మలేరియా గుట్టు విప్పిన సర్‌ రొనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇదే

పిచ్చి కవులు తమ వెర్రి కొద్దీ ‘‘కుంజరయూద్ధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్‌’’ అంటూ పిచ్చి పిచ్చి కల్పనలు చేశారుగానీ… ఎక్కడైనా దోమ గొంతులో ఏనుగు దూరుతుందా?

ఆ కవులు మళ్లీ ఊరకే ఉంటారా? ‘‘రవి గాంచని చోటు కవిగాంచున్‌’’ అంటారు. ‘‘కవి నిరంకుశు’’డంటారు. ఇక నిరంకుశుడైన కవి కరాఖండీగా సెలవిచ్చాక శాస్త్రవేత్తలకు తప్పుతుందా!  మరీ దోమ గొంతులో కాదుగానీ… దాని కడుపులోంచి ఓ రహస్యాన్ని కోసి తీసి… ఓ జబ్బును కనిపెట్టేశాడు. ఆ జబ్బు గురించి అప్పటికి అదెంత పెద్ద రహస్యమంటే…  ఓ  పే… ద్ధ…  ఏనుగంత!

మన దేశంలోనే… ఆల్మోరాలో మే 13, 1857న పుట్టాడు రొనాల్డ్‌ రాస్‌ అనే చిన్నకుర్రాడు. ఎనిమిదేళ్ల వయసులో అతణ్ణి చదువు కోసం ఇంగ్లాండ్‌కు పంపారు తల్లిదండ్రులు. లండన్‌లోని సెయింట్‌ బార్థోలోమేవ్‌ హాస్పిటల్‌లో మెడిసిన్‌ చదివి… 1881లో మళ్లీ ఇండియాకు వచ్చి ఇక్కడ మెడికల్‌ సర్వీస్‌లో చేరాడా యువ రొనాల్డ్‌ రాస్‌. రోజూ డ్యూటి సికింద్రాబాద్‌లో రెజిమెంట్‌లో మెడికల్‌ ఆఫీసర్‌గా. అవ్వడానికి తాను శస్త్రచికిత్సల నిపుణుడే అయినా… ఎందుకో మొదట్నుంచీ అతడి దృష్టంతా ఈ దేశపు ఉష్ణమండల జ్వరాలూ, జబ్బులపైనే. ఆ జబ్బుల లోతుపాతులు కనుగొనేందుకు బేగంపేటలో ఉన్న మిలటరీ హాస్పిటల్‌ అతడి పరిశోధన క్షేత్రమైంది. ఆ సుక్షేత్రం నుంచి మలేరియాకు కారణం ఏమిటనే అనే ఫలసాయం అందింది.

sir ronald ross

మలేరియా అనే జబ్బుకు.. ఆ పేరును బట్టి దాని అర్థమేమిటంటే… ‘మాల్‌’ అంటే బ్యాడ్‌… అనగా చెడు! ఏరియా అంటే ఎయిర్‌… గాలి!! ఈ రెండు కలిపి చదివితే… బ్యాడ్‌ ఎయిర్‌! అనగా చెడుగాలి తో వచ్చే జబ్బు అని అర్థం. అంటే వెరసి అదో చెడువాతావరణం వల్లనో, కలుషితమైన గాలివల్లనో వచ్చే జబ్బు అనే అపోహ చాలాకాలం రాజ్యమేలింది.

మలేరియా గురించి ఆసక్తి కలిగిన నాటి… ఆ జబ్బును కలిగించే సూక్ష్మక్రిమి దోమ కడుపులో ఉంటుందని రాస్‌కు అనుమానం. నిర్ధారణ జరగకపోయినా.. తన గురువులు చెప్పిందీ అదే. అందుకే దోమతో కుట్టించుకున్నవారికి ఒక అణా పారితోషికంగా ఇచ్చి మరీ పరిశోధనలు చేసేవారు రాస్‌.

ఎట్టకేలకు పరిశోధనలు ఫలించాయి. దోమ కడుపులో మలేరియాను కలిగించే  ఏకకణజీవి జీవితచక్రం కొనసాగుతుందని కనుక్కున్నాడు రొనాల్డ్‌రాస్‌ అనే ఈ శాస్త్రవేత్త. అందుకు గుర్తింపుగా నోబెల్‌ప్రైజ్‌ సైతం వచ్చింది. ఇంగ్లాండు బయట భారత్‌లో పుట్టి… ఇంగ్లాండ్‌ బయట సికింద్రాబాద్‌ బేగంపేటలో పరిశోధనలు చేసీ… తొలి ఇంగ్లాండ్‌  నోబుల్‌ బహుమతి స్వీకర్తగా పేరుగాంచాడు రొనాల్డ్‌ రాస్‌. వైద్యనిపుణుడే కాదు… అతడో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓ పక్క శాస్త్రపరిశోధనలే కాదు… మరో పక్క కవిగా, రచయితగా పద్యాలూ, నవలలూ రాశాడు. మెడిసిన్‌లో చేరాక… మొదట్లో వైద్యంపై పెద్దగా ఆసక్తి లేక పాటలకు బాణీలు కడుతూ, సంగీతం సమకూర్చాడు. రంగస్థల నటుడు. స్వతాహాగా లెక్కలంటే బాగా ఇష్టపడేవారు. ఇన్ని గుణాలున్న ఈయన మన బేగంపేటలో తన పరిశోధనలను కొనసాగించాడు. అదీ విచిత్రంగా. మలేరియా గుట్టు విప్పాలంటే భారత్‌ సరైన ప్రదేశమంటూ గురువు మ్యాన్సన్‌ చెప్పడం వల్ల ఇలా బేగంపేటకు రావాల్సి వచ్చింది. ఇలా గురూపదేశంతో తొలుత 24 ఏప్రిల్‌ 1895న సికింద్రాబాద్‌ చేరాడు. ఇప్పుడు సర్‌ రొనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారాసైటాలజీ అని పిలుస్తున్న ఈ భవనంలోనే పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకున్నాడు.

