విడుదలైన టీచర్ల బదిలీల షెడ్యూల్
తెలంగాణలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ ప్రకటించింది. 27వ తేదీన కేటగిరీల వారీగా వేకెన్సీ లిస్టు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ లిస్టు విడుదల చేస్తారు. జనవరి 28వ తేదీ నుంచి 30 వరకు ఆన్లైన్లో ట్రాన్స్ ఫర్ల అప్లికేషన్లు స్వీకరిస్తారు. మార్చి 4న బదిలీల ఉత్తర్వులు వెలువడుతాయి. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరించి 15 రోజుల్లో వాటిని పరిష్కరిస్తారు. ఈసారి దాదాపు 9700 మందికి ప్రమోషన్లు దక్కుతాయి. సుమారు 30 వేల మంది బదిలీ అవుతారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు 2.78% డీఏ
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం డీఏ (కరువు భత్యం) మంజూరు చేసింది. పెండింగ్‌లో ఉన్న మూడింటిలో ఒక డీఏ క్లియర్ చేసింది. ప్రస్తుతం 2.78% డీఏ మంజూరు చేసింది. 2021 జులై 1వ తేదీ నుంచి పెరిగిన డీఏ వర్తింపజేసింది. పెంచిన డీఏతో కూడిన వేతనాన్ని ఫిబ్రవరిలో అందించనుంది. డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది. పెన్షన్లరకు పెంచిన డీఏను వర్తింపజేసింది.
అమెజాన్ ఎయిర్ కార్గో ప్రారంభించిన కేటీఆర్
వినియోగదారులకు తమ వస్తువులను మరింత వేగంగా అందించేందుకు అమెజాన్ మరో అడుగు ముందుకేసింది. అమెజాన్ ఇండియా సొంతంగా సరుకుల రవాణాకు విమానాలను ప్రారంభించింది. అమెజాన్ ఎయిర్ పేరుతో ఈ కార్గోను ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కేటీఆర్ ఈ విమానాన్ని ప్రారంభించారు.
స్పౌస్ టీచర్ల బదిలీలపై బీజేపీ ఉద్యమం
భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని మహిళా టీచర్లు పిల్లలతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తే.. కేసీఆర్ సర్కార్ వారి పట్ల రాక్షసంగా వ్యవహరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. లంచాల కోసమే 13 జిల్లాల్లో టీచర్ల బదిలీలు ఆపేశారని ఆరోపించారు. 317 జీవో సహా ఉద్యోగులు, టీచర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశం చర్చిస్తామన్నారు.
కొమురవెల్లిలో పెద్దపట్నం
సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన పెద్దపట్నం కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణకట్ట వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేశారు. పెద్ద పట్నం, అగ్నిగుండం దాటి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే
ఈ నెల 26న రిపబ్లిక్ డే వేడుకలు రాజ్‌భవన్‌లో జరుగనున్నాయి. గణతంత్ర వేడుకలు గతంలో పేరేడ్ గ్రౌండ్ లో జరిగేవి. కరోనా తర్వాత వేదిక పబ్లిక్ గార్డెన్‌కు మారింది. గత ఏడాది ఈ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో రాజ్‌భవన్‌లో గవర్నర్ వేడుకలు నిర్వహించారు. ఈసారి కూడా ప్రభుత్వం నిరాసక్తంగా ఉండటంతో రాజ్‌భవన్‌లో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు.