శ్రీమంతుడు అనగానే మనకు టక్కున గుర్తోచ్చే హీరో మహేష్ బాబునే. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2015లో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది. ఊరిని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇదే కాన్సెప్ట్ తో బాలకృష్ణ ఓ సినిమా చేశారంటే నమ్ముతారా.. అవును మరీ… అదే జననీ జన్మభూమి. 1984 లోవచ్చిన సినిమాకు కె విశ్వనాథ్ దర్శకత్వం వహించగా శ్రీ భ్రమరాంబికా ఫిల్మ్స్ పతాకంపై కోగంటి కేశ్వరావు నిర్మించారు. బాలకృష్ణ సరసన సుమలత హీరోయిన్ గా నటించింది.
ఇందులో హీరో పేరు రమేష్. ఓ కోటీశ్వరుడి(సత్యనారాయణ) కొడుకు. సర్వ సుఖాలు ఉన్నా ఏదో తెలియని వెలితితో బాధ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ పద్మిని(సుమలత) వల్ల ఎవరికి చెప్పకుండా స్వంత ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉండి సామాన్య జనంలో సాధక బాధలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళాక ప్రతి మంచి పనికి అడ్డుపడే విలన్ అబ్బయ్య నాయుడు (గోకిన రామారావు) ఉంటాడు. మరి రమేష్ కోరుకున్న లక్ష్యం నెరవేరిందా, కొడుకు వెళ్ళిపోయి బాధపడుతున్న హీరో కుటుంబం అతని ఆచూకీ ఎలా కనుక్కుంది లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి.
కథ అచ్చం శ్రీమంతుడు సినిమా లాగే ఉందని అనోచ్చు. ఈ సినిమాను విశ్వనాథ్ కళాత్మకంగా, సందేశాత్మకంగా తీయడంతో అప్పట్లో కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలతో ఈ సినిమాకు వస్తే వారికి నిరాశే ఎదురైంది. అప్పుడు ప్రేక్షకులు పట్టించుకోని కథను 31 ఏళ్ళ తర్వాత శ్రీమంతుడని మహేష్ బాబుని పెట్టి తీస్తే అదే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు.