సరిగ్గా రెండేళ్ల కిందట ప్రపంచమంతటా కరోనా వైరస్ భయంకరంగా పెచ్చరిల్లింది. కానీ… సరిగ్గా నూటాపదమూడేళ్ల కిందట మూసీ ఒడ్డున ఉన్న హైదరాబాద్‌కు 1908లో అంతే భయంకరంగా వరదలొచ్చాయి.
ఈ రెండింటికీ కామన్ పాయింట్ ఒకటుంది. అదే… ‘క్వారంటైన్’!!
‘ఓ వ్యక్తినుంచి భౌతికంగా దూరంగా ఉండటం లేదా వ్యాధి తగ్గేవరకు ఒకరిని దూరంగా ఉంచడం’ అనేందుకు వాడే మాటే ‘క్వారంటైన్’. మనలో చాలామందికి ఈ మాటకు అర్థం నిన్నమొన్ననే తెలియవచ్చింది. కానీ అదేమిటో హైదరాబాద్ వాసులకు నూటా పదమూడేళ్ల కిందటే ఆ మాటకు అర్థం తెలుసు. అందుకు కారణం వరదలు. మూసీకి వచ్చిన వరదలు. అతి భయంకరమైన వరదలు. అత్యంత భయానకమైన వరదలు.
అప్పటి పరిస్థితుల్లో వరదలంటే కేవలం నీటి ప్రవాహపు ఉరవడితో వచ్చే వరదలేకాదు… బురదలతో జలం కలుషితం కావడం కూడా. పురుగులు పెచ్చరిల్లి ప్రబలే వ్యాధులూ కూడా… క్రిములు వ్యాపించి విస్తరిల్లే అంటువ్యాధులు కూడా. అందుకే ఆ వదరలతో… ఆ బురదలతో కలుషితమైన నీళ్లతో కలరా వ్యాపించిందట. టైఫాయిడ్ విస్తరిల్లిందట. తాగడానికి శుభ్రమైన నీళ్లు లేక మురికి నీళ్లు తాగడంతో డయేరియా, దోమలు గుడ్లుపెట్టేలా నీళ్లు పేరుకోవడంతో వచ్చిన మలేరియా… ఇలా ఎన్నెన్నో వ్యాధులు. మరెన్నో రుగ్మతలు… ఇంకెన్నో జ్వరాలు.
అన్ని రకాల జ్వరాలకూ చికిత్స అక్కడే. కాకపోతే కలరాలాంటి మహమ్మారులకు క్వారంటైన్ తప్పదు కదా. ఇతరత్రా జ్వరాలకు మందులతో చికిత్సా తప్పదు.
మరి ఆరోగ్యరంగంలో అత్యంత విప్లవాత్మకమైన నేటి పరిస్థితుల్లోనే క్వారంటైన్ ఇంతగా పాటించాల్సి వస్తే… అప్పట్లో… నూరేళ్ల కిందట అదెంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా వ్యాధిగ్రస్తులను క్వారంటైన్ చేసి, చికిత్స అందించడానికి ఉద్దేశించిన ఆసుపత్రే… ఆ ‘‘క్వారంటైన్’’ కేంద్రం! జనం వాడుకలో, ప్రజల నాల్కలలో పడి అదే ‘‘కోరంటీ దవాఖానా’’ అయ్యింది!! క్వారంటైన్ అయ్యే పరిస్థితుల నుంచి బయటపడ్డాక దానికి ‘గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్’ అంటూ పేరు పెట్టాక కూడా… ప్రజాబాహుళ్యంలో ఉన్న ‘కోరంటీ’ అన్న మాటే ఇంకా అందరి నాల్కల మీద నలుగుతూ ఉంది. జననానుడి ఎంత జవసత్వాలతో ఉంటుందో చెప్పడానికి ఇదే ఓ మంచి ఉదాహరణ.
1908 సెప్టెంబరు 28న మూసీకి… జనజీవనం అల్లకల్లోలమయ్యేలా… ప్రజలంతా భయభ్రాంతమయ్యేలా… పిల్లాపాప వణికిపోయేలా… అత్యంత భయంకరంగా వరద వచ్చినప్పుడు పదుల వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారట. ఉజ్జాయింపుగా దాదాపు 50,000 మంది ప్రజలు చనిపోయారని ప్రతీతి. దాదాపు 80,000 మంది నిరాశ్రయులయ్యారని అంచనా. చెట్లపైనా, ఎత్తుగట్లపైన రోజుల తరబడి నిల్చుండిపోయి బతికిన వారు ఏ కొద్దిమందో.
