Homelatestహైదరాబాద్​లో ఐటీ జాబ్స్​ ఊస్ట్.. ఇస్రో సక్సెస్​.. షిర్డీ బాబాకు పన్ను మాఫీ.. ఓటు ఉంటేనే...

హైదరాబాద్​లో ఐటీ జాబ్స్​ ఊస్ట్.. ఇస్రో సక్సెస్​.. షిర్డీ బాబాకు పన్ను మాఫీ.. ఓటు ఉంటేనే అక్కడ కాలేజీ సీటు..

1. హైదరాబాద్​లో 12 వేల ఐటీ జాబ్స్​ ఊస్ట్

ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న ఇల్లీగల్​ లే ఆఫ్స్​తో  ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణలో సుమారు 12 వేల ఐటీ ఎంప్లాయీస్​ వారి ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో ఎక్కువ పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులే ఉన్నారు. చాలా కంపెనీలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. నేరుగా మిమ్మల్ని తొలిగించాం.. అంటూ ఒక్క మెయిల్​తో జాబ్ నుంచి తొలగిస్తున్నాయి.  

2. ఇస్రో రాకెట్ సక్సెస్‌.. 9 ఉపగ్రహలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అద్భుతం సృష్టించింది. శనివారం ఉదయం 11 గంటల 56 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. ఇందులో 960 కేజీల ఓషన్ శాట్-3 తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో భూటాన్ కు చెందిన శాటిలైట్ భూటాన్ శాట్ కూడా ఉంది.

3. గొత్తికోయలపై నిషేధం!

చండ్రుగొండ ఎఫ్ఆర్‌‌వో శ్రీనివాస్‌ రావు హత్య నేపథ్యంలో బెండాలపాడు గ్రామంలో శనివారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. బెండాలపాడు గ్రామ శివారు లోని ఫారెస్ట్ లోని ఎర్రబోడు లో  నివసిస్తున్న గొత్తికోయలను వారి రాష్ట్రమైన ఛత్తీస్ ఘడ్ కు పంపేలా గ్రామసభలో సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏక గ్రీవ తీర్మానం చేశారు. శ్రీనివాసరావు హత్య తర్వాత గొత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.

4. ఓటుంటేనే కాలేజీ సీటు

కాలేజీల్లో అడ్మిషన్‌ పొందాలంటే 18 ఏండ్లు పైబడిన స్టూడెంట్లకు ఓటరు రిజిస్ట్రేషన్‌ను కంపల్సరీ చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్‌ హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌లో 50 లక్షల మంది స్టూడెంట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, 32 లక్షల మంది మాత్రమే రిజిస్టర్‌‌ చేసుకున్నారు. దీంతో యూనివర్సిటిల్లో, కాలేజీల్లో అడ్మిషన్‌ పొందాలంటే.. ఓటు హక్కు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమలవుతుందని ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు.

5. చైనాలో మళ్లీ కరోనా

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజైన శుక్రవారం రికార్డు స్థాయిలో 35,909 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన ఇన్​ఫెక్షన్స్, ఏప్రిల్​ మధ్యలో రికార్డైన కేసులను అధిగమించాయని తెలిపింది.

6. ఇండియాను వదిలేసిన 9 లక్షల మంది

సగటున రోజూ 365 మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకుని, విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నారు. 2015 మొదలుకుని, 2021 వరకూ 9,32,276 మంది ఇండియా సిటిజెన్‌షిప్‌ను వదులుకున్నట్టు కేంద్ర హోమ్‌శాఖ వెల్లడించింది. విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు, ఆయా దేశాల సిటిజెన్‌షిప్ పొందేందుకు మన దేశ సిటిజెన్‌షిప్‌ను జనాలు స్వచ్చందంగా  వదులుకుంటున్నారని పేర్కొంది.

7. షిర్డీ బాబాకు రూ.175 కోట్ల పన్ను మినహాయింపు

షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయ ట్రస్ట్‌కు రూ.175 కోట్ల ఆదాయ పన్ను మినహాయింపును ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయిబాబా ఆలయంలోని హుండీలలో భక్తులు వేసిన సొమ్ముకు పన్ను విధిస్తూ గతంలో ఆదాయపన్ను అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఆలయ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పన్ను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది.

8. స్టూడెంట్స్‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో కాంబినేషన్ టికెట్  ధరను రూ.20 నుంచి రూ. 10 కి తగ్గిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ శనివారం ప్రకటించారు. సిటీ బస్ పాస్ కలిగిన స్టూడెంట్స్ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించే టైమ్‌లో దీనిని ఉపయోగించుకోవచ్చు.

9. చంద్రుడి కక్ష్యలోకి ఒరియన్ క్యాప్య్సూల్‌

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఒరియన్ క్యాప్స్యూల్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అనుకున్న గమ్యస్థానంలో ఒరియన్ సగం దూరం దాటింది. ఈ కక్ష్యలో క్యాప్స్యూల్ ఓ వారం పాటు ఉంటుందని, తర్వాత భూమికి తిరిగి వస్తుందని నాసా సైంటిస్టులు తెలిపారు. శుక్రవారం కక్ష్యలోకి ప్రవేశించిన క్యాప్స్యూల్.. ప్రస్తుతం భూమికి 3.80 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందని వారు వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే మరింత దూరం ప్రయాణించి 4.32 లక్షల కిలోమీటర్లు దాటుతుందని చెప్పారు. ఏదో ఒకరోజు ఈ క్యాప్స్యూల్ లో మనుషులను పంపాలన్నదే తమ లక్ష్యమని ఒరియన్ మేనేజర్ జిమ్ జెఫ్రీ తెలిపారు. 2024లో చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేయాలని నాసా ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఒరియన్ క్యాప్స్యూల్ ను ట్రయల్ గా ప్రయోగించింది. చంద్రుడిపై చివరిసారిగా నాసా 50 ఏండ్ల క్రితం అపోలో 17లో మానవసహిత యాత్ర నిర్వహించింది.

10. కూచిపూడి ప్రదర్శన ఇచ్చిన బ్రిటన్ ప్రధాని బిడ్డ

యునైటెడ్​ కింగ్​డమ్​లో జరిగే అతిపెద్ద డ్యాన్స్ షోలో బ్రిటన్​ ప్రధాని కూతురు అనౌష్య సునాక్ ​కూచిపూడి నాట్య ప్రదర్శన చేసింది. ‘రంగ్’ ఇంటర్నేషనల్​ కూచిపూడి డ్యాన్స్​ ఫెస్టివల్–2022లో పలువురు చిన్నారులతో కలిసి శుక్రవారం ఆమె నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. నాలుగేండ్ల వయసు నుంచి 85 ఏండ్ల మధ్య ఉన్న సుమారు 100 ఆర్టిస్టులు ఈ డ్యాన్స్​ ఫెస్టివల్​లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc