తెలంగాణ ప్రభుత్వం సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల స్కీమ్ అమలు చేస్తోంది. దీనికి ఎలా అప్లై చేయాలి.. ఎవరెవరు ఈ స్కీమ్‌కు అర్హులవుతారు..? ఏమేం నిబంధనలున్నాయో తెలుసుకుందాం.
రూ. 3 లక్షల స్కీమ్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేసింది. త్వరలోనే కేబినేట్లో ఆమోదించి పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభమవనుంది. 15 రోజుల్లో స్కీమ్ అమలు చేస్తామని ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మార్గదర్శకాలు
- సొంత జాగా ఉండి.. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలందరూ ఈ స్కీమ్‌కు అర్హులవుతారు.
- ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.3లక్షల సాయాన్ని అందజేస్తారు. మూడు విడతలుగా ఈ సాయం అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
- ఇంటి నిర్మాణానికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. ఈ భూమి తమ సొంతమై ఉండాలి.
- మహిళా లబ్ధిదారుల పేరిటే ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
- గ్రామాల వారీగా అర్హుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారు.
- తహసీల్దార్, ఎంపీడీవోలు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారు. వీటిని కలెక్టర్ ఆమోదిస్తారు.
- జిల్లా కలెక్టర్లు పంపించిన జాబితాలను ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తారు
- డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాల్లో ముందుగా ఈ స్కీమ్ అమలు చేస్తారు.
- గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు ఈ పథకానికి అనర్హులు.
- ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డేటా ఆధారంగా అనర్హులను ఏరివేస్తారు.
- ముందుగా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా రూ.3 లక్షల సాయమే అందిస్తారు.