అప్పటి నిజాం ప్రభుత్వం సహాయకచర్యల కోసం నిజాం కరెన్సీ ఐదు లక్షల రూపాయలను విడుదల చేసిందట. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిన విరాళాల మొత్తం మరో పదిలక్షలు. సహాయకచర్యల కోసం అప్పట్లోనే 10 రోజులపాటు అన్ని కార్యాలయాలకూ, కార్యకలాపాలకూ అధికారికంగా సెలవలు ప్రకటించారు. 29 సెప్టెంబరు 1908 నుంచి 13 అక్టోబరు 1908 వరకు నిరాఘాటంగా సహాయ చర్యలూ… సహాయ చర్యలూ… సహాయ చర్యలూ… ఇదొక్కటే పని. ఇప్పటికి తుఫాన్లకు పెట్టినట్టే… సెప్టెంబరులో వచ్చిన ఆ వరదకు అప్పట్లో ఉర్దూ భాషలో పెట్టిన పేరు… ‘‘తుగ్యానీ సితంబర్’’!!
అదెంత బీభత్స భయానక వదర అంటే… అప్పట్లో పాతనగరాన్ని ఇప్పుడు కొత్తనగరమని పిలిచే ప్రాంతంతో కలిపే మూడు ప్రధాన బ్రిడ్జీలు… అఫ్‌జల్, ముసల్లమ్ జంగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జీలు ఆ వదరనీటి ధాటికి కుప్పకూలిపోవడమే కాదు… ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోయాయట. రెండు నగరాల మధ్య వారధిగా పురానాపూల్ ఒక్కటే మిగిలిందట. ఆ పూరానాపూల్ మీద కూడా… వంతెన మీది నుంచి, వారధి మీది నుంచి వరద భయంకరంగా ప్రవహించిందట. ఆనాడు బతికిన పెద్దలు చెప్పుకుంటుండగా విని… ఇంకా బతికి ఉన్న బుజుర్గులు చెప్పే మాటలివి.
అంతటి భయంకరమైన వరద… మరెంతటి వైద్యసమస్యలు తెచ్చిపెట్టిందో ఎవరికి వారే ఊహించుకోవచ్చు. అందుకే అప్పటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ ఓ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. చేశాడు కూడా. కాకపోతే అప్పటికప్పుడు కాస్తంత తాత్కాలికమైన ఏర్పాట్లతో!
అన్నట్టు ‘కోటంటీ దావఖానా’ అప్పట్లో ఇప్పుడున్న ప్రాంతంలో లేదు. ఇప్పుడున్న ఫీవర్ హాస్పిటల్‌కు ఎదురుగా అప్పట్లో ఓ గుట్టలాంటి ఎల్తైన ప్రాంతం ఉండేది. దానిపేరు ఎర్రన్నగుట్ట. తొలుత మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఎర్రన్నగుట్ట మీద ఏర్పాటైన హాస్పిటల్ కాస్తా… చివరి నిజాం అధికారంలోకి వచ్చాక… అంటే… 1915 – 1923 మధ్య ప్రాంతాల్లో 13.5 ఎకరాల స్థలంలో ఇప్పుడున్న ప్రాంతంలోకి వచ్చింది. ఎట్టకేలకు అధికారికంగా ఓ పూర్తిస్థాయి హాస్పిటల్ ఏర్పాటైంది. ఎర్రన్నగుట్ట మీద ఎవరో కొద్దిమంది డాక్టర్లు, నర్సులు ఎలాగో కష్టపడి అందించే చికిత్స స్థానంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎన్నెన్నో రకాల జ్వరాలకు చికిత్సలందించే స్థాయికి చేరుకుంది. అందుకే దానికి ఫీవర్ హాస్పిటల్ పేరు సార్థకమైంది. ఎలగో ‘ఎర్రన్నగుట్ట’ నుంచి నాణ్యంగా ‘నల్లకుంట’కు వచ్చింది… వచ్చిచేరింది. అంతేకాదు… అప్పట్లో మలేరియాకు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించిన సర్ రొనాల్డ్ రాస్ పేరిట… ‘‘సర్ రొనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూకబుల్ డిసీజెస్’’ పేరిట ఓ సరికొత్త పేరూ పెట్టుకుంది.
మూసీకి వచ్చిన వరదలు హైదరాబాద్ తీరప్రాంతాల వాసులకే ఇబ్బంది తెచ్చినందుకు ఏర్పాటైన ఆ హాస్పిటల్ కేవలం హైదరాబాద్ వాసులకే పరిమితమైందా? లేదు… చుట్టుపక్కల రాష్ట్రాలైన కర్ణాటకా, మహారాష్ట్రా ప్రాంతాల్నుంచి కూడా ప్రజలు చికిత్స కోసం అప్పట్లో తండోపతండాలుగా వచ్చిన దాఖలాలున్నాయి.
అలనాడు… నిజాముల దూరదృష్టితో ఏర్పాటైన ఆ కోరంటీ… 113 ఏళ్ల తర్వాత ఈనాడు కూడా అదే రకాల జ్వరాలకు అధికార చికిత్స కేంద్రమై… ఎంతోమందికి స్వస్థతనందిస్తూ… ఆరోగ్యాన్ని సమకూరుస్తోంది.
అనేక తరాలకొద్దీ… వందేళ్లకు పైగా… వందలాదిమందికి ఆరోగ్యాన్నిస్తున్న దవాఖానా గురించి… సంక్షిప్తంగా ఇదీ దాని కథ. అంతులేని దాని కథ… అతి సంక్షిప్తంగా.