పెండ్లిళ్లకు పోవద్దు.. కరోనాపై మోదీ కీలక ఆదేశాలు.. హీరో నాగార్జునకు షాక్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

పెండ్లిళ్లు, పేరంటాలకు వెళ్లొద్దు:ఐఎంఏ

విదేశాల్లో కరోనా విజృంభిస్తున్నందున కొంతకాలం పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు సూచించింది. ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పింది. యూఎస్, చైనా, జపాన్, సౌత్ కొరియాలో రోజుకు దాదాపు 5 లక్షల కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది.ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ చేయాలని సూచించింది. విదేశీ ప్రయాణాలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దని, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొంది.

కోవిడ్‌పై మోదీ సమీక్ష:


కోవిడ్‌పై పీఎం నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. వైద్య శాఖాధికారులతో తాజా పరిస్థితిని, సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికేసులున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. జనసమర్థ్యం ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. ఎయిర్‌పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలని ఆదేశించారు. వృద్ధులు, వయసులో పెద్దవారు ప్రికాషనరీ డోస్ తీసుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

సర్కార్‌‌కు షాక్ ఇచ్చిన గ్రీన్ ట్రిబ్యునల్


తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ షాక్‌ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ స్కీముల్లో పర్యావరణ ఉల్లంఘనలకు రూ.920 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా కేఆర్‌ఎంబీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ స్కీములను చేపట్టి రిజర్వ్‌ ఫారెస్టులో పనులు చేస్తూ పర్యావరణ నష్టం చేకూరుస్తుందని దాఖలైన పిటిషన్లను విచారించి, గురువారం తీర్పు చెప్పింది.

డబ్బుల కోసం కేంద్రం ఒత్తిడి: కేటీఆర్


రైతులు పంట కల్లాలు నిర్మించుకునేందుకు ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోందని, పంట కల్లాల నిధులపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలు ఆరబోసుకునేందుకు కల్లాలు నిర్మిస్తే ఉపాధి హామీ నిధుల దారి మళ్లింపు అంటూ కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తమ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు.

ఇక మేమందరం ఒక్కటైతం:


కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, ఒకట్రెండు రోజుల్లో నేతలంతా కలిసి మీడియా ముందుకొస్తారని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్గం, సీఎల్పీ నేత భట్టి వర్గంలో ఆ పార్టీ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇరువర్గాల వాదనలు విని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​లో కోవర్టులెవరూ లేరన్నారు. పార్టీ నేతలంతా ఐకమత్యంగా ఉండేందుకు దిగ్విజయ్ సింగ్ కొన్ని సలహాలిచ్చారని, తానూ కొన్ని సలహాలు చెప్పానని జగ్గారెడ్డి తెలిపారు.

పాలమూరుకు వరాలు:


మహబూబ్ నగర్‭లో వెయ్యి పడకల ఆధునిక ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నర్సింగ్ కళాశాలకు రూ.50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాలో క్యాథలాబ్, క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాకు బీఎస్సీ పారమెడికల్ కళాశాల మంజూరు చేసి 6 కోర్సులకు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు.

హామీలన్నీ నెరవేరిస్తే చెప్పుతో కొట్టుకుంటా: సంజయ్


కేటీఆర్ డ్రగ్స్ తీసుకోవడం మానేశాడని.. అందుకే డిప్రెషన్లో వెళ్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చితే, కేటీఆర్ చెప్పినట్టు తాను చెప్పుతో కొట్టుకుంటానని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికే సంస్కారం లేదని, అయ్య, కొడుకు, బిడ్డ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అదంతా ఫేక్:


చైనా తదితర దేశాల్లో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఓ వాట్సాప్ మెసేజ్ వేగంగా చక్కర్లు కొడుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ వేగంగా వ్యాపిస్తోందని, ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని, దీనివల్ల మరణాల రేటు అధికంగా ఉంటుందని ఈ మెసేజ్ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా గతంలో వచ్చిన వేరియంట్ల లక్షణాలకన్నా కన్నా దీని లక్షణాలు పూర్తిగా భిన్నమైనవని చెప్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఇది తప్పుదోవ పట్టించే మెసేజ్ అని, బూటకపు మెసేజ్ అని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌ను నమ్మవద్దని, ఇతరులకు పంపించవద్దని ప్రజలను కోరింది.

బీఆర్‌‌ఎస్‌ ఎల్పీగా మారిన టీఆర్‌‌ఎస్‌ ఎల్పీ


టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీగా మార్చారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ పేరును బీఆర్‌ఎస్‌ ఎల్పీగా మార్చాలని కోరుతూ శాసనసభ పక్షనేత కేసీఆర్‌.. గురువారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభ పక్షనేత విజ్ఞప్తికి స్పీకర్‌, మండలి చైర్మన్‌ వెంటనే ఆమోదం తెలిపారు. స్పీకర్‌, మండలి చైర్మన్‌ అనుమతితో లెజిస్లేటివ్‌ పార్టీ సెక్రటరీ నర్సింహాచార్యులు గురువారం సాయంత్రం వేర్వేరు బులెటిన్లు జారీ చేశారు. అసెంబ్లీ, శాసన మండలి రికార్డుల్లో మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

యాత్రను ఆపేందుకే కరోనా నాటకం


భారత్ జోడో యాత్రను ఆపేందుకే కేంద్ర ప్రభుత్వం కరోనా సాకులు చెబుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనా రూల్స్ పాటించలేకపోతే యాత్రను ఆపాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లెటర్ రాయడంపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రస్తుతం హర్యానాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్.. గురువారం నూహ్ జిల్లాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

గోవాలో నాగార్జునకు నోటీసులు:


టాలీవుడు కింగ్ నాగార్జున‌కు గోవాలోని మాండ్రెమ్ గ్రామ పంచాయ‌తీ నోటీసులు జారీ చేసింది. ఆ గ్రామ పరిధిలో ఆయన కొత్త హోటల్ నిర్మిస్తున్నారు. గ్రామపంచాయతీ నుంచి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని నాగార్జునకు సర్పంచ్ నోటీసులు జారీ చేశారు. నిర్మాణ ప‌నులు ఆప‌క‌పోతే చ‌ట్టపర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని పాప మృతి:


ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. గొంతులో పెన్సిల్‌ పొట్టు ఇరుక్కుకొని ఆరేళ్ల పాపా మృతి చెందింది. హమీర్‌పూర్‌ కొత్వాలి ప్రాంతంలోని పహాడీ వీర్ గ్రామానికి చెందిన నందకిషోర్‌కు కుమారుడు అభిషేక్ (12), కుమార్తెలు అన్షిక (8), అర్తిక (6) ఉన్నారు. బుధవారం సాయంత్రం టెర్రస్‌పై చదువుకుంటున్నారు. హోమ్‌వర్క్ చేయడానికి కూతురు అర్తిక పెన్సిల్‌ షార్ప్‌నర్‌ను నోట్లో పెట్టుకొని పెన్సిల్‌ను చెక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పెన్సిల్‌ను చెక్కగా వచ్చిన పొట్టు గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆ తర్వాత గొంతుకు అడ్డుగా పడడంతో బాధతో నేలపై పడిపోయింది. వెంటనే ఆమెను దవాఖానకు తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here