దట్టమైన చెట్ల మధ్యన, అసలు ఉందా లేదా అన్నట్టుంటుంది. పూరి గుడిసెలు, మట్టి రోడ్లు, విచిత్రమైన వేషధారణ, ఏ ప్రత్యేకతా లేని జీవనశైలి… చూడగానే ఏముందిక్కడ అనిపిస్తుంది. కానీ అక్కడ నివసించే కోన్యాక్ తెగవారి గురించి తెలసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం… ఓ కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. మరి మనమూ తెలుసుకుందామా…
నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద ఆదివాసీ తెగల్లో కోన్యాక్ అతి పెద్ద తెగ. వీరిని మయన్మార్ సంతతి వారిగా చెబుతుంటారు. చాలా యేళ్ల కిత్రమే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చరిత్ర చెబుతోంది. కోన్యాక్ పురుషులు యోధులు. వేటలో ఆరితేరినవారు. ఒకప్పుడు ఇతర తెగలవారితో తరచూ యుద్ధాలు చేసేవారు. ఆ యుద్ధాలు ఎంత భయానకంగా ఉండేవంటే… శత్రువుల్ని నరికి చంపేవారు. ఆపైన తలను మొండెం నుంచి వేరు చేసి తీసుకొచ్చి, ఇంటిముందు వేళ్లాడగట్టేవారు. ఆ రక్తాన్ని మంటల్లో వేసి యజ్ఞం చేసేవారు. అయితే ఓ సమయంలో ప్రభుత్వం కల్పించుకోవడంతో ఈ రాక్షసక్రీడ అంతమైపోయింది. అయితే ఇప్పటికీ ఆహారం కోసం చంపిన జంతువుల తలల్ని మాత్రం భద్రపర్చుకుంటూ ఉంటారు.
తెగకు ఒక పెద్ద ఉంటారు. అతడిని ‘అంగ్’ అంటారు. ఆయనే అన్ని నిర్ణయాలూ తీసుకుంటాడు. వాటిని అందరూ ఆనుసరిస్తారు. ఆయనకు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి. ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎందరు పిల్లల్ని అయినా కనవచ్చు. కోన్యాక్ వాసుల్ని మిగతా తెగల్లో ప్రత్యేకంగా నిలిపేది వారి ఒంటిమీద ఉన్న పచ్చబొట్లే. కొన్ని రకాల సూదుల్ని ఉపయోగించి చేతులతోనే ఆ పచ్చబొట్లు పొడుస్తారు. మెడ చుట్లూ, చేతుల మీద, తొడల మీద, వీపంతా కూడా అందంగా పచ్చబొట్లు వేసుకుంటారు. వెదురుతో నిర్మించే వీరి ఇళ్లు చాలా విశాలంగా ఉంటాయి. కిచెన్, బెడ్‌రూమ్, డైనింగ్‌రూమ్, స్టోర్‌రూమ్ అంటూ ప్రతిదానికీ ప్రత్యేకంగా ఓ గది ఉంటుంది. ఇళ్లను, పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.
వీరికి మాంసాహారమంటే ప్రీతి. బీఫ్ ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మిరియాలతో కలిపి రకరకాల బీఫ్ వంటకాలు చేస్తారు. తేనెను కూడా ఎక్కువగా తీసుకుంటారు. కోన్యాక్ వారిలో చాలా ఐకమత్యం ఉంటుంది. అందరూ కలిసి ఉంటారు. ఒకరు వండుకున్నవి మరొకరు పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా పెట్టుకుంటారు. ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. కానీ తర్వాత నాగాలాండ్ రాష్ట్రంలో క్రైస్తవ మతస్తులు పెరగడంతో వీరూ ఆ మతం పట్ల ఆకర్షితులయ్యారు. ‘అంగ్’ ఇంటి పక్కనే ఉండే చర్చ్‌లో ప్రార్థనలు చేస్తుంటారు. మహిళలూ పురుషులూ కూడా ఆభరణాలు ధరిస్తారు. వాటిని వాళ్లే సొంతగా తయారు చేసుకుంటారు. పూసలతో చేసే నెక్లెస్‌లు, బ్రేస్‌లెట్లు చాలా బాగుంటాయి. ఎముకలు, శంఖాలు వంటి వాటితో కూడా ఆభరణాలు తయారు చేసుకుంటారు.
కోన్యాక్ పురుషుల వద్ద కత్తులు, గొడ్డళ్లు, కొడవళ్లు, ఈటెలతో పాటు తుపాకులు కూడా ఉంటాయి. వాటిని వీరే తయారు చేసుకుంటారు. గన్ పౌడర్ కూడా వీరే చేస్తారు. ఒకప్పుడు యోధులై ఉండటం వల్ల ఇవన్నీ వారికి వచ్చాయి. యేటా వీరు నిర్వహించే హార్న్‌బిల్ ఫెస్టివల్‌కి వెళ్తే వీరెంత కళాకారులో తెలుస్తుంది. అక్కడ వీరు ప్రదర్శించే విన్యాసాలు, ఆడే ఆటలు, పాడే పాటలు, చేసే నృత్యాలు చూస్తే… వీరు వెనుకబడినవారు కాదని, మనకి తెలియని ఎన్నో విషయాలూ విద్యలూ వారికి తెలుసనీ అర్థమవుతుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి నాగాలాండ్‌కి ఫ్లైట్స్ ఉన్నాయి. ట్రైన్లు, బస్సులు ఉన్నాయి కానీ రెండు రోజులు పట్టేస్తుంది. అయితే నాగాలాండ్ వెళ్లాక లాంగ్వా చేరుకోవడం మాత్రం పెద్ద సాహసమే. రాజధాని కోహిమాకి 300 కి.మీ.ల దూరంలో మన్ అనే ప్రదేశం ఉంది. అక్కడికి ట్యాక్సీలో చేరుకోవాలి. దిమాపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనుక ఫ్లైట్ దిగితే, స్థానిక రైల్వేస్టేషన్ నుంచి మన్‌కి రైల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి లాంగ్వాకి జీపులు, ట్యాక్సీలు ఉంటాయి. ఒక్కరికే బుక్ చేసుకోవచ్చు. షేరింగ్‌లో అయినా వెళ్లవచ్చు.