చంద్రబాబు రోడ్డుషోలో తొక్కిసలాట ఏడుగురు మృతి.. టెన్త్ లో ఆరు పేపర్లే.. రెండు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్​పీఎస్​సీ.. సీబీఐకి ఫామ్​హౌజ్​ కేసు.. ఈ రోజు టాప్​ న్యూస్​

చంద్రబాబు రోడ్డుషోలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

ఏపీలోని కందుకూరులో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన సభలో జరిగిన తొక్కిసలాటలో  ఏడుగురు మరణించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చంద్రబాబు వెళ్లి వారిన ఇపరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

టెన్త్​లో ఆరు పేపర్లే

పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో టెన్త్ లో 11 పేపర్లు ఉండగా..  వాటి సంఖ్యను ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పది వార్షిక పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. 2022-23 నుంచి పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలను ఏప్రిల్ 3వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టీఎస్​పీఎస్​సీ రెండు నోటిఫికేషన్లు

టీఎస్​పీఎస్​సీ రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో ఫిజికల్​ డైరెక్టర్​ పోస్టులతో పాటు వ్యవసాయశాఖలో అగ్రికల్చర్​ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. జనవరిలో అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నోటిఫికేషన్​ ద్వారా 128 పీడీ పోస్టులు, 148 ఏవో పోస్టుల రిక్రూట్​మెంట్​ చేపట్టనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

సీబీఐకి‌ ఫాంహౌజ్ కేసు

మొయినాబాద్ ఫాం హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ఇవాళ ఆ తీర్పు కాపీ సీబీఐకి అందింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని తీర్పులో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కేసు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందన్నారు.  దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి  ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను  బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం  న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు.

సిరిసిల్ల‌ రాజేశ్వరి మృతి

అంగవైకల్యాన్ని ఎదురించి, తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచిన కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని తన ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. దివ్యాంగురాలైన .. ఆ యువతి కాళ్లతో ఎన్నో కవితలు రాసింది. ఆమె కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. నడవలేని స్థితిలో కూడా మంచానికే పరిమితమై.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను కవితల రూపంలో 500కు పైగా కవితలు రాసి ఈ లోకాన్ని ఆకర్షించింది.

రాబోయే 40 రోజులు కీలకం

కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో  కొవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. మహమ్మరి కట్టడికి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మరిన్ని కీలక సూచనలతో పాటు, హెచ్చరికలనూ జారీ చేసింది. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లు వాడాలని చెప్పింది. రానున్న 40 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కేంద్రం సూచించింది. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.

సెకండ్‌ బూస్టర్ హానికరం!

భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్ కో వాక్’ ను కేవలం ఫస్ట్ బూస్టర్ డోస్ గా వాడాలని డాక్టర్ ఎన్కే అరోరా సూచించారు.  కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ అరోరా.. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై కీలక సూచనలు చేశారు. ఇప్పటికే బూస్టర్ డోస్ గా ఇతర వ్యాక్సిన్లను తీసుకున్న వారికి నాలుగో డోస్ అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవలే కొవిన్ పోర్టల్ లో ఇన్ కో వాక్ ను ఇంట్రడ్యూస్ చేశారు. జనవరి చివరి వారం నుంచి ఈ ముక్కు వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారని తెలిపారు. ఒకే రకమైన యాంటీజెన్స్ ను పదే పదే ఇవ్వడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన తగ్గుతుందని డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు. 

మోదీ తల్లికి అనారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అహ్మదాబాద్ లోని యూఎన్‌ మెహతా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. తల్లి హీరాబెన్ ను ప్రధాని మోడీ పరామర్శించారు. చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. గంటసేపు అక్కడే ఉండి చికిత్సకు సంబంధించిన వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మోడీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు హెల్త్ బుటిలెన్ రిలీజ్ చేశారు. హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

తెలంగాణ అప్పులపై ఏపీ సీఎం ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోడీని సీఎం జగన్ అభ్యర్థించారు. టీఎస్ డిస్కమ్‌లు తమ రాష్ట్రానికి బకాయి పడిన రూ.6,886 కోట్లను వెంటనే ఏపీ జెన్‌కోకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ జిల్లాల సంఖ్య 26కు పెరిగిందని, ప్రజల వైద్య అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి మరో 14 మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కోరారు.

ఓపెనింగ్‌కు సిద్ధమవుతున్న పార్లమెంట్

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  తొలి ప్రసంగం చేయనున్నారు. తర్వాత పాత పార్లమెంట్‌లోనే బడ్జెజ్ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతానికి లోక్ సభ మాత్రమే సిద్ధం కాగా.. రాజ్యసభతో పాటు పలు విభాగాల్లో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలోనే 13 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది. 

ఆ ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు: రేవంత్​రెడ్డి

12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలపై విచారణ జరగాలని ఆయన మీడియాతో చిట్ చాట్​లో మాట్లాడారు. త్వరలోనే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

గ్రామ పంచాయతీల నిధులపై‌ సర్కార్ పెత్తనం

గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమచేసిన నిధులు ఖాళీ అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇతర ఖర్చులకు వాడుకుంది. దీంతో సర్పంచులు లబోదిబోమంటున్నారు.  ప్రభుత్వం తీరును నిరసిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, వాంకిడి మండలంలో 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రం నేరుగా పంచాయతీల ఖాతాల్లో నిధులు జమచేస్తే.. దానికి సంబంధించిన డిజిటల్ కీని ప్రభుత్వం తన వద్దనే ఉంచుకుని ఆ నిధులను వాడుకునేందుకు వీలులేకుండా చేసిందని సర్పంచులు మండిపడుతున్నారు. సర్పంచ్‌లకు ప్రతిపక్ష నేతలు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి తదితరులు మద్దతు పలికారు. నిధుల మళ్లింపుపై ఎంక్వైరీ చేయాలని కేంద్రానికి సంజయ్ లేఖ రాశారు.

పుల్లారెడ్డి కుటుంబంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి,  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రజ్ఞారెడ్డి లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. వరకట్నం కోసం తనను హింసిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రజ్ఞారెడ్డి పేర్కొన్నారు.  ఈ వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీకి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు.

ఖతార్‌లో మెస్సీ మ్యూజియం

ఫుట్ బాల్ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ విజయానికి ప్రతీకగా ఖతార్ లో ఓ ప్రత్యేకమైన మినియేచర్ మ్యూజియం రూపుదిద్దుకోబోతోంది. అతను పిఫా ఫుట్ బాల్ 2022 ఛాంపియన్ షిప్ సమయంలో బస చేసిన గది.. ఇకపై మ్యూజియంగా రూపాంతరం చెందబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఖతార్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అర్జెంటీనా నేషనల్ టీమ్ బస చేసిన గదుల ఫొటోల శ్రేణిని ప్రచురించిన ఖతార్ విశ్వవిద్యాలయం … చివరి పోస్ట్‌లో అర్జెంటీనా కెప్టెన్ ఉపయోగించిన గది B201 మ్యూజియంగా మారుతుందని ప్రకటించింది.

రామప్ప ఆలయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన పూజారులు. రాష్ట్ర పతి వెంట సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయకరరావు, శ్రీనివాస్ గౌడ్

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here