దర్శకధీరుడు రాజమౌళి అంటే మనకు గుర్తుకు వచ్చేది సీన్స్ మాత్రమే… ప్రేక్షకుడి భావోద్వేగాలను పతాకస్థాయికి తీసుకెళ్లడంలో ఆయనకు ఆయనే సాటి. రామ్ చరణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం మగధీర. ఈ సినిమాలో ఒక్కో సీన్ ఆరాచకం. ముఖ్యంగా రామ్ చరణ్ ను గుర్రం కాపాడటం సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఈ సీన్ ను జక్కన్న చిరంజీవి నటించిన కొదమసింహం సినిమా నుంచి తీసుకున్నారు.
కొదమ సింహం సినిమాలో చిరంజీవిని విలన్లు ఇసుకలో పీకల్లోతు పాతి పెట్టేస్తారు. అదే సమయంలో ఆయన గుర్రం వచ్చి సాయం చేస్తుంది. ఆ సన్నివేశం చూస్తూ నేను చాలా ఎమోషనల్ అయ్యానని రాజమౌళి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కన్నీళ్లు ఆగలేదన్నారు . గుర్రం సాయంతో చిరంజీవి బయటపడిన తర్వాత ఆయనకూ గుర్రానికి ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. అది చూసి చాలా నిరాశపడ్డానన్నారు.
ఆ సమయంలో తనకు అది గుర్రంలా అనిపించలేదని, అదొక వ్యక్తిలా అనిపించిందన్నారు. మనకు సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ ఎమోషన్ ప్రేక్షకుడి గుండెను తాకదు. అది నాకు మైండ్‌లో బాగా ఉండిపోయింది. ఒక సగటు ప్రేక్షకుడిగా అది నాకు సంతృప్తినివ్వలేదు. దాని నుంచి వచ్చిందే మగధీర లోని సన్నివేశమని చెప్పారు.
ఇందులో రామ్ చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన గుర్రం అక్కడకు వచ్చి, సాయం చేస్తుంది. ఆ ఆపద నుంచి బయట పడిన తర్వాత ఆ గుర్రం దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని, కృతజ్ఞత చూపిస్తాడు. అది ప్రేక్షకుడికి విపరీతమైన కిక్ ఇచ్చిందని రాజమౌళి వెల్లడించారు. కొదమసింహం చూస్తున్నప్పుడు తాను ఏదైతే ఫీల్ అవ్వలేకపోయానో దాన్ని మగధీరతో పూర్తి చేశానని చెప్పారు.