ఆహ్లాదం తాడ్వాయి అడవుల్లో ఆనందం

ఒత్తిడితో కూడిన నగర జీవనం నుంచి ప్రకృతి మధ్య ఉపశమనం పొందేందుకు తాడ్వాయి అడవులు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్నాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో దట్టమైన అడవుల్లో తాడ్వాయిలో కొత్తగా నిర్మించిన కాటేజీలు కేంద్రంగా ప్రకృతి అందాలను ఆస్వాదించ వచ్చు. కేవలం రెండు వేల రూపాయల ప్యాకేజీతో ఇద్దరు ఇరవై నాలుగుగంటల పాటు ఒత్తిడిని జయించి బాల్య స్మతులను నెమరు వేసుకోవచ్చు.


రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు గంటల పాటు అమలవుతున్న అన్ని టూరిజం ప్యాకేజీల కన్నా తాడ్వాయి ప్యాకేజీ చవక. కేవలం రెండు వేల రూపాయల ప్యాకేజీలో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు ఉండవచ్చు. ఇందులో వసతి, రవాణా ఖర్చులు అన్ని ఉన్నాయి. వరంగల్‌ నుంచి డెబ్పై కిలోమీటర్ల దూరంలో ఏటూరునాగారం అభయారణ్యంలో తాడ్వాయి మండల కేంద్రానికి అరకిలోమీటరు దూరంలో అడవిలో కాటేజీలు నిర్మించారు. ప్రధాన రహదారికి పక్కనే ఈ కాటేజీలు ఉన్నా దట్టమైన అడవిలో ఉన్నట్లుగా ఉంటుంది. పెద్దవైన చెట్ల మధ్యన నిర్మించిన ఈ కాటేజీల గుండా వర్షకాలంలో పిల్లకాలువలు ప్రవహిస్తుంటాయి. వర్షకాలంలో వర్షపు చినుకుల మధ్య ఇక్కడ బస చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఒకే సారి పద్నాలుగు మంది ఇక్కడ బస చే యవచ్చు.


వీకెండ్‌లో ఈ ప్యాకేజీకి ఎక్కువగా డిమాండ్‌ ఉంటోంది. శనివారం సాయంత్రం ఐదు గంటల కల్లా తాడ్వాయి వనకుటీర్‌ (కాటేజీలు) వద్దకు చేరుకోవాలి. రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. ఆదివారం ఉదయం వేళ అడవుల్లోకి వెళ్లి వాకింగ్‌ చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు అటవీ శాఖ వారు నిర్దేశించిన దారుల్లో సుమారు ఐదు నుంచి పదికిలోమీటర్ల పాటు బృందాలగా సైక్లింగ్‌ చేయవచ్చు. పచ్చని చెట్ల మధ్య ఎగుడు దిగుడుగా ఉన్న మట్టిరోడ్లపై స్పోర్ట్స్‌ సైకిల్‌పై తిరగడం చక్కని అనుభూతిని ఇస్తుంది. సైక్లింగ్‌ అనంతరం అల్పాహారం తీసుకోవచ్చు.

రాకాసి సమాధులు
అల్పాహారం ముగిసిన తర్వాత తాడ్వాయి వన కుటీరలకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాకాసి సమాధుల వద్దకు తీసుకెళ్తారు. రాతియుగానికి సంబంధించిన ఈ మానవుల సమాధులను డోల్మన్‌ సమాధులు అంటారు. దామెరవాయి వద్ద సుమారు వందకు పైగా ఇటువంటి సమాధులు వరుసగా కొలువుతీరి ఉన్నాయి. అడవిలో సుమారు నాలుగైదు కిలోమీటర్లు కర్రల సాయంతో గుట్టలు ఎక్కుతూదిగుతూ ఈ ప్రయాణం సాగుతుంది. పచ్చని అ డవిలో చెమట చుక్కలు చిందిస్తూ సాగే ఈ ప్రయాణం చక్కని జ్ఞపకాలను జత చేస్తుంది. సమాధుల దర్శనం అనంతరం ఆసక్తి ఉన్న వారు మేడారం సమీంలో ఉన్న కొండేటీ వ్యూ పాయింట్‌ వద్దకు సైక్లింగ్‌ చేసుకుంటూ వెళ్లవచ్చు. తాడ్వాయి అడవులను మించిన దట్టమైన అడవులు కొండేటీ గుట్టల్లో ఉన్నాయి. జంపన్నవాగు కొండేటీ గుట్ట వద్ద మెలికలు తిరిగే చోటున ఎల్తైన ప్రదేశంపై వ్యూ పాయింట్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి అడవిని, వాగును ఒకేసారి చూడటం చక్కని అనుభూతిని మిగుల్చుతుంది. అదృష్టం బాగుంటే అడవీ జంతువులు తారసపడవచ్చు.

లక్నవరం
మధ్యాహ్న భోజనం అనంతరం తాడ్వాయి వన్‌ కుటీర్‌ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం సరస్సకు చేరుకుంటారు. అక్కడ వేలాడే వంతెనపై నడక కనుల విందుగా ఉంటుంది. అక్కడ బోటింగ్‌ ద్వారా లక్నవరం సరస్సు మధ్యలో ఉన్న మరో దీవికి చేరుకోవచ్చు. ఇతర వాటర్‌ గేమ్స్‌ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లక్నవరం సందర్శన అనంతరం తిరుగు ప్రయాణం ఉంటుంది.

ఆన్‌ డిమాండ్‌
పర్యాటకుల నుంచి వచ్చే డిమాండ్‌ అధారంగా తాడ్వాయి ఫారెస్టు లేదా లక్నవరం అడవుల్లో రాత్రి వేళ ఫైర్‌ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. లక్నవరం దగ్గరైతే దట్టమైన అడవిలో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి నైట్‌ క్యాంపును నిర్వహిస్తున్నారు. వీటితో పాటు పర్యాటకుల కోరిక మేరకు అందుబాటులో ఉంటే ఓపెన్‌ టాప్‌ జీప్‌ ద్వారా ఈ అడవుల్లో సఫారీకి వెళ్లవచ్చు. ఆన్‌ డిమాండ్‌ సర్వీసులు కాకుండా ఆసక్తి ఉన్న వారు మరొకరోజు ఇక్కడ బస చేస్తే మేడారం సమ్మక్క సారలమ్మ, రామప్ప ఆలయం, బొగత జలపాతం, మల్లూరు లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయాలను సందర్శించుకోవచ్చు.

హైదరాబాదీలే అధికం
తాడ్వాయి ఏకోటూరిజం ప్యాకేజీని హైదరాబాదీలే ఎక్కువగా ఆదరిస్తున్నారు. గత ఏడాది కాలంగా వీకెండ్‌లో రెండు వారాల ముందుగానే కాటేజీలు బుక్‌ అయిపోతున్నాయి. శని, ఆదివారాలు సెలవు ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బృందాలుగా ఇక్కడకు వస్తున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అంతేకాదు ఈ అడవుల్లో దిగే ఫోటోలకు సోషల్‌ మీడియాలో చక్కని స్పందన వస్తుండటంతో స్థానికంగా ఉన్న యువత ఇక్కడకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.
––––––––––––––––––––––––––––––––––––––

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here