వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్. బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఫ్యాక్షన్ మూవీస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే.. ఫ్యామిలీ మూవీస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి వాళ్ళతో సరిసమానంగా నిలిచాడు వెంకీ. కుటుంబంతో కలిసి హాయిగా చూసేలా ఉంటాయి వెంకీ సినిమాలు. ప్రేమించుకుందాం.. రా..! నుంచి రాజా వరకు వరుసగా అరు హిట్స్ కొట్టిన హీరో వెంకీకి శీను మూవీ వరుస విజయాలకి బ్రేక్ వేసింది. ఈసారి చేయబోయే సినిమాతో మంచి హిట్ కొట్టాలని అనుకున్నాడు వెంకటేష్.. అయితే అప్పటికే తమిళ్‌లో పూచుడవ అనే ఓకే ఒక్క మూవీ చేసిన దర్శకుడు ఉదయశంకర్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకటేష్. ఆ కథే ‘కలిసుందాంరా’
అయితే ముందుగా ఈ సినిమాకు నాగార్జునను హీరోగా అనుకున్నాడట ఉదయ్ శంకర్.. వెళ్లి నాగార్జునకు కథ వినిపిస్తే అప్పటికే చంద్రలేఖ, సీతారామరాజు లాంటి ఫ్యామిలీ మూవీస్‌కి కమిట్ అయిన నాగార్జున మళ్ళీ ఫ్యామిలీ మూవీ ఎందుకని ఈ కథని రిజెక్ట్ చేశాడట. అయితే ఈ కథ బాగుందని, హీరో వెంకటేష్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని ఉదయ్ శంకర్ కు సజెస్ట్ చేశారట నాగార్జన. దీంతో ఈ కథ వెంకీ వద్దకు వెళ్ళింది. ఇక ఈ సినిమాకి ముందుగా అంజల జవేరిని హీరోయిన్‌గా అనుకున్నారట.. వెంకీతో ఆమెను ఓ ఫోటో షూట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెను వద్దనుకొని సిమ్రాన్‌ని తీసుకున్నారు. ఇక్కడో విశేషం ఏంటంటే ఉదయశంకర్ మొదటి సినిమా పూచుడవ సినిమాలో కూడా హీరోయిన్ సిమ్రాన్ కావడం.
సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.వెంకీ రెమ్యునరేషన్ కాకుండా సుమారు నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కలిసుందాంరా సినిమా 2000 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిల్లలతో సరదాలు, మరదలితో సరసాలు, ఇంట్లో వాళ్ళతో అనుబంధాలు, ఆప్యాయతలు, తాతమనవడి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది కలిసుందాం రామ్. విడుదలైన 76 కేంద్రాలలో 100 రోజులు ఆడడం విశేషం.ఇక 17 కేంద్రాలలో 175 రోజులు, 3 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శింపబడి 25 కోట్ల స్టన్నింగ్ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం విశేషం.