ఈడీ ఉచ్చులో మంత్రి.. డిసెంబర్​లో అసెంబ్లీ.. సంక్రాంతి లోపు డబుల్​ బెడ్రూం ఇండ్లు.. ఆ మంత్రిని బండలతో కొట్టాలి.. టాప్ టెన్ న్యూస్

1. సీసీ కెమెరాకు చిక్కిన మూడు చిరుతలు​

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో పెద్దపులి సంచారం హడలెత్తించిన నేపథ్యంలో అధికారులు పెద్దపులి అడుగుజాడలు, సంచారం తెలుసుకునేందుకు పెట్టిన సీసీ కెమెరాలలో మూడు చిరుతలు ఒకే చోట తిరుగుతున్న ఫోటో చిక్కింది.

2. వందల కోట్లు హవాలా.. మంత్రి మల్లారెడ్డికి నోటీసులు.. రంగంలోకి ఈడీ ​

మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఐటీ సోదాలు మరో మలుపు తిరిగాయి. ఐటీ సోదాల్లో 14కు పైగా కంపెనీల్లో జరిపిన సోదాల్లో రూ.వందల కోట్లు హవాలా లావాదేవీలు బయటపడ్డట్లు సమాచారం. దీంతో మంత్రి మల్లారెడ్డి సహా ఆయా కంపెనీలకు చెందిన డైరెక్టర్లు అందరికీ ఐటీ నోటీసులు జారీ చేసింది.ఈ నెల 28,29వ తేదీల్లో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆర్ధిక లావాదేవీలకు చెందిన డాక్యుమెంట్స్‌ను తీసుకురావాలని నోటీసులు ఇచ్చింది. హవాలా ట్రాన్సాక్షన్స్ ఆధారాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి లెటర్‌‌ రాయనుంది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఈడీకి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఐటీ అధికారులు తమను వేధిస్తున్నారని మల్లారెడ్డి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. తమ ల్యాప్​టాప్​ను మాయం చేసి.. విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.

3. సంక్రాంతి లోపు డబుల్​ బెడ్రూం ఇండ్ల పంపిణీ

రాష్ట్రంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జనవరి 15 వరకు లబ్దిదారులకు అందించాలని హౌసింగ్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఈలోపు పెండింగ్ లో ఉన్న మౌళిక వసతులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంత్రితో పాటు సీఎస్ సోమేష్ కుమార్ తో గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి అద్దె ఇండ్లలో నివసిస్తున్న పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అర్హులని మంత్రి తెలిపారు. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి అప్లికేషన్లు స్వీకరించాలని మంత్రి సూచించారు. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపిస్తారు. ఈ జాబితాను ప్రభుత్వానికి పంపిస్తే ఫైనల్ లిస్ట్ పంపిస్తామని జిల్లా కలెక్టర్లకు మంత్రి తెలిపారు. కట్టిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.

4. డిసెంబర్​ రెండో వారంలో అసెంబ్లీ​

డిసెంబర్​ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆర్థికపరమైన ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయాలతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నదని ఆరోపించారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు డిసెంబర్‌లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

5. 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషనా

52 శాతం ఉన్న జనాభాకు 27 శాతం రిజర్వేషన్లు ఉండటం అన్యాయమని బీఎస్​పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఆందోళనకు పిలుపునిచ్చారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్​ చేశారు. బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఆందోళనలు చేయనున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ దినోత్సవం నుండి ఈ కార్యాచరణ ప్రారంభిస్తామని అన్నారు. వరుస ఆందోళనలు, సెమినార్లు, రౌండ్ టేబుల్ కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈడబ్యుఎస్ రిజర్వేషన్లలో ఎస్సీ,ఎస్టీ, బీసీ లకు వాటా కల్పించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపుతామని అన్నారు.

6. మన సిల్వర్​ ఫిలిగ్రీకి జాతీయ గుర్తింపు

కరీంనగర్​ సిల్వర్ ఫిలిగ్రికి మరోసారి జాతీయ గుర్తింపు దక్కింది. ఫిలిగ్రి కళాకారుడు గద్దె అశోక్ కుమార్ కిలోన్నర వెండితో తయారు చేసిన తీగల పల్లకీ జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ ఈ నెల 28న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ కుమార్​కు అవార్డును బహూకరించనుంది. 2018లో అశోక్ కుమార్ దీన్ని తయారు చేశారు. ఢిల్లీలోని జాతీయ చేతి కళల అభివృద్ధి సంస్థకు పంపించారు. వెండి నగిషీ వస్తువుల తయారీలో కరీంనగర్​కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. దేశ, విదేశీ అతిథులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే ఫిలిగ్రి కళారూపాలను కరీంనగర్​లోనే తయారు చేయిస్తారు.

7. అటవీ శాఖ మంత్రిని బండలతో కొట్టాలి..

సీఎం కేసీఆర్​ ఫెయిల్యూర్​ వల్లనే ఫారెస్ట్ అధికారులు బలవుతున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ మండిపడ్డారు. అడవులు, ఆదివాసీల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్న అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డిని బండలతో కొడితేనే బుద్ధి వస్తుందన్నారు. గురువారం కాగజ్​నగర్​ మండలం కదంబలో కుమ్రం భీమ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికారులపై దాడులను తాము సమర్థించబోమని, కానీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లనే దాడులు సాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎన్నికల టైంలో పోడు పట్టాల గురించి సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తనను, ఆదివాసీలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

8. లిక్కర్ స్కామ్​లో అభిషేక్​ మరో 14 రోజులు రిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ కు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. చలికాలం వేసుకునే దుస్తులు, పుస్తకాలు, అవసరమైన మెడిసిన్ అందించాలని జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ నాయర్ కు మరో రెండు రోజుల ఈడీ కస్టడీని పొడగించింది. లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుకు సంబంధించి ఈ నెల 14న అభిషేక్, విజయ్ నాయర్​కు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, వెంటనే ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు కస్టడీని మరో ఐదు రోజులు పొడగించింది.

9. పాకిస్తాన్​ కొత్త ఆర్మీ చీఫ్​గా అసిమ్​ మునీర్​

పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా అసీమ్ మునీర్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మర్రియం ఔరంగజేబ్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే సాహిర్ షంషాద్ మీర్జాను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా నియమించినట్లు తెలిపారు. ప్రధాని షహెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకు వీరిద్దరి నియామకం జరిగిందని చెప్పారు. వీరి అపాయింట్ మెంట్ కు సంబంధించిన ఫైల్స్ ను సంతకాల కోసం దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వద్దకు పంపించారు. అసీమ్ మునీర్‌ ప్రస్తుతం పాక్ ఆర్మీ హెడ్ ఆఫీసులో క్వార్టర్ మాస్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. గతంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్పై చీఫ్‌గా, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here