ఓనాడు తనకు కావాల్సినవిధంగా దోమలను సేకరించేందుకు కొన్ని లార్వాలను ఎంపిక చేసుకున్నాడు. పెరిగి పెద్దయ్యాక… ఆ దోమల కడుపుల్లో ఏ జబ్బు తాలూకు క్రిములూ లేవని నిర్ధారణ చేసుకునేందుకు ఓ 20 లార్వాలను తానే స్వయంగా ఎంచి,  పెంచి పెద్దచేశాడు. అప్పటికే మలేరియాతో బాధపడుతున్న హుసేన్‌ఖాన్‌ అనే ఓ వ్యక్తికి ఎనిమిది అణాలు ఇచ్చాడు. అతడిని ఎనాఫిలస్‌ జాతి దోమలు కుట్టేలా చేశాడు. అప్పుడా ఆ దోమ కడుపును డిసెక్ట్‌ చేసి… దాని గ్యాస్ట్రోఎంటిరిక్‌ కుహరంలోకి తొంగి చూశాడు. అంతే… మలేరియాకు కారణమైన ప్లాస్మోడియమ్‌ జీవి రొనాల్డ్‌రాస్‌ చేతికి చిక్కింది. అలా మలేరియా గుట్టుమట్లు కనిపెట్టాడు. దాంతో అతడికి 1902లో నోబుల్‌ప్రైజ్‌ వచ్చింది.

ఓ నోబుల్‌బహుమతికి అర్హమైన స్థాయి పరిశోధనలకు వేదిక అయిన ఆ భవనం 2.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అప్పటి ఓ మిలటరీ హాస్పిటల్‌ బిల్డింగ్‌. రొనాల్డ్‌ రాస్‌ పరిశోధనల తర్వాత అది ఉస్మానియా యూనివర్సిటీ వారి అధీనంలోకి వెళ్లిందట. అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సత్యనారాయణ్‌సింగ్‌ అనే జువాలజీ ప్రొఫెసర్‌ దాన్ని ఉస్మానియా పరిధిలోకి తెచ్చాట్ట. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్లూ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వారూ దాన్ని తమ పరిశోధనల కోసం ఉపయోగించుకున్నారట. ఆ తర్వాత ఎందుకోగానీ అప్పటికి ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధీనంలో ఉన్న ఆ భవనం దక్కన్‌ ఎయిర్‌లైన్స్‌ అధీనంలోకి వెళ్లింది. వాళ్లు ఈ భవనంలో ‘ఆఫీసర్స్‌ మెస్‌’ నడిపారని ప్రతీతి.  మన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పైలట్‌ శిక్షణ తీసుకునే సమయంలోనూ అది ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) వాళ్ల సంరక్షణలో ఉంది. అంటే రాజీవ్‌గాంధీతోనూ ఈ భవనానికి సంబంధం ఉందన్నమాట.

ఇంక అటు తర్వాత 1997లో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 700 మంది సైంటిస్టులంతా ఆ భవనంలో సమావేశమై రొనాల్డ్‌రాస్‌ పరిశోధనలను గుర్తుచేసుకుంటూ ఆయనకోమారు నివాళి అర్పించారు. ఆ సందర్భంలో… ఆ భవనానికి పూర్వకళ తెచ్చేందుకు బ్రిటిష్‌ హైకమిషన్‌ వారు 54,000 యూఎస్‌ డాలర్లు (అప్పటి మన కరెన్సీలో దాదాపు 41 లక్షల రూపాయలు) వెచ్చించి, దానికి రిపేర్లు చేయించడమూ,అవసరమైన చోట్ల పునర్నించడమూ చేశారు. ఇది కూడా ప్రపంచ వారసత్వ సంపద చిహ్నాల్లో ఒకటి కావడంతో… దాని అభివృద్ధి కోసం మరో 6.5 లక్షల రూపాయలు కేటాయించారు. ఎట్టకేలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్నో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూ. 40 లక్షలతో ఓ హార్టికల్చర్‌ పార్క్‌ ఏర్పాటు చేసి… దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులంతా అక్కడికి వచ్చేలా ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేసినా అదంతగా ఫలించినట్టు లేదు.

మలేరియా అంటే బ్యాడ్‌ ఎయిర్‌ అనే అపోహ మబ్బులు తొలగినట్టుగానే… ఈ భవనం పట్ల అందరి నిరాసక్తత మబ్బులూ చెదరిపోతే ఎంత బాగుంటుంది?!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here